Wednesday, July 30, 2008

నిరీక్షణం


నిశీధి వేళలో వేకువ కోసం వెతుకుతున్నా
చేజారిన స్వప్నం మెలుకువకి ఎదురవుతుందేమోనని !!

అలలై పొంగిన కన్నీటి చారికల వెంబడి పరిగెడుతున్నా
సంతత బాష్పబిందువుల కెరటాలు ముంచెత్తుతాయేమోనని !!

శిలలై, పెదవి దాటని మాటలకోసం తడుముకొంటున్నా
ప్రతిక్షణం నిరీక్షణంలో క్షణాలు యుగాలవుతాయేమోనని !!

కాలపు గమన గడియారం చేసే సవ్వడిని భరించలేకున్నా
ప్రతిఎడబాటు తీక్షణంలో నిముషాలు శరాఘాతాలు అవుతాయేమోనని !!

మిగిలిన జ్ఞాపకపు పుస్తకంలో ప్రతి పుటనీ వెతుకుతున్నా
ప్రతిఅక్షర వీక్షణంలో గుండెగదిలో ముద్రించుకొన్న పాదముద్రలు ఉన్నాయేమోనని !!

మసకబారిన కనులతో ఎదలో దాగిన ప్రతి ఉత్తరాన్నీ చదువుతున్నా
మిగిలిన శిలాక్షరాలు అంతం కాని శోకపు ఉప్పెనని నిలుపుతాయేమోనని!!

Wednesday, July 23, 2008

కాలం ఆగని ఈ క్షణం

ఇది చదివే ముందర కాలం ఆగిన ఆ క్షణం చదవండి.
===============================================================

కాలం ఆగని ఈ క్షణం

===============================================================

సీనియర్ల గుంపు ఎదురయ్యి మమ్మల్నందరిని కాంటీన్ కి తీసుకెళ్ళి బాగా క్లాసు పీకారు. "కాలేజీలో ఎమన్నా ప్రాబ్లం ఉంటే కాలేజీ లోనే solve చేసుకోవాలి, అంతేకాని వాటిని ఇంటి దాకా తీసుకెళ్ళి అనవసరమైన issues చెయ్యకూడదు" అంటూ ఏవేవో లెక్చర్లు ఇచ్చారు. వీరికేం తెలుసు అందరూ వీరిలాగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోలేరు కదా? తొందరలోనే freshers-day పార్టీ అయిపోయింది. ఇక సీనియర్లందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

