Tuesday, September 30, 2008

ప్రేమ వేరు - పెళ్ళి వేరా?


నేనీమధ్య నా సహాధ్యాయిని అతని భార్యని (తను కూడా నా సహాధ్యాయే) కలవడం జరిగింది. వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి. కులం పేరుతో దూరం చెయ్యబోయిన పెద్దలనెదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు. అమ్మాయిది చాలా మెతక వైఖరి, అతనేమో విజ్ఞానఖని, ఆపదలో ఉన్నవారిని ఎంతకైనా తెగించి ఆదుకొంటాడు, ఎవరన్నా సహాయం అడిగితే లేదు అనకుండా ఇద్దరూ కలిసే చేస్తారు. అందుకే ఆ జంట get-to-gather ఏర్పాటు చేస్తే మా కాలేజి స్నేహితులంతా మిస్ కాకుండా హాజరు వేయించుకొంటాము. అతనితో ఎప్పుడూ వాదన జరపడం నాకొక సరదా. అలాంటి వాళ్ళతో వాదన జరపడం వల్ల నాకు ఎంతో కొంత జ్ఞానం పెరుగుతుందనే స్వార్ధంతో అతనితో వాదన జరుపుతాను.

అందరం భోజనాలు కావించి కబుర్లలో మునిగితేలుతున్నాం. ఇంతలో నాకొక డౌటు వచ్చింది (అదేమిటో బుర్రలో ఎప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి), అదే అతని ముందు వుంచాను, "ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" అని. అందరు తడుముకోకుండా రెండూ దాదాపు ఒకటే, ఒకటి ఇంకో దానిలో అంతర్భాగం (మాకెవ్వరికి అంత జ్ఞాన సంపద లేదులెండి) అన్నారు. ఇంచుమించు నా ఆలోచనా తీరు కూడా ఇదే. కాని అతను మాత్రం "రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు, వివరంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక స్థితి, అలానే పెళ్ళి కూడా ఇంకొక స్థితి. మనిషి ఒక స్టేజి లోంచి ఇంకో స్టేజి లోనికి వెళుతాడు. కాకపొతే ప్రేమ ముందా? పెళ్ళి ముందా? అనేది అతని/ఆమె ఆలోచనలని బట్టి ఉంటుంది" అని అన్నాడు.

నేను ఊరుకుంటానా? "లేదు, రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు అని అంటున్నావు. కాని ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఉంచేది ప్రేమా? లేక పెళ్ళా?" అని (అతి)తెలివిగా ప్రశ్నించాను. దానికి సమాధానం అతను చెప్పేలోపలే, అతని భార్య అందుకొని "కొంచెం నమ్మకం, ఇంకొంచెం ప్రేమ, మరికొంచెం పెళ్ళి, ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఆకర్షణ" అని చెప్పింది (మా పిల్ల కొంచెం మెతకలా కనిపిస్తుంది కానీ తెలివైనదే) ఆ సమాధానం విన్న మా అందరికి ఏమీ అర్ధం కాలేదు. "ఆకర్షణా" అంటూ కళ్ళు పైకి తేలవేశాం. "అవును, ముమ్మాటికీ ఆకర్షణే", అంటూ అతను కొనసాగించాడు. "ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతో మొదలవుతుందన్నట్లు, ఎంత చిన్న/పెద్ద బంధమైనా ఆకర్షణతోనే మొదలవుతుంది. నిజం చెప్పండి రేపు మీతో జీవితాన్ని పంచుకోబోయే వాళ్ళ మీద మీకు ఆకర్షణ లేదా (మాలో అప్పటికో కొంతమందికి ఎంగేజుమెంట్లు జరిగిఉన్నాయి)?".

