Monday, July 21, 2008

ఉంటుందా?


ఉషోదయపు వెలుగుని పంచుకోని ఉదయం ఉంటుందా?
తటిల్లత జిలుగుని చూడలేని ఆకాశం ఉంటుందా?
చినుకు చినుకుగా మారని అంభోధరముంటుందా?
నేత్రాంబువులని ఆపగలిగే చక్షువు ఉంటుందా?
కొమ్మ కొమ్మల రెమ్మలని మోయలేని తరువు ఉంటుందా?
భ్రమరపు స్పర్శని తాళలేని శిరీషకుసుమముంటుందా?
కన్నీటి కరదములని స్వీకరించలేని స్నేహముంటుందా?
విపంచి ప్రలుకలేని సుస్వరాల సరాగ మాలిక ఉంటుందా?

5 comments:

Bolloju Baba said...

ఖచ్చితంగా ఉండదు.
మీ కవితని ఆస్వాదించని హృదయం కూడా ఉండదు.
బొల్లోజు బాబా

Purnima said...

కవిత బాగుంది.. కానీ ఒక చిన్ని సందేహం..

"నేత్రాంబువులని ఆపగలిగే చక్షువు ఉంటుందా?" అనే బదులు.. కన్నీటిని చూడలేక అడ్డుపడే నేస్తాన్ని స్పురింపచేసేలా.. ఏదైనా రాయగలరా??

నేత్రాంబువులని ఆపలేని... అంటూ ఈ పంక్తిని ఎవరైనా పూర్తి చేయరూ...

Unknown said...

కనురెప్ప--అంటే బాగుంటుందాండి

Unknown said...

ప్రలుక--పలుక అని ఉండాలేమో.అన్యధా భావించరని తలుస్తూ--

ప్రతాప్ said...

@కలా,
మంచి పద బంధాలు వాడి కవితని రాసావు.
కవితని అసంపూర్తిగా వదిలివేసావేమో అని నాకనిపిస్తూ ఉంది. ఇలా కావాలని రాసావా?
నరసింహా గారు చెప్పింది నిజం, అది "పలుక" అని వాడాలి.
@పూర్ణిమా,
"నేత్రాంబువులని ఆపగలిగే చక్షువు ఉంటుందా?" లో కన్నీరుని ఏవీ ఆపలేవు ఆఖరికి వాటి జన్మస్థానం అయిన కనులు కూడా అన్న అర్ధం స్పురిస్తూఉంది. కనురెప్పలు కూడా వాటిని ఆపలేవు అన్న అర్ధం కూడా ఉంది. మీకు వేరే అర్ధం ఏమన్నా స్పురిస్తూ ఉందా?
మీకా టాలెంట్ ఎలానూ ఉంది కాబట్టి, ఎవరో పూరించే బదులు మీరే ఆ పని చెయ్యొచ్చు కదా?