Wednesday, July 23, 2008

కాలం ఆగని ఈ క్షణం

ఇది చదివే ముందర కాలం ఆగిన ఆ క్షణం చదవండి.
===============================================================

కాలం ఆగని ఈ క్షణం

===============================================================

సీనియర్ల గుంపు ఎదురయ్యి మమ్మల్నందరిని కాంటీన్ కి తీసుకెళ్ళి బాగా క్లాసు పీకారు. "కాలేజీలో ఎమన్నా ప్రాబ్లం ఉంటే కాలేజీ లోనే solve చేసుకోవాలి, అంతేకాని వాటిని ఇంటి దాకా తీసుకెళ్ళి అనవసరమైన issues చెయ్యకూడదు" అంటూ ఏవేవో లెక్చర్లు ఇచ్చారు. వీరికేం తెలుసు అందరూ వీరిలాగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోలేరు కదా? తొందరలోనే freshers-day పార్టీ అయిపోయింది. ఇక సీనియర్లందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

ఇలా మనం కాలేజీ చదువు వెలగబెడుతున్నప్పుడు, మధ్య మధ్యలో నాకేమన్నా doubts వస్తే మా అనురాధా ఆంటీ వాళ్ళ తమ్మున్ని అడిగేదాన్ని ఫోన్ లోనే లెండి. అతను ఓపికగా అన్నీ వివరించి చెప్పేవాడు. అలా "మీరు" లోంచి నెమ్మదిగా "నువ్వు" లోకి మారి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. అతనితో మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు తెలిసేవి. చాలా అల్లరిగా కనిపించినా అతని అలోచనాధోరణి నాకు ఆశ్చర్యమనిపించేది. పైకి ఎంతో అల్లరి చిల్లరిగా కనిపించేవారు లోపల ఎంతో ఆలోచనాపరులై ఉంటారు అన్న వాక్యం నా ఈ నేస్తాన్ని చూస్తే నిజమే అనిపించేది. కుటుంబం పట్ల, సమాజం పట్ల నిబద్దతతో ఉండాలి అనేవాడు. అతను నాకు నేస్తం కానంతవరకు కాలేజీకి వెళ్లి రావడం, ఫ్రెండ్స్ తో కబుర్లు, సినిమాలు ఇవే మన లోకంగా ఉండేవి. అనవసరంగా డబ్బు నీకోసం వృధా చేసే బదులు ఎవరన్నా ఆకలితో ఉన్నవారికోసం వెచ్చించొచ్చు కదా అనేవాడు. అవును నిజమే కదా అనిపించేది నాకు. కాని మరుసటి రోజు అంతా మామూలే. ఈ విషయం నేను నిజాయితీగా అతనికి చెబితే "మనిషి ఎవరో చెబితే మారడు, తన కేర్పడిన అనుభవాల ద్వారా మాత్రమే మారతాడు. నువ్వు ప్రయత్నించు మారేదానికి. కొంచెం social responsibility అలవరుచుకో. నీ దగ్గరున్నది అంతా పక్కన వాడికి ఇవ్వనక్కరలేదు. ఎంతో కొంతైనా పర్లేదు. అది పక్కన ఉన్నవారికి ఉపయోగపడితే చాలు." అని చెప్పేవాడు. "మనిషి ఎవరో చెబితే మారడు, తన కేర్పడిన అనుభవాల ద్వారా మాత్రమే మారతాడు" అన్న అతను చెప్పిన వాక్యం నా చిట్టిబుర్రలో ఇప్పటికీ నిలిచిపోయింది. ఇలా నా కాలేజీ చదువు పూర్తి అయిపొయింది. ఉద్యోగ ప్రయత్నాలకోసం మొట్టమొదటిసారిగా అమ్మానాన్నల్ని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి హైదరాబాదు రావలసి వచ్చింది. "నీకే ప్రాబ్లం వచ్చినా మా తమ్మున్ని కాంటాక్ట్ చెయ్యి. వాడు నీకే సహాయం కావలసి వచ్చినా చేస్తాడు" అన్న అనురాధా ఆంటీ మాటల్ని నెమరువేసుకుంటూ కన్నీరు ఉబుకుతుండగా, మనస్సును ఎవరో మెలిపెట్టినట్లుండగా, తడబడుతున్న అడుగులతో హైదరాబాదులోకి అడుగుపెట్టాను.