ఇలా మనం కాలేజీ చదువు వెలగబెడుతున్నప్పుడు, మధ్య మధ్యలో నాకేమన్నా doubts వస్తే మా అనురాధా ఆంటీ వాళ్ళ తమ్మున్ని అడిగేదాన్ని ఫోన్ లోనే లెండి. అతను ఓపికగా అన్నీ వివరించి చెప్పేవాడు. అలా "మీరు" లోంచి నెమ్మదిగా "నువ్వు" లోకి మారి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. అతనితో మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు తెలిసేవి. చాలా అల్లరిగా కనిపించినా అతని అలోచనాధోరణి నాకు ఆశ్చర్యమనిపించేది. పైకి ఎంతో అల్లరి చిల్లరిగా కనిపించేవారు లోపల ఎంతో ఆలోచనాపరులై ఉంటారు అన్న వాక్యం నా ఈ నేస్తాన్ని చూస్తే నిజమే అనిపించేది. కుటుంబం పట్ల, సమాజం పట్ల నిబద్దతతో ఉండాలి అనేవాడు. అతను నాకు నేస్తం కానంతవరకు కాలేజీకి వెళ్లి రావడం, ఫ్రెండ్స్ తో కబుర్లు, సినిమాలు ఇవే మన లోకంగా ఉండేవి. అనవసరంగా డబ్బు నీకోసం వృధా చేసే బదులు ఎవరన్నా ఆకలితో ఉన్నవారికోసం వెచ్చించొచ్చు కదా అనేవాడు. అవును నిజమే కదా అనిపించేది నాకు. కాని మరుసటి రోజు అంతా మామూలే. ఈ విషయం నేను నిజాయితీగా అతనికి చెబితే "మనిషి ఎవరో చెబితే మారడు, తన కేర్పడిన అనుభవాల ద్వారా మాత్రమే మారతాడు. నువ్వు ప్రయత్నించు మారేదానికి. కొంచెం social responsibility అలవరుచుకో. నీ దగ్గరున్నది అంతా పక్కన వాడికి ఇవ్వనక్కరలేదు. ఎంతో కొంతైనా పర్లేదు. అది పక్కన ఉన్నవారికి ఉపయోగపడితే చాలు." అని చెప్పేవాడు. "మనిషి ఎవరో చెబితే మారడు, తన కేర్పడిన అనుభవాల ద్వారా మాత్రమే మారతాడు" అన్న అతను చెప్పిన వాక్యం నా చిట్టిబుర్రలో ఇప్పటికీ నిలిచిపోయింది. ఇలా నా కాలేజీ చదువు పూర్తి అయిపొయింది. ఉద్యోగ ప్రయత్నాలకోసం మొట్టమొదటిసారిగా అమ్మానాన్నల్ని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి హైదరాబాదు రావలసి వచ్చింది. "నీకే ప్రాబ్లం వచ్చినా మా తమ్మున్ని కాంటాక్ట్ చెయ్యి. వాడు నీకే సహాయం కావలసి వచ్చినా చేస్తాడు" అన్న అనురాధా ఆంటీ మాటల్ని నెమరువేసుకుంటూ కన్నీరు ఉబుకుతుండగా, మనస్సును ఎవరో మెలిపెట్టినట్లుండగా, తడబడుతున్న అడుగులతో హైదరాబాదులోకి అడుగుపెట్టాను.

హైదరాబాదులో ఎవ్వరూ సరిగ్గా తెలియదు, దూరపుబంధువులున్నా వారు నిజంగా చాలా "దూరపు"బంధువులే. హైదరాబాదే సరిగ్గా తెలియకపోతే ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఏం మొదలు పెడతాం చెప్పండి? కాని నాకీ ప్రశ్నే ఎదురుకాలేదు. నా నేస్తం నాకన్నా సీనియరు అవడం వల్ల, తను already హైదరాబాదులో 4 సంవత్సరాలునుంచి ఉండటం వల్ల నాకేం పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. ఏయే కోర్సులు join కావాలి, interviews కి ఎలా prepare కావాలి, ఎక్కడెక్కడ freshers కి openings ఉన్నాయి మొదలైన విషయాలన్నీ నాకు వివరంగా చెప్పేవాడు. చెప్పడమే కాదు నన్ను దగ్గరుండి మరీ interviews కి తీసుకెళ్ళేవాడు. కానీ మనం వెలగ పెట్టిన చదువుకి మనం first round అంటే written test కే బయటికి వచ్చేసేవాళ్ళం.

