Wednesday, August 27, 2008

నాకు చిన్నప్పుడో కల ఉండేది !!


అవునండి నాకు చిన్నప్పుడో కల ఉండేది, ఎలాగైనా అయ్యేయస్సో, ఐపియస్సో అయి అలా ఠీవిగా నడుచుకొంటూ వచ్చి మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొన్నప్పుడు ఆయన కళ్ళలో కనిపించే మెరుపును చూడాలని మాత్రం కాదండి. ఆయినా ఆశీర్వాదం వంగి తీసుకొనేటప్పుడు కళ్ళలో మెరుపు ఎలా కనిపిస్తుందండీ నా ఖర్మ కాకపొతే. కల్పనా చావ్లా లానో, సునితా విలియమ్స్ లానో అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ పిల్లి నడకలో, బుల్లి నడకలో చెయ్యాలని కూడా కాదు. నా చిన్ని కల, చేపలు పట్టే దానవ్వాలని ఉండేది. అయ్యో అమ్మాయ్ అదేం కల అని బోలెడు ఆశ్చర్యపోకండి. దానికి చాలా కథ ఉంది లెండి.

నాకు చిన్నప్పటి నుంచి చేపలంటే ప్రాణం, తినడం కాదు, అవి అటుఇటు ఈదుతూ ఉంటే వాటిని చూడటం అన్న మాట. అల్లానే మా ఇంటి పక్కన ఒక పెద్ద కొలను ఉండేది, ఎంత పెద్దది అంటే దాంట్లో బోలెడు చేపలు కూడా వుండేవి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాంట్లో చేపలని చూడటం ఒక అలవాటుగా మారిపోయింది, ఎంత పెద్ద అలవాటు ఇందిరమ్మ భజన, దేవుడి పాలన లాగా. ఎలాగైనా సరే చేపల్ని పట్టుకొని ఇంట్లో పెంచుకోవాలనే కల మొదలయ్యింది నాకు. ఇక మనం కొద్దిగా పెద్ద అయి నడవడం మొదలు పెట్టిన తర్వాత నా ఈ ఉత్సాహాన్ని గమనించిన పెద్దలు అటు వెళ్ళకుండా బాగా కట్టడి చేసారు. కానీ మనం ఊరుకుంటామా? ఒక మంచిరోజు చూసుకొని పెద్దల కళ్లు కప్పి కొలనులోకి దూకేసాం, మంచి మంచి చేపలు పట్టుకొని వచ్చి మా అమ్మకి చూపించాలని. కానీ తర్వాత ఏమైందో గుర్తులేదు.

కళ్లు తెరిసే సరికి ఎవరో నా జబ్బ పట్టుకొని ఉన్నారు, ఎదురుగా ఉన్న మా అక్కని "ఈ అమ్మాయి మీ అమ్మాయేనా?" అని అడుగుతున్నారు. అదేమో పెద్ద ఆరిందాలాగా "అబ్బే ఈ పిల్ల ఎవరో బాగా నల్లగా ఉంది. మా పిల్ల భలే తెల్లగా ఉంటుంది" అని చెప్పింది. అసలే చిరాకులో ఉన్న నేను, "యేనే, యేనే" అని ఏడవడం మొదలు పెట్టాను. ఈ కంగారులో మా అమ్మ వచ్చి నన్ను పరీక్షగా చూసి "అవును ఇది మా పిల్లే" అని నన్ను తీసుకెళ్ళి స్నానం చేయించడం మొదలు పెట్టి మెల్లగా అస్సలు విషయం రాబట్టుకొని ఒకటే నవ్వడం మొదలు పెట్టింది. అలా నవ్వడమే కాదు అందరినీ పిలిచి మరి విషయం చెప్పి ఒకటే నవ్వులు. ప్రతిపక్షాలు కూడా ఇంత కుట్ర చేసి ఉండవు, నాకే కానీ నోరు కానీ ఉంటే నువ్వు అమ్మవా, "లెజెండ్రీ"వా అని తిట్టిఉండేదాన్ని. ఇంతకీ అస్సలు సంగతి ఏమిటంటే, నేను కొలను, కొలను అని చిన్నప్పటి నుంచి భ్రమ పడుతున్నది కొలను కాదు పెద్ద మురికిగుంట అని, దానిలో తిరిగేవి చేపపిల్లలు కాదు దోమపిల్లల,కప్పపిల్లల లార్వాలు అని, మా అక్క నలుపు నలుపు అనుకొన్నది నలుపు కాదు అదంతా బురద అని తర్వాత తెలిసింది.


