Thursday, October 23, 2008

మాటే మంత్రమా?

అవునా? మాటకు అంత మహత్తు ఉందా? అని నన్నెవరన్నా ప్రశ్నిస్తే నాకు చటుక్కున కోపం వచ్చేస్తుంది. అవును మాటే మంత్రమై కొన్ని సందర్భాల్లో మన చేత, మనం చెయ్యలేమనుకున్న వాటిని, మనకు సాధ్యం కావన్న వాటిని చేసేలా చేస్తుంది. అందుకే నేనంటాను మాటే మంత్రమూ.

అక్షరాలు దిద్దేవేళ, వంకరగా రాసిన వాటిని చెరిపేసి మళ్లీ బాగా రాద్దామని ప్రయత్నించి టీచరుకి దొరికి పోయి తన్నులు తిని, ఎర్రగా కందిన చేతిని చూసుకొంటూ, నెత్తిన కన్నీటి కడవ పెట్టుకొని ఇంటికి చేరిన పాపాయిని "ఏడవకు రా తల్లీ, ఈ రోజు కాకపొతే రేపు బాగా రాస్తావు. ఇదిగో నీకు అక్షరాలు బాగా రావాలని డబుల్ రూళ్ళ నోటుపుస్తకం తెచ్చాను చూడు, ఇదిగో దీని మీద నికిష్టమని టాం అండ్ జెర్రీ బొమ్మ కూడా అంటించాను. బావుంది కదూ?" అని అమ్మ ఇన్ని మాటల మంత్రాలు జపిస్తే ఆనందం నింపుకోని చిన్ని మనస్సు ఉంటుందా? అందుకే నేనంటాను మాటే మంత్రమూ.

ఆటల పోటీల్లో మొదటి ప్రైజు రాలేదని బాధపడుతూ ఇంటికి చేరిన చిన్నారిని, "ఏమయింది నాన్నా? అలా వున్నావేం? ఓహో మొదటి ప్రైజు నీకు రాలేదా? అయితే ఏమిటి? నీకన్నా తను బాగా ఆడింది అందుకనే తను గెల్చుకొంది. నువ్వు మొదటి నుంచీ బాగానే పరిగెత్తావు. మధ్యలోకి రాగానే ప్రైజు నీకు రాదని నీ పట్టుని సడలించి వేసావు. అందుకనే బహుమతి చేజారింది. చివరి వరకు విజయం కోసం ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు, విజయానికి ఒక మెట్టు చేరువవడం తప్ప. వచ్చేసారి మరలా ప్రయత్నించి చూడు నీకు మొదటి బహుమతి తప్పకుండా వస్తుంది." అని నాన్న కొద్దిగా కటువుగా, కొద్దిగా ప్రేమగా, కొంచెం ప్రేరణ ఇస్తే, వొంట్లోకి ఆవేశాన్ని నింపుకొని పాపాయి ఉంటుందా? వచ్చేసారి ఎలాగైనా సాధించి తీరాలి అని అనుకోని బుజ్జాయి ఉంటుందా? అందుకే నేనంటాను మాటే మంత్రమూ.

"అన్నయ్యా చూడు, వాడెవడో రోజూ నా వెనుకాలే వస్తూ నన్ను తెగ ఏడిపిస్తున్నాడు. నాకు భయం వేస్తోంది. నేను ఇంక ట్యూషన్ కి వెళ్ళను" అని భోరున ఏడిస్తే, "చూడు, ఈరోజు నేను ఉన్నాను కాబట్టి నేను వచ్చి వాడిని కొడుతాను. ఇదే నేను వెళ్ళిపోయిన తర్వాతో, లేక మేమెవరం నీకు తోడుగా లేక పోయినప్పుడో ఎదురైతే ఇలానే ఏడుస్తావా? భయం, భయం, ఈ భయం ఎక్కడో ఉండదు. నీలోనే ఉంది, అవసరమైనప్పుడు మన ధైర్యాన్ని దాచేసి, నీ శత్రువు చేతికి తను ఆయుధమై, నిన్ను ఒంటరిని చేసి ఓడిస్తుంది. అందుకని ముందర ఆ భయాన్ని మింగెయ్యి. ధైర్యం ఆటోమటిక్ గా నీ దగ్గరే ఉంటుంది." అని నిలువెల్లా ధైర్యాన్ని నింపితే, కన్నీరు తుడుచుకొని, ఎర్రబడ్డ కనులని రౌద్రంగా మార్చుకొని, తన శక్తిని చూపించాలనుకోని ఆదిపరాశక్తి ఉంటుందా? అందుకే నేనంటాను మాటే మంత్రమూ.