ఇలా కొన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాక తను నా ప్రయత్నాలలోని "seriousness" ని కనిపెట్టాడు. ఒకరోజు తన ఫ్రెండ్స్ సర్కిల్ లోని కొంతమందిని నాకు పరిచయం చేసాడు. అమ్మాయిలు, అబ్బాయిలు నవ్వుతూ తుళ్ళుతూ సంతోషమంతా తమదే అన్నట్టుగా వున్నారు. వాళ్ళతో ఆరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆరోజు నా కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని అతను చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. "చూసావా? వీళ్ళంతా ఎంత ఆనందంగా ఉన్నారో? ఈ ఆనందానికి కారణం డబ్బు. అవును ఆర్ధికభధ్రత. ఇంత చదువూ చదివి, ఆ ఏదో చెయ్యాలి కాబట్టి ఉద్యోగం అన్నట్టుగా ప్రయత్నిస్తే నీ ప్రయత్నాలలో seriousness ఉండదు. 100% ట్రై చెయ్యకపోతే మనం ఏదీ సాధించలేము. కొన్ని ప్రయత్నాలలో నువ్వు సఫలం కానంత మాత్రాన నువ్వు నిరాశ పడనక్కరలేదు. అంతకన్నా మంచి అవకాశం మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని తెలుసుకో. నువ్వు ప్రయత్నం చేశావా లేదా అన్నది ముఖ్యం కాదు, ఎంత serious, sincere గా దానికోసం ప్రయత్నించావు అన్నది ముఖ్యం." అని అన్నాడు. "నేనేం చెయ్యను? నాకు సరైన అవకాశం రావడం లేదు" అన్నాను. అతను కొద్దిగా నవ్వి "తప్పుల్ని అవతలివారి మీదకో లేదా పరిస్థితుల మీదకో నెట్టేసే వారంటే నాకసహ్యం. నీకు అవకాశం రాలేదంటే లోపం ఎక్కడో నీలోనే ఉంది. అదేమిటో ముందు చూసుకో, దాన్ని సరి చేసుకో." అన్నాడు. ఆ మాటలు నా మీద బాగా ప్రభావం చేసాయి. నాలో కసిని, పట్టుదలను పెంచాయి. నాలో లోపాలు సరిచేసుకోవడం మొదలు పెట్టాను. అంతే ఒక నెల లోపుగానే ఒక పెద్ద MNC లో job వచ్చింది. ఆరోజు నాకన్నా ఎక్కువగా అతనే సంతోషపడ్డాడు. ఇక మా అమ్మానాన్నల సంతోషానికైతే అవధుల్లేవు. ఇలా ఆనందంగా, అందంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ఒక పెద్దమలుపు.

అమ్మ దగ్గరినుంచి ఫోన్, వెంటనే బయలుదేరి ఊరికి రమ్మని. నానమ్మకు బాలేదేమోనని హడావుడిగా వెళ్ళాను. కాని అక్కడ జరిగిన విషయం తెలుసుకొని మాట రాక నిలుచుండి పోయాను. నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా నీరు కారలేదు. అది నిర్వేదమో, నిర్లిప్తతో, వైరాగ్యమో ఏమిటో మరి. నన్నో చంటిపాపలా భావించి నా వేలు పట్టుకొని నన్ను జీవితంలో నడిపించిన నేస్తం అక్కడ అసువులు బాసి అందరికి అశ్రువులు మిగిల్చాడు. "చనిపోతే కళ్ళు దానమివ్వమని చెప్పాడమ్మా. మా అందరి చేత కూడా సంతకాలు పెట్టించాడు. కాని ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు". అంటూ అక్కడ ఏడుస్తున్న నా నేస్తపు అమ్మని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు.