తర్వాత మళ్ళీ కల మారిపోయింది. మనం తీరికగా మొదటిసారి బడిలోకి అడుగెడినప్పుడు మా టీచరమ్మ అలా కుర్చీలో కూర్చొని మన పేరు, ఊరు అన్నీ రాసుకొంటూ ఉంటే మా నాన్న వినయంగా నిలబడి సమాధానం చెబుతుంటే అబ్బో చెప్పొద్దూ నాకు బోలెడు ఆశ్చర్యమేసింది. అంతే వెంటనే డిసైడు అయిపోయాను ఎలాగైనా రేప్పొద్దునే ఆ కుర్చీలో కూర్చోవాలని. అంటే మర్నాడు ఎగాదిగా లగెత్తుకొంటూ వచ్చి ఆ కుర్చీలో కూర్చొన్నా, కాస్సేపటికి మా టీచరు వచ్చి "ఏమే, ఇంత లేవు అప్పుడే నా కుర్చీ కావలసివచ్చిందా నీకు?" అని లాగి పెట్టి ఫటేలుమని ఒక్కటి పీకింది, అంతే ఆ దెబ్బతో మన కళ్లు తెరుచుకొన్నాయి, ఆ కుర్చీలో కుర్చోవాలంటే మనం తొందరగా పెద్దవాళ్ళం అయిపోవాలనీనూ, కళ్ళజోడు పెట్టుకోవాలనీనూ, చేతిలో బెత్తం ఉండాలనీనూ, ఆ బెత్తంతో అందరినీ కొట్టాలనీనూ. ఇంతలో ఏదో పని ఉందని మా టీచరు పక్కకు వెళ్లారు, సరిగ్గా అప్పుడే మన చూపు పక్కన ఉన్నవాడి మీద పడింది. వాడేమో యమా సీరియస్ గా పలక మీద అ, ఆ లు, జలుబు చేసిన ముక్కును తుడుచుకొన్న చేతిని ఎలా గౌను కి రుద్దుకొంటామో అలా అరిగిపోయిన బలపంతో తెగ రుద్దేస్తున్నాడు. అంతే ఫటీల్మని ఒక్కటి పీకాను బెత్తంతో, వెధవ ఒక్క దెబ్బ కూడా ఓర్చుకోలేక ఏడుపు లంకించుకొన్నాడు. ఆ ఏడుపు సునామీ దెబ్బకి అందరు కొట్టుకొచ్చి మా క్లాస్ రూమ్ లో పడ్డారు. ఏమయిందని అడిగితే వాడు నా మీద కంప్లైంట్ చేసాడు. నేనేమో బుద్దిగా, "టీచరు మలేమో, మలేమో వాడు లుద్దటం ఆపేస్తాడేమోనని కొట్టా." అని చెప్పాను, తన్నులు తిన్నాను. ఎలా కొట్టారంటే చిన్న పిల్లనని చూడకుండా అలా కొట్టారు. అప్పుడు మళ్ళా డిసైడు అయిపోయా, ఎలాగైనా తొందరగా పెద్ద టీచరునై మా టీచరుని బాగా బెత్తంతో కొట్టాలని.