ఇంతలో మాలో ఇంకొకరు అందుకొన్నారు, "నువ్వు చెప్పేది నిజమే కావొచ్చు, కానీ ఆకర్షణ పునాదిగా జరిగే ఈ ప్రేమ/పెళ్ళి నిలబడుతాయా?" అని అడిగారు. దానికి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఫక్కున నవ్వి, "నేను ఆకర్షణతో మొదలవుతాయి అని అన్నానే గాని చివరి వరకు అదే ఆకర్షణ ఉంటుందని చెప్పలేదుగా. పోను పోను ఈ ఆకర్షణ తగ్గి చివరకి వాళ్ళ మధ్య కొంచెం/పూర్తి గానో మానసికమైన అనుభంధం ఏర్పడుతుంది. ఈ అనుభంధం స్థిరంగా ఉన్నవాళ్ళు తమ మిగతా సగం కోసమే జీవిస్తారు, అది లేని వాళ్ళు మిగతా వాళ్ల సగం కోసం వెంపర్లాడుతారు" అని ముక్తాయింపు ఇచ్చాడు.

చర్చ దారి తప్పుతుందేమోననిపించి, "సరే ప్రేమ, పెళ్ళి రెండూ వేరు వేరు అయినప్పుడు మరీ మీ పెళ్ళి ప్రేమపెళ్ళి కదా? మరి ఇదేమిటి? (భలే తెలివి ఉంది కదా నాకు? :-) )" అని ప్రశ్నించాను. దానికి అతను "ప్రేమ ముదిరితే మా పెళ్ళి జరిగింది కాబట్టి దాన్ని ప్రేమ పెళ్ళి అంటున్నాం, నిజానికి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది, కాకపొతే వాళ్ళ మధ్య ఆ మానసిక అనుభంధం చాలా తొందరగా ఏర్పడుతుంది. ఎందుకు అనేది కొంచెం అనలైజ్ చేస్తే మీకే తెలుస్తుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నా సరే వాళ్ల మధ్య సరైన మానసిక అనుభంధం ఏర్పడక పోవచ్చు, ఎందుకంటే వాళ్లు ప్రేమించుకొంటున్నాం అనే భావనని ప్రేమిస్తుంటారు. అందుకే చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్ళవు." అన్నాడు.

కానీ మేమందరం మా వాదనకే కట్టుబడి ఉన్నాం, ఎవ్వరమూ అతని వాదనని అంగీకరించలేదు. ఇదే అతనితో అన్నాం, "సరే మీరెవ్వరూ నాతో అంగీకరించం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని రెండు ప్రశ్నలు వెయ్యోచ్చా?" అని అడిగాడు. "సరే" అని అన్నాం. "మొదటి ప్రశ్న, ప్రేమ, పెళ్ళి రెండూ ఒకటే అని మీరందరి అభిప్రాయం, కదా? మరి ప్రేమించుకొన్న వారందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం లేదు? వాళ్లు ప్రేమించుకొంటున్నాం అన్న భావనని ప్రేమించారు అని ఇందాక నే చెప్పిన సమాధానం చెప్పొద్దు. అలా అయితే, చరిత్రలో గొప్ప ప్రేమలుగా నిలిచిపోయిన వారి పెళ్ళిళ్ళు ఎందుకు జరగలేదు?
రెండో ప్రశ్న, మన సమాజంలో ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్తున్నాయి? ప్రేమ పెళ్ళి రెండు కలిసి ఉంటే మరి వారెందుకు విడిపోవాలని నిర్ణయించుకొంటున్నారు?" ఈ రెండు ప్రశ్నలు విన్న తర్వాత మాలో అంతర్మధనం మొదలయింది. ప్రేమ పెళ్ళి రెండూ వేర్వేరా?