గొంగళిపురుగు నెమ్మదిగా తన రూపాన్ని వదిలి అందమైన సీతాకోకచిలుక రూపాన్ని సంతరించుకున్నట్లు నేను కూడా నెమ్మదిగా ఒక అమాయకమైన యువతి నుంచి అందమైన వ్యక్తిత్వం అంటూ సంతరించుకున్నానంటే అది నా నేస్తం చలవే. "అనాధలకు సహాయం చెయ్యి, నీకోసం కొంత, సమాజం కోసం మరికొంత, దేశం కోసం అంతా" అంటూ అతను చెప్పిన మాటల్ని నేనెప్పుడు మరచిపోలేను. "అందమైన భావనలు మనస్సులోనే ఉండకూడదు అవి మదిని దాటి, కలంలో ఇంకులా మారి, ఎన్నటికి చెరిగిపోని శిలాక్షరాలవ్వాలి, ఎదలో బీజాక్షరాలవ్వాలి." అంటూ నన్ను ఎన్నడూ రాయమని ప్రోత్సహించే నా నేస్తం, ఇప్పుడు నే రాసే రాతల్ని చూసి స్పందించేదానికి నా పక్కన లేడు. "కన్నీరు చాలా విలువైనది అది మన కంటి నుంచి జాలు వారితే ఆవలి వ్యక్తి నిజంగా చాలా విలువైన వారవ్వాలి. అంత విలువైన వారెప్పుడూ నిన్ను ఏడిపించరు కాబట్టి కన్నీరు అనవసరంగా వారి కోసం కార్చకు" అంటూ నా కన్నీళ్ళు తుడిచే నేస్తం ఇప్పుడు నా కన్నీళ్ళు తుడవటానికి నా ఎదుట లేడు. మా స్నేహం చూసి కాలానికే కన్ను కుట్టిందో లేక మంచివారెప్పుడూ తొందరగా ఈ పాడులోకంనుంచి వెళ్ళిపోతారు అన్న మాట నిజమో లేక ఎవరి నిర్లక్షమో లేక ఎవరి పాపమో లేక ఇది నాకు శాపమో నా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి రెండు సంవత్సరాలైంది.
============================================================
ఇది జ్ఞాపకం కూడా కాదు, జ్ఞాపకం అంటే అప్పుడప్పుడు మదిని తట్టేది. నేను నా నేస్తాన్ని మరిచిపోతేగా తను నాకు జ్ఞాపకం అయ్యేది. నేస్తం ఈ అందమైన జీవితం నువ్వు పెట్టిన భిక్షే మరి. నీకు అశ్రుఅంజలి ఘటిస్తూ..
నీకే అంకితం.
-కల.
============================================================

కాలం ఆగిన ఆ క్షణం

జ్ఞాపకాలని అక్షర బద్దం చేద్దాం రండి అన్న మహేష్ గారి పిలుపు విని నేను రాద్దాం అనుకొన్నా. కానీ ఎన్ని జ్ఞాపకాలని రాయను? నాలో నాకే తెలియకుండా నిద్రాణమై ఉన్న జ్ఞాపకాలెన్నో. నాతో కబుర్లు చెప్పేవి కొన్ని, నా చేత కమ్మని కలలని కనిపించేవి కొన్ని, నా చేత నవ్వుల్ని రువ్వించేవి కొన్ని, నా చేత కవితలు రాయించేవి కొన్ని, కానీ ఇన్ని జ్ఞాపకాలు నాకున్నా నాచేత కన్నీరు పెట్టించేది మాత్రం ఒక్కటే. జ్ఞాపకాన్నే అక్షరబద్ధం చేయాలని అనుకొన్నా. కానీ రాయాలంటూ మొదలు పెడితే కలం కదిలితేగా. ఎలాగో ఒకలా కలం కదిలించడం మొదలుపెడితే చాలు అశ్రువులు అలా రాలిపోతూనే ఉన్నాయి. అతికష్టం మీద నా మరచిపోలేని జ్ఞాపకాన్ని మీముందర ఉంచుతున్నాను.

===============================================================

కాలం ఆగిన క్షణం.
===============================================================
"కలా, వీడు మా పిన్ని కొడుకు. I-CET ranker. నీకు సీనియర్ అవుతాడు". అన్న అనురాధ ఆంటీ పిలుపుతో వాళ్ళింట్లో కూర్చొని పేపర్ చదువుతున్న నేను తలెత్తాను. నా ఎదురుగా ఇంచుమించు ఆరడుగుల రూపం, టవల్ భుజాన వేసుకొని చిర్నవ్వుతో. నేను సమాధానంగా చిన్న చిర్నవ్వు నవ్వాను. అంతలోనే రూపం "స్నానం చేసి వస్తాను. మళ్లీ మాట్లాడుకుందాం" అంటూ వెళ్ళిపోయింది. నవ్వుల గురించి కవులు చాలా రకాలుగా వర్ణించారు. కానీ నవ్వు నా స్మృతిలో ఇంకా మెదులుతూనే ఉంది. అవునూ మీరెక్కడైనా కళ్లు నవ్వడం చూసారా? నేను చూసాను, రూపం కళ్ళతో నవ్విన నవ్వు నాకిప్పటికీ గుర్తే మరి.