హైదరాబాదులో ఎవ్వరూ సరిగ్గా తెలియదు, దూరపుబంధువులున్నా వారు నిజంగా చాలా "దూరపు"బంధువులే. హైదరాబాదే సరిగ్గా తెలియకపోతే ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఏం మొదలు పెడతాం చెప్పండి? కాని నాకీ ప్రశ్నే ఎదురుకాలేదు. నా నేస్తం నాకన్నా సీనియరు అవడం వల్ల, తను already హైదరాబాదులో 4 సంవత్సరాలునుంచి ఉండటం వల్ల నాకేం పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. ఏయే కోర్సులు join కావాలి, interviews కి ఎలా prepare కావాలి, ఎక్కడెక్కడ freshers కి openings ఉన్నాయి మొదలైన విషయాలన్నీ నాకు వివరంగా చెప్పేవాడు. చెప్పడమే కాదు నన్ను దగ్గరుండి మరీ interviews కి తీసుకెళ్ళేవాడు. కానీ మనం వెలగ పెట్టిన చదువుకి మనం first round అంటే written test కే బయటికి వచ్చేసేవాళ్ళం.

ఇలా కొన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాక తను నా ప్రయత్నాలలోని "seriousness" ని కనిపెట్టాడు. ఒకరోజు తన ఫ్రెండ్స్ సర్కిల్ లోని కొంతమందిని నాకు పరిచయం చేసాడు. అమ్మాయిలు, అబ్బాయిలు నవ్వుతూ తుళ్ళుతూ సంతోషమంతా తమదే అన్నట్టుగా వున్నారు. వాళ్ళతో ఆరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఆరోజు నా కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని అతను చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. "చూసావా? వీళ్ళంతా ఎంత ఆనందంగా ఉన్నారో? ఈ ఆనందానికి కారణం డబ్బు. అవును ఆర్ధికభధ్రత. ఇంత చదువూ చదివి, ఆ ఏదో చెయ్యాలి కాబట్టి ఉద్యోగం అన్నట్టుగా ప్రయత్నిస్తే నీ ప్రయత్నాలలో seriousness ఉండదు. 100% ట్రై చెయ్యకపోతే మనం ఏదీ సాధించలేము. కొన్ని ప్రయత్నాలలో నువ్వు సఫలం కానంత మాత్రాన నువ్వు నిరాశ పడనక్కరలేదు. అంతకన్నా మంచి అవకాశం మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని తెలుసుకో. నువ్వు ప్రయత్నం చేశావా లేదా అన్నది ముఖ్యం కాదు, ఎంత serious, sincere గా దానికోసం ప్రయత్నించావు అన్నది ముఖ్యం." అని అన్నాడు. "నేనేం చెయ్యను? నాకు సరైన అవకాశం రావడం లేదు" అన్నాను. అతను కొద్దిగా నవ్వి "తప్పుల్ని అవతలివారి మీదకో లేదా పరిస్థితుల మీదకో నెట్టేసే వారంటే నాకసహ్యం. నీకు అవకాశం రాలేదంటే లోపం ఎక్కడో నీలోనే ఉంది. అదేమిటో ముందు చూసుకో, దాన్ని సరి చేసుకో." అన్నాడు. ఆ మాటలు నా మీద బాగా ప్రభావం చేసాయి. నాలో కసిని, పట్టుదలను పెంచాయి. నాలో లోపాలు సరిచేసుకోవడం మొదలు పెట్టాను. అంతే ఒక నెల లోపుగానే ఒక పెద్ద MNC లో job వచ్చింది. ఆరోజు నాకన్నా ఎక్కువగా అతనే సంతోషపడ్డాడు. ఇక మా అమ్మానాన్నల సంతోషానికైతే అవధుల్లేవు. ఇలా ఆనందంగా, అందంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ఒక పెద్దమలుపు.