Wednesday, September 17, 2008

ఎర్ర బస్సిచ్చిన వెర్రి అన్నయ్య


అది అమావాస్య ఆదివారం. ఎండ, ఫేటేల్మని రాబోయే ఉపద్రవానికి సూచికగా ఎర్రగా కాస్తూ ఉంది. నల్లని కాకులు, కర్ణకఠోరంగా అరుస్తూ అటుఇటు హడావుడి చేస్తూ తిరుగుతున్నాయి. రేపటి నుంచి మళ్ళీ స్కూలు మొదలు, అందుకే కాబోలు ఈ ఉపద్రవాలన్నీ అనుకొని అమ్మతో "అమ్మా చూడవే, ఈ రోజు బాలేదు, అందుకే వాతావరణం బాగా పొడిగా ఉంది, అందుకే ఇంకో మంచిరోజు చూసుకొని వెళ్ళి స్కూల్లో జాయిన్ అవుదాం" అని చెప్పా. పిచ్చి తల్లి నిజం కాబోలు అనుకొని, వాళ్ళమ్మతో, "చూడవే, ఇది ఇంత లేదు అప్పుడే వాతావరణం గూర్చి ఎంత అవగాహనో." అని చెప్పి చెంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకొని సంబర పడింది. అంతలోనే ఉరుములేని మెరుపులా మా మామయ్య ఊడిపడ్డాడు. ఆయనకి మన గురించి బాగా తెలుసు, "అక్కా, నీ మొహమే. ఎండాకాలం ఎండ కాయక మరింకేం కాస్తుందే? కాకుల గోల ఎప్పుడు అలానే ఉంటుందే. నా మాట విని దీన్ని తీసుకోని బయలుదేరు లేకపోతే బావగారు చంపేస్తారు." అని మొత్తానికి మమ్మల్ని బయలుదేరదీసాడు.

మొత్తానికి మా అమ్మ నన్ను తీసుకోని, వాళ్ళమ్మ అంటే మా అమ్మమ్మ గారి ఇంటినుంచి బయలుదేరింది. మా మామయ్య దగ్గరుండి మరీ మా ఇద్దరినీ అప్పుడే వచ్చిన ఎర్ర బస్సేక్కించాడు. ఎర్రబస్సు అప్పటికే వలసపక్షులతో నిండిపోయిన ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులా ఉంది. సీటుకోసం వెతుక్కొంటూ ఉండగా, అక్కా అంటూ అమ్మనెవరో పిలిచారు. అమ్మా అటు తిరిగి "నువ్వే సుద్దు, ఎలా ఉన్నావ్?" అంటూ ఆవిడ పక్కన ఉన్న కాస్త స్థలంలో ఆసినురాలయింది. "నేను బానే ఉన్నానే, నువ్వు ఎలా ఉన్నావ్? ఇది నీ కూతురా? ఇదేంటే ఇలా ఉంది బొత్తిగా అస్సలు నీ పోలిక లేదు. మన తెల్లావుకి పుట్టిన కర్రి దూడలా ఉంది." అంటూ ప్రశ్నల వర్షం గుప్పించింది. "నువ్వు ఎవరిని చూసి ఎవరనుకొంటున్నావే?" అంటూ మా అమ్మ (కొంపదీసి ఇది మళ్లీ చేపల వేటకి కానీ వెళ్ళి రాలేదు కదా? అనుకొంటూ) ఇటుతిరిగి చూస్తే పక్కనే ఎవరో నల్లపిల్ల నిలబడి ఉంది. "ఈ అమ్మాయెవరో నాకు తెలీదే, అదిగో అక్కడ నిలబడి ఉండే అదే మా చిన్నమ్మాయి. పెద్దమ్మాయిని తీసుకోని వాళ్ల నాన్న నిన్ననే వెళ్లిపోయారు. రేపటినుంచి మళ్లీ స్కూలు కదా అందుకని దీన్ని తీసుకోని ఊరికి బయలు దేరుతున్నా". అని మా అమ్మ ఆవిడ ఇమాజినేషన్ కి మళ్లీ ఛాన్స్ ఇవ్వకుండా గడగడా చెప్పేసింది. "ఓహో అలాగా" అని ఆవిడ నిట్టూర్చి, "ఇదిగోనే అక్కా వీడు నా కొడుకు, ఇక నుంచి మేము కూడా మీరుండే ఊర్లోనే ఉండబోతున్నాం" అని వాడిని మా అమ్మకి పరిచయం చేసింది. మా అమ్మ నన్ను పిలిచి, "ఇదిగో కలా, ఛాంగు భళా, ఈవిడ సుద్దు పిన్ని. ఇదిగో వీడేమో నీకు అన్నయ్య అవుతాడు." అని సినిమా చివర్లో అన్నాచెల్లెల్లని కలిపే క్యారెక్టర్ ఆర్టిస్టులా మా ఇద్దరినీ కలిపింది. ఇంతకీ చెప్పలేదు కదూ, ఆ ఎర్రబస్సిచ్చిన ఈ వెర్రి అన్నయ్య పేరు "సందిగ్ద్". వాడు కూడా పేరుకి తగ్గట్లు చాలా సందిగ్ధంగా నా చేతిలో చెయ్యి వేసి, అదో రకమైన అసందిగ్ధపు సందిగ్ధావస్థలో నవ్వినట్టు నవ్వాడు. మా అమ్మ చెవిలో చిన్నగా గొణిగాను, "అమ్మా వీడు నవ్వాడో ఏడ్చాడో అర్ధం కాలేదే".