లోపల మీకు అనురాధ ఆంటీ గురించి చెప్పాలి. వాళ్ళు మా ఇంట్లో బాడుగకి వచ్చి అప్పటికి 2 సంవత్సరాలు అయింది. అనురాధ అంటే స్నేహం అంట. మా ఆంటీకి పేరు వాళ్ళ అమ్మ నాన్న కర్రెక్టుగా పెట్టారు. వాళ్ళు మా ఇంట్లో join అయిన 2 రోజులకే మా తాతయ్య (మా నాన్నా వాళ్ల నాన్న. నాకీ మాత్రం తెలుగు అబ్బిందంటే అంతా ఆయన చలవే. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని ఒకొక్క పద్యం చదివి వినిపిస్తూ దాని తాత్పర్యంతో సహా చెప్పేవారు) చనిపోయారు. రోజంతా మా ఇంట్లో దీపం వెలగలేదు, ఎవ్వరమూ సరిగ్గా భోజనం కూడా తీసుకోలేదు. అప్పుడు మా ఆంటీ వచ్చి మా అందరికీ కాఫీ కలిపి ఇచ్చి మేమందరం సరిగ్గా భోజనాలు చేసేట్టు చూసుకొన్నారు. మాది రెండతస్థుల భవనం. కింద రెండు portions ఉంటాయి. పైన మా కుటుంబం అంతా ఉంటుంది. కింద ఉండే రెండు portions లో ఒక దాంట్లో అనురాధ ఆంటీ వాళ్ళు ఇంకో దాంట్లో సుమా ఆంటీ వాళ్ళు ఉంటారు. సుమా ఆంటీ వాళ్ళు అప్పటికి join అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా మా తాతయ్య చనిపొయ్యారని తెలిసి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మా అనురాధ ఆంటీ మమ్మల్ని బాగా దగ్గరుండీ మరీ చూసుకొన్నారు. ఒక్క సంఘటన చాలు అనురాధ ఆంటీ మనస్తత్వం ఏమిటో చెప్పడానికి.

రెండు సంవత్సరాలలో ఆంటీ మా కుటుంబంతో బాగా కలిసిపొయ్యారు. ఆంటీకి ఇద్దరు చిచ్చర పిడుగులు. ఒకరేమో బాబు ఇంకోరేమో పాప. ఇల్లంతా పీకి పందిరి వేసే టైపు. ఆంటీ ఎప్పుడు బాబుని తిడుతూనే ఉంటారు, ఎలా అంటే "అబ్బా వీడితో వేగలేక చస్తున్నా. వీడి కన్ని వీళ్ళ మేనమామ బుద్దులే వచ్చాయి". అప్పట్లో మేనమామ ఎవరో నాకర్ధం అయ్యేది కాదు. ఇదిగో ఇప్పుడు అర్ధం అయింది, శాల్తీనే అని. ఇంతలో బాత్రూం తలుపు తీసిన శబ్దం, రూపం తల తుడుచుకుంటూ అలా నడిచి వచ్చి నాకెదురుగా వున్న కుర్చీలో ఆశీనమైంది. అతన్ని లోపులో కొద్దిగా పరిశీలనగా చూసాను. ఆలోచనలతో కొద్దిగా ముడుతలు పడ్డ విశాలమైన నుదురు, నుదిటిమీద అల్లర చిల్లరగా పడే జుట్టు, నవ్వితే చొట్టలు పడే బుగ్గలు, పర్లేదు పిల్లాడు బానే ఉన్నాడు కాకపొతే కొద్దిగా కాదు, కాస్త బాగా మాసిన గడ్డం ఒకటి అడ్డంగా అని నేను అనుకొంటూ ఉండగా, ఇంతలో అతను తలెత్తి చిన్నగా నవ్వి "ఏమిటి నా గడ్డం గురించి ఆలోచిస్తున్నారా?" అని అడిగాడు. నేను అదిరిపడ్డాను. మొహం చూసి లేకపొతే కళ్ళను చూసి మనస్సు లోపలి భావాలను చెప్పొచ్చు అన్న సంగతి నాకు తెలుసు కానీ, ఇలా సూటిగా నా ఆలోచనలని చదివెయ్యడం నాకు చాలా ఆశ్చర్యమేసింది. కానీ నా భావాలేమి కనిపించనివ్వకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాను. "ఏం చెయ్యను? నేను షేవింగ్ చేసుకున్న ప్రతిసారీ ఎవరో ఒకరు నీకు గడ్డమే అందం రా అని చెబుతూంటే ఇక షేవింగ్ జోలికి వెళ్ళడం మానేసాను" అని అన్నాడు.