అమ్మ దగ్గరినుంచి ఫోన్, వెంటనే బయలుదేరి ఊరికి రమ్మని. నానమ్మకు బాలేదేమోనని హడావుడిగా వెళ్ళాను. కాని అక్కడ జరిగిన విషయం తెలుసుకొని మాట రాక నిలుచుండి పోయాను. నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా నీరు కారలేదు. అది నిర్వేదమో, నిర్లిప్తతో, వైరాగ్యమో ఏమిటో మరి. నన్నో చంటిపాపలా భావించి నా వేలు పట్టుకొని నన్ను జీవితంలో నడిపించిన నేస్తం అక్కడ అసువులు బాసి అందరికి అశ్రువులు మిగిల్చాడు. "చనిపోతే కళ్ళు దానమివ్వమని చెప్పాడమ్మా. మా అందరి చేత కూడా సంతకాలు పెట్టించాడు. కాని ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు". అంటూ అక్కడ ఏడుస్తున్న నా నేస్తపు అమ్మని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు.

గొంగళిపురుగు నెమ్మదిగా తన రూపాన్ని వదిలి అందమైన సీతాకోకచిలుక రూపాన్ని సంతరించుకున్నట్లు నేను కూడా నెమ్మదిగా ఒక అమాయకమైన యువతి నుంచి అందమైన వ్యక్తిత్వం అంటూ సంతరించుకున్నానంటే అది నా నేస్తం చలవే. "అనాధలకు సహాయం చెయ్యి, నీకోసం కొంత, సమాజం కోసం మరికొంత, దేశం కోసం అంతా" అంటూ అతను చెప్పిన మాటల్ని నేనెప్పుడు మరచిపోలేను. "అందమైన భావనలు మనస్సులోనే ఉండకూడదు అవి మదిని దాటి, కలంలో ఇంకులా మారి, ఎన్నటికి చెరిగిపోని శిలాక్షరాలవ్వాలి, ఎదలో బీజాక్షరాలవ్వాలి." అంటూ నన్ను ఎన్నడూ రాయమని ప్రోత్సహించే నా నేస్తం, ఇప్పుడు నే రాసే రాతల్ని చూసి స్పందించేదానికి నా పక్కన లేడు. "కన్నీరు చాలా విలువైనది అది మన కంటి నుంచి జాలు వారితే ఆవలి వ్యక్తి నిజంగా చాలా విలువైన వారవ్వాలి. అంత విలువైన వారెప్పుడూ నిన్ను ఏడిపించరు కాబట్టి కన్నీరు అనవసరంగా వారి కోసం కార్చకు" అంటూ నా కన్నీళ్ళు తుడిచే నేస్తం ఇప్పుడు నా కన్నీళ్ళు తుడవటానికి నా ఎదుట లేడు. మా స్నేహం చూసి కాలానికే కన్ను కుట్టిందో లేక మంచివారెప్పుడూ తొందరగా ఈ పాడులోకంనుంచి వెళ్ళిపోతారు అన్న మాట నిజమో లేక ఎవరి నిర్లక్షమో లేక ఎవరి పాపమో లేక ఇది నాకు శాపమో నా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి రెండు సంవత్సరాలైంది.
============================================================
ఇది జ్ఞాపకం కూడా కాదు, జ్ఞాపకం అంటే అప్పుడప్పుడు మదిని తట్టేది. నేను నా నేస్తాన్ని మరిచిపోతేగా తను నాకు జ్ఞాపకం అయ్యేది. నేస్తం ఈ అందమైన జీవితం నువ్వు పెట్టిన భిక్షే మరి. నీకు అశ్రుఅంజలి ఘటిస్తూ..
నీకే అంకితం.
-కల.
============================================================

18 comments:

ప్రతాప్ said...

ఎప్పుడు నవ్వే కనుల వెనుక ఇంత బాధ వుందా?
హృదయాన్ని కదిలించింది. కన్నీరు కురిపించింది.