అలా బస్సులో దొరికిన మా వెర్రి అన్నయ్య నిదానంగా మా స్కూల్లోనే, అది నా క్లాసులోనే జాయిన్ అయ్యాడు. ఇక చూసుకోండి నా కష్టాలు-నా కన్నీళ్ళు అనే ధారావాహిక సీరియల్ మొదలయింది. వాడిని నా క్లాసులోనే ఏల వేయవలె? వేసితిరిపో, అయినను మా అన్నగారని ఏల చెప్పవలె? చేరిన రోజు నుంచి నా పరువు తియ్యడం మొదలు పెట్టాడు. మా వాడికి కాస్త కూస్తా కాదు జీడిపాకం లెవెల్లో ఉంది తిక్క. వాడికి రైమ్స్ అవిఇవి మాములుగా చెబితే రావు, ఆయనకీ ఆక్షన్ చేసి చూపెడుతూ ఉంటేనే వస్తాయంట, ఇలాంటివన్నీ వాణ్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే చెప్పి మా అందరి ప్రాణాలు పైపైనే పోయేలా చేసింది వాళ్ళమ్మ. ఇక మా క్లాసులో ఎటువంటి రైమ్స్ నేర్పించాల్సి వచ్చినా, వాడికి కళ్ళముందర జరిగేట్టు ఆక్షన్ చేసి చూపించి ఆ రైమ్స్ నేర్పించే వాళ్ళు మా టీచర్లు. కొన్ని రోజులకి వాళ్ళకొక మహత్తరమైన ఐడియా తట్టింది, ఇక మాకు ఏ రైమ్స్ నేర్పించాల్సి వచ్చినా ముందర నా చేత ఆక్షన్ చేయించి తర్వాత అందరికి నేర్పించేట్టు. ఇక చూడండి నా పని, మరుసటి రోజు వాడికి నేర్పించాల్సిన పద్యం "జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్" మా తింగిరోడికి అర్ధమయ్యేదానికి, మా టీచర్లు నా చేత బెంచ్ ఎక్కించారు, చివర్లో దొర్లుకొంటూ వచ్చే సన్నివేశం కొరకు నా చేత క్లాస్ రూమ్ లో పొర్లుదండాలు కూడా పెట్టించారు. అది చూసి మా తిక్కలోడు చాలా తొందరగా రైమ్స్ నేర్చేసుకోన్నాడనుకొంటున్నారా? మా వాడు ఒక్క రైం నేర్చుకోవడానికి 3/4 రోజులు కనీసం పట్టేది. అన్ని రోజులూ నా పని బెంచ్ ఎక్కడం, పొర్లుదండాలు పెట్టడం ఇవే.