"మళ్లీ ఇంటర్వ్యూ పోయింది. వారికి అస్సలు ఎలా ఇంటర్వ్యూ చెయ్యాలో తెలిదు. నేను వెళ్ళింది టెస్టింగ్ కోసమైతే, నన్ను జావా ప్రశ్నలు అడిగారు. పోతే పోయింది, ఇది కాకపొతే ఇంకోటి." అని పక్కనున్న నేస్తంతో అంటే, "వచ్చే ఇంటర్వ్యూ కూడా పొతే అప్పుడు కూడా ఇది కాకపొతే ఇంకోటి అని అనుకొంటావా? నిన్ను జావా ప్రశ్నలు అడిగారు అని అంటున్నావు. నిజం చెప్పు నిన్ను ఎందుకు జావా ప్రశ్నలు అడిగారో నీకు తెలీదా? నీ ఓటమికి అవతలి వారిని ఎప్పుడైతే బాధ్యులని చెయ్యడం మొదలు పెడుతావో అప్పుడు నిజంగా నువ్వు ఓడిపోవడం మొదలు పెడుతావు. ఓటమిని నీ మీద వేసుకో, అది నీనుంచి పారిపోయేలా చెయ్యి. అప్పుడు విజయమే నిన్ను వెతుక్కొంటూ నీ దరించి చేరుతుంది." అన్న నేస్తం మాటలని స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించని పడతి ఉంటుందా? అందుకే నేనంటాను మాటే మంత్రమూ.

"అబ్బ రోజూ ఆఫీసులోను, ఇంటిలోనూ బండెడు చాకిరి చెయ్యలేక చచ్చిపోతున్నాను. పిల్లలేమో ఎక్కడివి అక్కడ, ఈయన కైతే అస్సలేమీ పట్టదు. ఇంట్లో నేనొక మనిషి నున్నానని, నేను ఆయన లానే కష్టపడుతున్నానని అస్సలు గుర్తించారా?" అని మనస్సులో పడే బాధని పసిగట్టినట్లు, "నువ్వెంత కష్టపడుతున్నావు! ఇంత చాకిరి అస్సలు ఎలా చెయ్యగలవు. ఇంత చేసినా నీ మొహాన ఆ చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోదు. నువ్వు కాబట్టి ఇంటిని ఇంత అందంగా, పిల్లల్ని ఇంత శ్రద్దగా పెంచుతున్నావు. అదే ఇంకెవరన్నా నీ ప్లేసులో ఉంటేనా? ఎప్పుడో పారిపోయి ఉండేవారు. నిన్ను భార్యగా పొందటం నిజంగా నా అదృష్టం" అన్న పతి మాటలకి తన కష్టాన్నంతా మరిచిపోలేని సతి ఉంటుందా? అందుకే నేనంటాను మాటే మంత్రమూ.

Tuesday, September 30, 2008

ప్రేమ వేరు - పెళ్ళి వేరా?


నేనీమధ్య నా సహాధ్యాయిని అతని భార్యని (తను కూడా నా సహాధ్యాయే) కలవడం జరిగింది. వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి. కులం పేరుతో దూరం చెయ్యబోయిన పెద్దలనెదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు. అమ్మాయిది చాలా మెతక వైఖరి, అతనేమో విజ్ఞానఖని, ఆపదలో ఉన్నవారిని ఎంతకైనా తెగించి ఆదుకొంటాడు, ఎవరన్నా సహాయం అడిగితే లేదు అనకుండా ఇద్దరూ కలిసే చేస్తారు. అందుకే ఆ జంట get-to-gather ఏర్పాటు చేస్తే మా కాలేజి స్నేహితులంతా మిస్ కాకుండా హాజరు వేయించుకొంటాము. అతనితో ఎప్పుడూ వాదన జరపడం నాకొక సరదా. అలాంటి వాళ్ళతో వాదన జరపడం వల్ల నాకు ఎంతో కొంత జ్ఞానం పెరుగుతుందనే స్వార్ధంతో అతనితో వాదన జరుపుతాను.

అందరం భోజనాలు కావించి కబుర్లలో మునిగితేలుతున్నాం. ఇంతలో నాకొక డౌటు వచ్చింది (అదేమిటో బుర్రలో ఎప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి), అదే అతని ముందు వుంచాను, "ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" అని. అందరు తడుముకోకుండా రెండూ దాదాపు ఒకటే, ఒకటి ఇంకో దానిలో అంతర్భాగం (మాకెవ్వరికి అంత జ్ఞాన సంపద లేదులెండి) అన్నారు. ఇంచుమించు నా ఆలోచనా తీరు కూడా ఇదే. కాని అతను మాత్రం "రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు, వివరంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక స్థితి, అలానే పెళ్ళి కూడా ఇంకొక స్థితి. మనిషి ఒక స్టేజి లోంచి ఇంకో స్టేజి లోనికి వెళుతాడు. కాకపొతే ప్రేమ ముందా? పెళ్ళి ముందా? అనేది అతని/ఆమె ఆలోచనలని బట్టి ఉంటుంది" అని అన్నాడు.