"సరే కానీ మీదే కాలేజీ?" అన్న అతని ప్రశ్నకు నేను నా కాలేజీ వివరాలందించాను. మా కాలేజీ పేరు వినగానే "ఓ ఆ కాలేజీనా? దాంట్లో మా ఫ్రెండొకడు ఉన్నాడు. మీకు సీనియర్. మీకే problem కానీ help కానీ కావలసి వచ్చినా వాడిని contact అవ్వండి. నేను కూడా వాడికి చెబుతాలెండి" అని వెంటనే తన mobile తీసి అతనికి call చేసి పలానా అంటూ నా details అన్ని ఇచ్చి "ర్యాగింగ్ అంటూ నాకు కానీ చెప్పిందా నీ తోలు తీస్తానురా" అని ఒక చిన్న సైజు వార్నింగ్ లాంటిది ఇచ్చేసాడు. కాస్త నా ముందర ఎక్కువ చేస్తున్నాడనిపించినా, నేనేమో సీనియర్లు ఎవరన్నా తెలిసుంటే రాగింగు తప్పించుకోవచ్చు కదా అనుకొని అన్నింటికీ బుద్దిగా తలూపాను. అలా అతనితో పరిచయం ఏర్పడింది. తను హైదరాబాదులో ఏ కాలేజిలో చదివేది, ఎక్కడ ఉండేది అని తన వివరాలు చెప్పాడు. ఆ రోజే రాత్రికి హైదరాబాదు వెళ్తున్నానని కూడా చెప్పాడు. ఇంతలొ మా అమ్మ పిలవడంతో తన దగ్గరినుంచి శెలవు తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను.

మరుసటి రోజు కాలేజీకి బయలు దేరాను ఆతను చెప్పిన మా సీనియరు పేరును గుర్తుకు తెచ్చుకుంటూ. నేను, నా ఫ్రెండు అలా కాలేజీలో అడుగు పెట్టగానే సీనియర్ల గుంపు మమ్మల్ని అడ్డగించింది. పలానా చెయ్యమని, పలానా వారిలాగా మాట్లాడమని, డాన్స్ చెయ్యమని, పాట పాడమని ఇలా ఏడిపించారు. కానీ నేను వారిలో కాస్త లీడర్ లాగా కనిపిస్తున్న వ్యక్తి దగ్గరకెళ్ళి "సర్ ఇక్కడ విజయ్ అంటే ఎవరు?" అని అడిగాను. "ఎందుకు?" అని బుల్లెట్ లాగ వచ్చింది ప్రశ్న అవతలి పక్కనుంచి. దానికేమో నేను తింగిరి దాని లాగా "నేను పలానా వారి ఫ్రెండుని. ఆతను విజయ్ ని కలవమని చెప్పాడు. అందుకని" అని అంటూ నసిగాను. కానీ నాకేం తెలుసు సీనియర్లు ఎవరన్నా తెలుసు అంటే రాగింగు ఇంకాస్త ఎక్కువ చేస్తారని అందులోనూ అమ్మాయిలకి ఈ బాధలెక్కువ అని. అంతే అక్కడ సీను మొత్తం మారిపోయింది. అందరు నన్ను చుట్టిముట్టి మిగతా వారినందరినీ క్లాసులకి వెళ్ళిపొమ్మని చెప్పి నన్ను ఏడిపించారు చూడండీ అబ్బో అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు వణుకు వస్తుంది. నాకు తర్వాత తెలిసింది నేను తింగిరి దానిలాగా వెళ్లి అడిగిన వ్యక్తే విజయ్ అని, తను మా ఫ్రెండు అని చెప్పింది అతనేనని.

ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకటే గోల మా ఇంట్లోవాళ్ళతో, నేను కాలేజీకి వెళ్ళనంటే వెళ్లనని. ఇంట్లోవాళ్ళు నన్ను మెల్లగా సముదాయించి విషయం ఏమిటో కనుక్కొని అనురాధ ఆంటీకి చెప్పారు. ఆంటీ వాళ్ళ తమ్ముడికి call చేసి మాట్లాడారు. "నేను చెబుతాను వాడికి. అయినా కాలేజీలో ఇలాంటివన్నీ మామూలే. పర్లేదు వెళ్ళమనండి" అని చెప్పాడని ఆంటీ చెప్పారు. సరే ఎలాగోలా తర్వాతి రోజు కాలేజీకి వెళ్లాను. ఆ రోజు ఎవ్వరూ మా జోలికి రాలేదు. కాలేజీ వదిలారు, నెమ్మదిగా అందరం ఇంటి దారిబట్టాం. హమ్మయ్యా ఇక మా జోలికి ఎవ్వరూ రారు అనుకొంటుండగా.........

==============================================================
ఈ జ్ఞాపకాన్ని అక్షరబద్ధం చేద్దామనుకొంటే మది పైని శిలాక్షరాలు అలా అలలా పొంగిపొర్లి పోతున్నాయి అందుకని దీని కొన్ని భాగాలుగా రాద్దమనుకొంటున్నాను. ఇదే మొదటి భాగం అనుకోని చదవండి. తొందరలోనే చివరి భాగాన్ని మీకందిస్తాను. దీన్ని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని/ప్రోత్సాహాన్ని అందిస్తే అదే పదివేల వరహాలు.
===============================================================

Monday, July 21, 2008

ఉంటుందా?


ఉషోదయపు వెలుగుని పంచుకోని ఉదయం ఉంటుందా?
తటిల్లత జిలుగుని చూడలేని ఆకాశం ఉంటుందా?
చినుకు చినుకుగా మారని అంభోధరముంటుందా?
నేత్రాంబువులని ఆపగలిగే చక్షువు ఉంటుందా?
కొమ్మ కొమ్మల రెమ్మలని మోయలేని తరువు ఉంటుందా?
భ్రమరపు స్పర్శని తాళలేని శిరీషకుసుమముంటుందా?
కన్నీటి కరదములని స్వీకరించలేని స్నేహముంటుందా?
విపంచి ప్రలుకలేని సుస్వరాల సరాగ మాలిక ఉంటుందా?

Wednesday, July 16, 2008

నేను ఏకాంతంగా ఉన్నా!


నేను ఏకాంతంగా ఉన్నా!
ఒంటరితనం నను కబళించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ జ్ఞాపకాలని అడ్డుపెట్టుకొని నేను దానితో పోరాడుతున్నా!

నేను ఏకాంతంగా ఉన్నా!
నిర్వేదం నను ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ ఛాయాచిత్రం వెనుకన ద్రాక్కొని నేను దానితో పోరాడుతున్నా!

నేను ఏకాంతంగా ఉన్నా!
నిర్లిప్తత నను అతిక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ మౌనం చాటున ఒదిగిన చిరునవ్వుల అస్త్రాలతో నేను దానితో పోరాడుతున్నా!

నేను ఏకాంతంగా ఉన్నా!
రక్తాశ్రపు కెరటం నను ముంచెత్తాలని ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ కన్నుల మెరుపుల శత సహస్ర శస్త్రాలతో నేను దానితో పోరాడుతున్నా!

Sunday, July 13, 2008

రహదారి


నేనెన్ని వంపులు తిరిగినా మీ ప్రయాణం నా మీదే..
నేనెన్ని మలుపులు తిరిగినా మీ పయనం నా మీదే..