ఇలా నా స్కూలు జీవితం నిస్సారంగా సాగిపోతుఉండగా ఒకానొక రోజు నాకొక మహత్తరమైన అవకాశం వచ్చింది. మా స్కూలు ఆన్యువల్ డేస్ వచ్చాయి. మా క్లాసురూము భాధ్యతని నాకు అప్పగించి ఒక నాటకం వేసే భాద్యతను నా చిట్టి భుజాల మీద మోపారు. ఈ సంగతి తెలిసిన మరుక్షణం మా తింగిరోడు పరుగెత్తుకొంటూ నా దగ్గరికి వచ్చి "చెల్లీ, పిచ్చి తల్లీ, గోడమీది పిల్లి, పెరట్లో మల్లి, ఇది మన కుటుంబానికి పరువు ప్రతిష్టల సమస్య. ఎలాగైనా సరే మనం మన వంశగౌరవాన్ని నిలబెట్టాలి" అని నా కుడి చేతి బొటనవేలు నా చేతే కోయించుకొని వీరతిలకం రుద్దించుకొన్నాడు. మనం, ఓయబ్బో మా అన్న ఒట్టి తింగిరోడులా కనిపిస్తాడు కానీ, మహా మేధావే (అయినా మేధావులే అలా తింగిరోల్లలా కనిపిస్తారు అనుకొని) జబ్బలు చరుచుకొని రంగం లోకి దూకి, "ద్రౌపది వస్త్రాపహరణం" అన్న నాటకాన్ని వెయ్యాలని ప్రణాళికలు రచించాం. అందులో ద్రౌపది గా ఒక పిల్లవాన్ని, కృష్ణునిగా నన్ను, దుస్సాశనుడిగా (ఇదో దుస్సాహసం అని తర్వాత తెలిసింది) మా తింగిరోన్ని ఎంచుకొన్నాం. అందరూ రిహార్సల్స్ మొదలుపెట్టారు, డైరక్షన్ అంతా నాదే. మా తింగిరోడని చెప్పడం కాదు కానీ, వాడైతే మునుపటిలా సందిగ్ధంగా లేకుండా, అసందర్భంగా వికట్టహాసం చేస్తూ, అందరిని భయపెట్టే నటన ఇస్తున్నాడు. ఇక నాటకం సూపర్ హిట్టు అని అందరం తెగ సంబర పడిపోయాం.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఒకొక్క తరగతి వారు వారి వారి ప్రదర్శనలు ఉత్సాహంగా ఇస్తున్నారు. ఇంతలొ స్టేజి పైనుంచి, ఇప్పుడు "ద్రౌపది వస్త్రాపహరణం" నాటకం మొదలవుతుంది అన్న అనౌన్సుమెంట్ వచ్చింది. అంటే రయ్యమని వెళ్ళి నాటకానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని చేసేసుకొన్నాం. తెర రయ్యిన లేచింది, మా తింగిరోడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చే సన్నివేశం మొదలయింది. మా తింగిరోడు లాక్కొని రావడం ద్రౌపదికి పెట్టిన విగ్గు ఊడిపోయింది. అయినా మా వాడు ఆవేశంలో పట్టించుకోక అలానే ఈడ్చుకొని వచ్చి, ఎటువంటి ఆజ్ఞల కోసం ఎదురుచూడకుండా "వస్త్రాపహరణం" మొదలు పెట్టేసాడు. ద్రౌపది కృష్ణుని ప్రార్ధించే లోపుగానే ద్రౌపది వంటి మీదున్న చీర మొత్తం విప్పేసాడు. పాపం ద్రౌపది గా నటించిన అబ్బాయి శీలాన్ని నిలువునా నేలరాసేసాడు, నాటిక మొత్తం అభాసుపాలు చేసాడు. (ఇంకా నయం మేము అప్పుడు చాలా చిన్న వాళ్ళం కాబట్టి సరిపోయింది. లేకుంటేనా జనం రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు.) అలా నన్ను నమ్మి నా మీద ఉంచిన మహత్తర భారాన్ని చివరి వరకు మొద్దామనుకొన్న మా సందిగ్ధన్నయ్య విధి వక్రించి మరుసటి సంవత్సరం స్కూలు మారడం వలన నేను బ్రతికిపోయాను.