MURALI said...

కల గారు,

మొదట మీ నేస్తం మీకు దూరమయివుంటాడు అనే భావన తోనే చదువుతున్నా. కానీ అతను దూరంగా ఎక్కడో ఉన్నాడనుకున్నా. ఈ లోకం లోనే లేడు అనే వాస్తవాన్ని చివరగా చదివి కదిలిపోయాను. మీకు తెలుసా ఆఫీస్ లో ఉండగానే కళ్ళ లోంచి నీరు తెలియకుండానే చెంపల వరకు వచ్చేసింది. కానీ ఆఫీస్ లో ఉన్నా అనే స్పృహ వాటిని అక్కడితో ఆపేసాయి. నిజంగా కొన్ని ఙ్ఞాపకాలు చాలా విలువయినవి.

ఏకాంతపు దిలీప్ said...

:-(( naakU ilaanTi anubhavam okaTundi...

Rajendra Devarapalli said...

కల గారు,మీ అనుభవాలు వాస్తవికంగా.,మీరు సూచించినవి ఆచరీణయంగానూ ఉన్నాయి.అతను లోకం వదిలి వెళ్ళటం విషాదం.మమ్మల్నీ పంచుకోనివ్వండి కాస్తన్నా.

మీ బ్లాగుటపాల్లో మరీ ఎక్కువ రంగులు వాడుతున్నారు.ఒక్క వర్ణానికే పరిమితమైతే పాఠకులకు కళ్ళకు శ్రమతగ్గించిన వారౌతారు.మీ తర్వాతి టపా కోసం ఎదురు చూస్తూ...

రాధిక said...

మీనేస్త0 మీకు దూర0గా మాత్ర0 లేరు.చూసారు గా మీ ప్రతీ అక్షర0లో కనిపిస్తున్నారు.మీ ప్రతీ మలుపునీ చూస్తున్నారు.మీరు అదృష్టవ0తులు.ఆయన వేలుపట్టి నడిపి0చకు0డా మీకు గమ్యాన్ని చూపి0చి ఇక నువ్వే చేరుకో అన్నారు.ఆయన్ని మర్ఛిపోకు0డా ఉ0డడమే మీరు ఆయనకిఛ్ఛిన గొప్ప విలువ.

Srividya said...

బాగా రాసారు. మనసుని కదిలించారు. మీ బ్లాగుకి అంత బరువైన పేరు పెట్టడానికి ఇలాంటి జ్ఞాపకాలే కారణమేమో అనిపించింది.

మీరేమి అనుకోకపోతే చిన్నమాట. జీవితంలో బాధలు, కన్నీళ్ళు సహజమే.. కానీ కలలకి, కన్నీటికి సమాన స్తానం ఇవ్వడం (బ్లాగు టైటిల్లో) మీ ఉద్దెశ్యం నాకు తెలీదు. ఈ సమాన స్తానం మీ బ్లాగు వరకే, మీ హృదయంలో కాదని ఆశిస్తున్నాను.మీ బ్లాగు టైటిల్ ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రెండు రెళ్ళు ఆరు చూడగానే నవ్వు వస్తుంది. ఊహన్ని ఊసూలై చూడగానే భావుకత్వం నిదుర లేస్తుంది. మీ బ్లాగు టైటిల్ చూడగానే ఏదో దిగులు ఆవహిస్తుంది మనసుని. చీకటి నుండి వెలుగు వైపు పయనించాలి.
కన్నీటి అలల తాకిడి నుంచి తప్పించుకుని కలల్ని నిజం చేసుకుని సంతోషాన్ని చేరుకోవాలి.

అంతే కానీ కష్టాన్ని, కన్నీటిని మన జీవితంలో భాగం చేసుకుని, వాటికి అలవాటు పడిపోకూడదు. ఆ అలవాటు జీవితంలో నిర్లిప్తతకి, నిరాశకి చోటివ్వకూడదు. నా బాధ మీకర్ధం అయ్యిందని ఆశిస్తూ..
శ్రీవిద్య.

కల said...