కానీ అనుకొన్నవన్నీ జరగవు కదండీ? మళ్ళీ ఇంకో కల మొదలయింది నాకు. ఒక రోజు సాయంకాలం ప్రోద్దుగూంకే వేళ మనం వసారాలో కూర్చొని అరిగిపోయిన బలపాలు తింటూ మధ్య మధ్యలో కొద్దిగా మట్టిని నంజుకొంటూ హాయిగా విశ్రాంతి తీసుకొంటున్నాం. ఇంతలో నా కళ్ళ ముందు ఒక మహోత్తర, మహోన్నత, రసరమ్య సిద్ధిని కలిగించే దృశ్యం ఆవిష్కృతమయింది. మా బామ్మ గేదెను కట్టివేసి, ఆ దాని పోడుగులోంచి పాలు పితుకుతున్న దృశ్యం నాకు కనిపించి నోట మాట రాలేదు. అంత నల్లని గేదే దగ్గరనుంచి అంత తెల్లని పాలు ఎలా వస్తాయో అర్ధం కాక కాలం స్తంభించి పోయింది. అంతే మనం వెంటనే రంగం లోకి దిగాం, "బామ్మ, బామ్మా నేను కూడా పాలు తీస్తాను." అని చిన్నపిల్ల ముద్దుగా అడిగితే ఎవరు మాత్రం కాదంటారు? కాని మా బామ్మ మాత్రం కాదనింది. అంతే ఎలాగైనా నేను పాలు పితకాలని డిసైడు అయిపోయా.


అలా మెల్లగా ఒక రోజు మా బామ్మ పాలు పితికి అలా పక్కకి వెళ్ళగానే, చంద్రబాబు అధికారం కోసం వెయిట్ చేస్తున్నట్లు, ఇందిరమ్మ పటం కోసం రాజశేఖరుడు వెయిట్ చేస్తున్నట్లు, మా బామ్మ పక్కకు ఎప్పుడూ వెళుతుందా అని వెయిట్ చేస్తున్న నేను చటుక్కున ఒక చిన్న గ్లాసు పట్టుకొని ముందుకు ఉరికాను. ఆదరాబాదరాగా దాని పొడుగు మీద చెయ్యి వేసాను. అంతే ఏం జరిగిందో గుర్తులేదు, కళ్ళ ముందు పంచరంగుల నక్షత్రాలు. తెలివి వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉన్నా. చుట్టూరా అందరు, పాపం ఏమైందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చటుక్కున లేచి కూర్చున్నా, అబ్బ నెప్పిగా ఉంది అని చెబుదామనుకొన్నా, కానీ ఎయిర్ పిల్లో లోంచి గాలి పోయినట్లు మాట తుస్సుమని పోయింది. లగెత్తుకొని వెళ్లి అద్దంలో చూసుకొంటే నాగార్జున సాగర్ గేట్లు నీల్లేనప్పుడు ఎత్తేస్తే ఎలా వుంటుందో అలా ఉంది నా మొహం, ముందర రెండుపళ్ళు ఢాం. అంతే మళ్ళీ జన్మలో గేదెపాల జోలికి వెళితే ఒట్టు.

ఇంకా బోలెడు కలలు మిగిలి పోయాయి, తర్వాత తీరికగా ఉన్నప్పుడు రాసి పెడుతాలెండి. అందాకా మీకేవన్నా చిన్నప్పటి కలలు మిగిలి ఉంటే అవి ఇక్కడ పంచుకోండి.

Tuesday, August 19, 2008

ఆ నిమిషాన


ఆ క్షణాన, కనులు నేలపైకి వాలిపోయెనే,
ఆ క్షణాన, శ్వాస బరువై ఎద ఆగలేకపోయెనే,
ఆ క్షణాన, ధ్యాస కరువై మది తాళలేకపోయెనే,

ఆ సమయాన, ఉచ్ఛ్వాశ నిచ్ఛ్వాశ అదుపుతప్పెనే,
ఆ సమయాన, మౌనం మౌనంగా నన్నావరించెనే,
ఆ సమయాన, సన్నిధిలోని ఘడియలు క్షణాలయ్యెనే,

ఆ నిమిషాన, పాదం పదపదమంటూ తహతహలాడినే,
ఆ నిమిషాన, చిరుచెమటలు ముచ్చెమటులుగా మారినే,
ఆ నిమిషాన, అధరాలు వణికి, మాటల ద్రవ్యం తొణికెనే,

ఆ క్షణం కనులు కనులు కలిసి అనిమేషమైన వైనం.
ఆ సమయం మౌనం మౌనం మాట్లాడుకున్న తరుణం.
ఆ నిముషం రుధిరవర్ణాల అధరాలు కంపించిన విధం.