నేను ఊరుకుంటానా? "లేదు, రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు అని అంటున్నావు. కాని ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఉంచేది ప్రేమా? లేక పెళ్ళా?" అని (అతి)తెలివిగా ప్రశ్నించాను. దానికి సమాధానం అతను చెప్పేలోపలే, అతని భార్య అందుకొని "కొంచెం నమ్మకం, ఇంకొంచెం ప్రేమ, మరికొంచెం పెళ్ళి, ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఆకర్షణ" అని చెప్పింది (మా పిల్ల కొంచెం మెతకలా కనిపిస్తుంది కానీ తెలివైనదే) ఆ సమాధానం విన్న మా అందరికి ఏమీ అర్ధం కాలేదు. "ఆకర్షణా" అంటూ కళ్ళు పైకి తేలవేశాం. "అవును, ముమ్మాటికీ ఆకర్షణే", అంటూ అతను కొనసాగించాడు. "ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతో మొదలవుతుందన్నట్లు, ఎంత చిన్న/పెద్ద బంధమైనా ఆకర్షణతోనే మొదలవుతుంది. నిజం చెప్పండి రేపు మీతో జీవితాన్ని పంచుకోబోయే వాళ్ళ మీద మీకు ఆకర్షణ లేదా (మాలో అప్పటికో కొంతమందికి ఎంగేజుమెంట్లు జరిగిఉన్నాయి)?".

ఇంతలో మాలో ఇంకొకరు అందుకొన్నారు, "నువ్వు చెప్పేది నిజమే కావొచ్చు, కానీ ఆకర్షణ పునాదిగా జరిగే ఈ ప్రేమ/పెళ్ళి నిలబడుతాయా?" అని అడిగారు. దానికి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఫక్కున నవ్వి, "నేను ఆకర్షణతో మొదలవుతాయి అని అన్నానే గాని చివరి వరకు అదే ఆకర్షణ ఉంటుందని చెప్పలేదుగా. పోను పోను ఈ ఆకర్షణ తగ్గి చివరకి వాళ్ళ మధ్య కొంచెం/పూర్తి గానో మానసికమైన అనుభంధం ఏర్పడుతుంది. ఈ అనుభంధం స్థిరంగా ఉన్నవాళ్ళు తమ మిగతా సగం కోసమే జీవిస్తారు, అది లేని వాళ్ళు మిగతా వాళ్ల సగం కోసం వెంపర్లాడుతారు" అని ముక్తాయింపు ఇచ్చాడు.

చర్చ దారి తప్పుతుందేమోననిపించి, "సరే ప్రేమ, పెళ్ళి రెండూ వేరు వేరు అయినప్పుడు మరీ మీ పెళ్ళి ప్రేమపెళ్ళి కదా? మరి ఇదేమిటి? (భలే తెలివి ఉంది కదా నాకు? :-) )" అని ప్రశ్నించాను. దానికి అతను "ప్రేమ ముదిరితే మా పెళ్ళి జరిగింది కాబట్టి దాన్ని ప్రేమ పెళ్ళి అంటున్నాం, నిజానికి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది, కాకపొతే వాళ్ళ మధ్య ఆ మానసిక అనుభంధం చాలా తొందరగా ఏర్పడుతుంది. ఎందుకు అనేది కొంచెం అనలైజ్ చేస్తే మీకే తెలుస్తుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నా సరే వాళ్ల మధ్య సరైన మానసిక అనుభంధం ఏర్పడక పోవచ్చు, ఎందుకంటే వాళ్లు ప్రేమించుకొంటున్నాం అనే భావనని ప్రేమిస్తుంటారు. అందుకే చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్ళవు." అన్నాడు.

కానీ మేమందరం మా వాదనకే కట్టుబడి ఉన్నాం, ఎవ్వరమూ అతని వాదనని అంగీకరించలేదు. ఇదే అతనితో అన్నాం, "సరే మీరెవ్వరూ నాతో అంగీకరించం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని రెండు ప్రశ్నలు వెయ్యోచ్చా?" అని అడిగాడు. "సరే" అని అన్నాం. "మొదటి ప్రశ్న, ప్రేమ, పెళ్ళి రెండూ ఒకటే అని మీరందరి అభిప్రాయం, కదా? మరి ప్రేమించుకొన్న వారందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం లేదు? వాళ్లు ప్రేమించుకొంటున్నాం అన్న భావనని ప్రేమించారు అని ఇందాక నే చెప్పిన సమాధానం చెప్పొద్దు. అలా అయితే, చరిత్రలో గొప్ప ప్రేమలుగా నిలిచిపోయిన వారి పెళ్ళిళ్ళు ఎందుకు జరగలేదు?
రెండో ప్రశ్న, మన సమాజంలో ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్తున్నాయి? ప్రేమ పెళ్ళి రెండు కలిసి ఉంటే మరి వారెందుకు విడిపోవాలని నిర్ణయించుకొంటున్నారు?" ఈ రెండు ప్రశ్నలు విన్న తర్వాత మాలో అంతర్మధనం మొదలయింది. ప్రేమ పెళ్ళి రెండూ వేర్వేరా?