@ప్రతాప్, @మురళి, @ దిలీప్ ఈ post చదివి మీ అభిప్రాయాలని వ్యక్త పరచినందుకు thanx.
@ రాజేంద్రకుమార్ గారు మీకు కూడా.

కల said...

రాధిక గారు,
మీ ఓదార్పు నిజంగా చాలా ఊరటనిచ్చింది.

కల said...

శ్రీవిద్యా,
నా బ్లాగు పేరు అంత బరువుగా ఉందా? అలా అని నాకెప్పుడు అనిపించలేదు. కాకిపిల్ల కాకికి ముద్దే కదా? :-)
మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చే కలలని నేనెప్పుడు మర్చిపోలేను. అలానే మనస్సుచేత కన్నీరు పెట్టించే సంఘటనలని కూడా. ఇలా అర్ధం వచ్చేట్టు అలా టైటిల్ పెట్టానండి. నా బ్లాగు టైటిల్ వెనక ఉద్దేశ్యం వేరు, నేను రాసే ప్రతి post వెనుక నా కల కాని, నా కన్నీరు కాని ఉంటుంది అని చెప్పడమే నా ముఖ్యోద్దేశం.
రోజులో చీకటివెలుగులు ఎంత సహజమో జీవితంలో సుఖదుఃఖాలు అంటే సహజమని నాకు తెలుసు. ఒకప్పుడైతే నాలో నేను కుమిలి పోయేదాన్నేమో. కానీ నా స్నేహితుడు నాకిచ్చిన ధైర్యం, అమ్మానాన్నా పంచే ప్రేమ, స్నేహితులందరి సాహచర్యాలు, పసిపిల్లల బోసినవ్వులు, కేరింతలు కొట్టే అందమైన జ్ఞాపకాలూ, తుళ్ళింతపడేలా చేసే మధురమైన ఊహాలు, నాకు అప్పుడప్పుడు ఓదార్పునిచ్చే మీలాంటి బ్లాగు స్నేహితులు ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి?

Bolloju Baba said...

శ్రీవిధ్య గారు చెప్పిన విషయం పై మీరిచ్చిన వివరణ నాకు అంత ఆమోదయోగ్యంగా అనిపిచటం లేదు. ఎందుకంటే ఇదే విషయం నేను కూడా చెప్పాలని అనుకొంటున్నాను. ఈ లోగా విద్య గారు చెప్పారు.
ఆలోచించండి.


బొల్లోజు బాబా

ప్రపుల్ల చంద్ర said...

మీ స్నేహితుడు జీవితానికి సరిపడా మంచిమాటలు చెప్పారు.... వాటిని ఎప్పడికి గుర్తుంచుకోవడమే మీరు వారికి ఇచ్చే గౌరవం.

ప్రతాప్ said...

ఎవ్వరినీ నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు..
తన బ్లాగుకు తన కిష్టమైన పేరు పెట్టుకోవడం తన హక్కు.
పేరు మనకు నచ్చలేదు, అలానే అనుకొందాం, ఆ విషయాన్ని కూడా సూటిగానే చెప్పం.
అయినా పాపం తను ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా, ఓపికతో తన బ్లాగు శీర్షిక వెనుక ఉన్నా ముఖ్యోద్దేశ్యం చాలా బాగా చెప్పారు. కదిలించేలా రాయగలగాలి అంటే కదిలించే సంఘటనలని ఎదుర్కొని ఉండాలి. నాకు ఈ బ్లాగులో అలాంటి కదిలించే రాతలే కనపడుతున్నాయి. అలాంటి రాతలు రాసే వారు నిజజీవితంలో ఎంతటి సంఘర్షణలని ఎదుర్కొని ఉండాలి? ఏంతటి గుండెబరువుని మోస్తూ ఉండాలి?

అస్సలు ఈ టపా ఏంటి? ఇక్కడ మనం రాసే రాతలు ఏంటి? ఒక్కసారి అందరూ విజ్ఞతతో ఆలోచించగలరని మనవి.

Kranthi M said...