నేనెన్ని రుధిరాక్షరాలు అద్దుకున్నా అది మీ నిర్లక్షం వల్లే..
నేనెన్ని భువనఘోషలు అందుకున్నా అది మీ ప్రారబ్ధం వల్లే..

కానీ మీకు తెలుసా?
నాపై జరిగిన ప్రమాదంలో,
ఆప్తులను కోల్పోయిన జనం రోదనను విని ఎంతగా తల్లడిల్లి పోతానో??
అశ్రుతర్పణం విడిచే దీనుల వేదనను కని ఎంతగా విలవిల్లాడిపోతానో??

కానీ మీకు తెలుసా?
నాపై జరిగిన ప్రమాదంలో,
ప్రాణాలని నిలుపుకోవడం కోసం మీరు పడే తపనను గాంచి ఎంతగా నలిగిపోతానో??
దీనంగా సాయం కోసం ఎదురుచూసే మిమ్ము చూసి ఎంతగా కుమిలిపోతానో??

ఇదంతా ఎవరి వల్ల?
నిర్లక్ష్యం నరనరాన జీర్ణించుకొన్న ఈ మురికికూపపు వ్యవస్థ వల్లా??
అవినీతి అణువణువునా పెనవేసుకొన్న ఈ అధికారులవల్లా?
ఇది నాకోసం, అది నీకోసం అంటూ వాటాలు పంచుకొనే కాంట్రాక్తర్లవల్లా??
లేక!!
ఈ వ్యవస్థలో సింహభాగం అయిన మీ అందరి వల్లా??

Saturday, July 12, 2008

ఋతువు


శిశిరం మరవకంటూ పరుగెడింది..
నే కాచిన ఆశల ఆకులను కూల్చింది..
నే పూచిన కలల పువ్వులను రాల్చింది..

వసంతం వర వరా అడుగిడింది..
నా తనువుకు క్రొత్త చిగురును తొడిగింది..
నా పరవశాలకు క్రొంగొత్త వర్ణాలను అద్దింది..

గ్రీష్మం బిర బిరా ఆతెంచింది..
నా నీడన చేరిన జీవులకు ఊరటను ఇమ్మంది..
నా జాడన నడచిన జనులకు ఆరాటాన్ని తీర్చమంది..

వర్ష ఋతువు ఎదలోకి తొంగిచూసింది..
నా కన్నీటిని తనలో ఇముడ్చుకొని చినుకై కురిసింది..
నా ఆశలన్నింటిని తనలో కలుపుకొని వరదగా మారింది..

శరదృతువు వాకిలిలో నిలిచింది..
నా ఊహల చల్లని వెన్నెలను అందరికీ పంచింది..
నా మనస్సున మరుమల్లెలు విరబూయించింది..

హేమంతం నేనున్నానంటూ ఏతెంచింది..
నా చల్లని చూపుల హిమబిందువులని అందించింది..
నా ప్రాంగణంలో రంగవల్లుల అందెలు వేయించింది..

మరల శిశిరం ఏతెంచింది................

Friday, July 11, 2008

కాలం ఆగలేదు


కాలం ఆగలేదు.. కథ మారలేదు..
ఇలపై నే కన్న కలలన్నీ శిలలై పోయాయి..
జ్ఞాపకాలన్నీ రెప్పల మాటున దాగిపోయాయి..

కాలం ఆగలేదు.. కథ మారలేదు..
ఊహలన్నీ కనీనిక చాటున ఒదిగిపోయాయి..
ఊసులన్నీ గవనిక వెనుక పరుండిపోయాయి..

కాలం ఆగలేదు.. కథ మారలేదు..
ఏకాంతం ఆర్తిగా నను పెనవెసుకుంటూ ఉంటున్నది..
నీ నిరీక్షణం ఆశగా నను అల్లుకుంటూ ఉంటున్నది..
అయినా కాలం ఆగలేదు.. వ్యధ తీరలేదు..