కల గారు,
నా వోటు మీకే న౦డి.ఎ౦దుకో మీరు పెట్టిన పేరు బానే ఉ౦దనిపిస్తు౦ది.శ్రీవిధ్య,బాబా గారు చెప్పినట్టు భాద అనేది ఉన్నా కూడ ఆన౦ద౦ కూడా మీ పేరు ఉ౦దని నా అబిప్రాయ౦.ఆన౦ద౦ కల అని,విషాదం కన్నీటి అల అని అనిపిస్తు౦ది నాకు.
ఇక పోతే మీ టపాకి నా స్ప౦దన నా బ్లాగులో చూడగలరు.
అలాగే మా స్నేహితుడు చనిపోయినప్పుడు నేను రాసుకున్న ఒక కవిత నా January టపాలలో 'స్నేహశోకం.......' ని చూడగలరు.If ur interested.
http://www.srushti-myownworld.blogspot.com/

@pratap, pratap gaaru meetote nenadi.evvarini noppinchaalani naa uddesam kaadu

Srividya said...

అసలు పై కామెంట్ ఈ టపాలో రాయాలా వద్దా అని చాలా ఆలోచించి మరీ సరేలే రాసేసాను.I am really sorry for that.I should not write this here.I am sorry if I seem to be insensitive towards your pain.

మీ పేరు మీ ఇష్టం.I have no business in questioning that.. కనీ పేరు బాలేదని కాదు నా ఉద్దేశ్యం.blogs, comments these are very smaal matters. వీటన్నటి కన్నా జీవితం పెద్దది. భాధా, సంతోషం జీవితంలో భాగమే..కోపం, ప్రేమ అలానే.. కానీ భాధ, కోపం మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. అదే సంతోషం, చిరునవ్వు మనిషి ఆయుష్షుని రెట్టింపు చేస్తాయి. నేను అందుకే పై కామెంట్లొ అన్నాను ఆ భావం మీ బ్లాగు పరిమితం అవ్వాలని, మీ హృదయంలో వుంచద్దు అని. అలాంటి బాధ మనసులో చేరి మిమ్మల్ని బలహీనం చెయ్యకూడదు అని చెప్పడం నా ఉద్దేశ్యం.

కష్టానికి చివరి మజిలీ కన్నీరు కాదు. చాలా మంది అదే కష్టాన్ని వేరే దృష్టితో చూడగలిగారు. దాన్ని ఆవేశంగా, మంచి ఆలోచననగా, ఒక మంచి పనికి పునాదిగా మార్చగలిగారు. ఈ సమాజంలొ చాలా మంచి సంస్థలు దుఖంలో నుంచి పుట్టినవే.జీవితంలో కన్నీరు భాగం అయినంత మాత్రాన దాన్ని లెక్క చేసి, దానికి మనసులో పెద్ద పీట వెయ్యక్కర్లేదు. దాని వల్ల ఎవరికి ఉపయోగం వుండదు. ఆఖరికి మనక్కూడా... మీరే అన్నరుగా కన్నీరు చాలా విలువైనది. మీ నేస్తం జ్ఞాపకం సాక్షిగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి. ఆ పనిలొ, మీతో పాటూ నేనూ వుంటాను.

అసలు మీరు అలా ఆలోచించే అమ్మాయి కాకపోతే, ఈ పొడుగు కామెంట్ నా కోసం నేను రాసుకున్నను అని అనుకుని వదిలేయండి... ఇంకో విషయం నా మనసులో మాటని మీకు చేరవెయ్యాలన్న ఆరాటం అంతే. ఇక ఈ కామెంట్లు ఈ టపాకి సంబంధం లేకుండా, ఇన్ సెన్సిటివుగా వున్నయి అనిపిస్తే నిర్మొహమాటంగా డిలీట్ చేసెయ్యండి.Once again I am telling you Its not about your blog title. my mail id is srividya415@gmail.com.

వేణూశ్రీకాంత్ said...

అంత మంచి భావాలు ఉన్న తను అంత త్వరగా వెళ్ళిపోయాడంటే చాలా బాధ గా అనిపించిందండీ. కానీ మీ లాంటి స్నేహితుల మనసుల్లో కొలువుండి తన స్నేహ పరిమళాలని మీ ద్వారా వ్యాపింప చేస్తూనే ఉంటాడు. ఈ జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నందుకు థాంక్స్.

కల said...

శ్రీవిద్యా ఏంటి మీరు మరీనూ? మనం క్షమాపణలు చేపుకోనేంత దూరంలోలేమని నా అభిప్రాయం.
మీకు అలా అనిపించి చెప్పారేమో. నిజంగా నా బ్లాగు అలా ఉందా అని నేను ఎన్ని సార్లు, నన్ను, నా బ్లాగుని శల్య పరీక్ష చేసుకున్నానో. కాని నాకు ఉహ్హు ఏమీ అనిపించలేదు, అదేం చిత్రమో.

జీవితం, ఒప్పుకుంటాను అది చాలా పెద్దది. కన్నీరు, పన్నీరు, నవ్వులు, ఏడుపులు, సంతోషం, బాధా, పుట్టుక, చావు వీటన్నింటి కలబోతే జీవితం అని. వీటి మధ్యన మనం చాలా దూరం ప్రయాణం చెయ్యాలని కూడా తెలుసు. బాధ నా బలహీనత కాదు, అలానే సంతోషం కూడా నా బలం కాదు. నేనూ, నా చుట్టూ ఉన్న వాళ్లు హ్యాపీగా ఉంటే చాలు అనుకునే చాలా సాధారణ అమ్మాయిని నేను. నా ఉద్దేశ్యం మీకు అర్ధమయిందనుకొంటాను. మీరనుకోనేట్టు నేను నా బాధని గుండెల్లో పెట్టుకొని కుమిలి పోనులెండి. ఆ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలనే ఈ post రాసాను అంతే కానీ ఇలా మనం మన బాధల గరించి, కన్నీళ్ళ గురించి చర్చించు కోవడం కోసం కాదులెండి.
కాబట్టి ఈ topic ని ఇక వదిలేద్దాం.

Srividya said...

కల గారు మీ మొదటి సమాధానంతోనే మీరేంటో నాకు అర్ధమయ్యింది.బ్లాగు పేరు నచ్చకపోతే సూటిగా చెప్పచ్చు కదా అన్న ప్రతాప్ గారి కామెంట్ చూసి, నేను మాట్లాడింది అసలు బ్లాగు పేరు గురించే కాదు. మరి నేను అనను దాన్ని అన్నాను ఎలా అంటారు అని ఉక్రోషం వచ్చేసి ఆవేశంగా అలా రాసేసాను.రెండు రోజులాగి చూస్తే నాదెంత పిల్ల చేష్టో అర్ధమయ్యి జ్ఞానోదయమయ్యింది. నేను రాసేది నేను రాస్తాను. చదివే వాళ్ళు వేరుగా వేరుగా అర్ధం చేసుకోవచ్చు. మీకర్ధమయ్యింది నా ఉద్దేశ్యం. మీరన్నట్టు ఇంక వదిలేద్దాం మరి....

Balu said...

కొన్ని ఇష్టాలు, కొన్ని కష్టాలు, కొంత సంతోషం, మరికొంత బాధ కలిపితేనే జీవితం. అంతా సంతోషంగా గడిచిపోతే బాగుండదని అనుకుంటాడేమో విధాత. అందుకే ప్రతి జీవితానికి కొన్ని మలుపులు - కొన్ని మధురమైనవి, కొన్ని గుండెను గాయపరిచేవి. 'మనది ' అనుకున్నది కళ్ళముందే కాలగర్భంలో కలిసిపోతే మిగిలేది బాధే.

మీరు రాసిన ప్రతి అక్షరంలోను మీ మనసులోని బాధ వ్యక్తం అయ్యింది. స్నేహితుల విషయంలోను, సమాజం పట్ల అంత బాధ్యతగా మెలిగిన వ్యక్తి ఙ్ఞాపకాలు, తను మీకు ఇచ్చిన స్ఫూర్తి శాశ్వతం.