Tuesday, August 12, 2008

తెలుగుదనం

(అస్సలు నా స్మృతిపదంలో మెదులుతున్న తేటతెలుగు అనుభవాలని మీతో పంచుకోవాలని ఉన్నా, నాకు మాత్రం ఇది రాసేలా ప్రోత్సాహాన్నిచ్చింది మాత్రం, భుజాన బండెడు పుస్తకాలు మోస్తూ, వాటిని మొయ్యటం కోసం బూస్టు, హార్లిక్సు తాగి, స్కూల్ కి బస్సులో వెడుతూ, ఏదో బందిఖానాలోకి వెళుతున్నట్టూ, దారిన పోయేవారిని అమాయకంగా చూసే పసిపిల్లలు. వారిని చూస్తే నిజంగా జాలి వేస్తుంది. తల్లిదండ్రులు వారి వారి కలలని తమ ఉహాలోకంలోకి బలవంతంగా చొప్పిస్తే వాటిని తీర్చడంకోసం తమ బాల్యాన్ని పణంగా పెడుతున్న వారిని చూస్తే జాలికాక మరేం వస్తుంది? నిజంగా ఎంత ఆనందమైన బాల్యాన్ని వారు కోల్పోతున్నారో అని ఓ నిట్టూర్పు విడిచి నేను మళ్ళీ నా పనుల్లో పడిపోయినా అప్పుడప్పుడు ఆ బాధ మనస్సులో తొలుస్తూనే ఉంటుంది అందుకే ఇది తెలుగుదనం మీద రాసినా కాని అంతర్లీనంగా నా బాల్యం కనిపిస్తుంది. ఇక చదవండి మరి.)
=====================================================================================
తెలుగుదనం,
అస్సలు ఈ పదం, కాదు కాదు, తెలుగు అన్న పదం వినిపిస్తేనే కనులలో ఎంత వెలుగొస్తుందో? మదిలో ఎంత జిలుగు వస్తుందో? ఉహల్లో ఎన్ని ఉసులోస్తాయో? మీకెవ్వరికన్నా ఇలానే అనిపిస్తుందా? అలా అనిపిస్తే ఆ గొప్పదనం మనది కాదు, ఈ పదానిది. తనలో పట్టుపరికిణి అంత అందాన్ని, పల్లె మనస్సులంత అమాయకత్వాన్ని, వాలుకనుల సోయగాత్వాన్ని దాచుకున్న ఈ పదం గొప్పదనమే అంత. దీని గురించి చెప్పడం, రాయడంతో బాటు వర్ణించడం అంటే అరిటాకులో, వేడి వేడి అన్నం, కొద్దిగా నెయ్యి కాసింత ఆవకాయ వేసుకొని ఎక్కడన్నా పచ్చని పైరులో, జలపాతంలా నీటిని వదిలే మోటరు పంపుసెట్ల మధ్యన వనభోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న మాట.

నా చిన్నప్పుడు మా కుటుంబం అంతా మా అమ్మమ్మ గారి ఉరిలో ఉండేది. అక్కడ మాదంతా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. ఎంత పెద్దది అంటే కృష్ణవంశీ సినిమాల్లో ఉంటుందే అంత పెద్ద కుటుంబం అన్న మాట. పెదనాన్న వాళ్ళ కుటుంబం, బాబాయి వాళ్ళ కుటుంబాలు, మామయ్యలు-అత్తమ్మలు, అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతయ్య ఇలా అందరం కలిసి ఒకే లోగిలిలో ఉండేవాళ్ళం. అందరితోపాటు వాళ్ళ పిల్లలు కూడా కలిసి మెలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న "కలిసి ఉంటే కలదు సుఖం" అన్న మాటకి అర్ధం అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు ఆరోజుల్ని తలుచుకొంటే అర్ధమవుతుంది.

మా ఇంటిముందర ఎదురుగా ఒక కొండ, దాని మీద మా ముత్తాతల, ముత్తాతల, ముత్తాతల, (and so on, నిజంగా ఎప్పటిదో నాకు తెలీదు) ముత్తాతలు నిర్మించిన రామాలయం ఒకటి ఉంది. దానికి దాదాపు నూరేళ్ళ చరిత్ర ఉండేది. రావణసంహారం అనంతరం రాముడి ఆగమన వార్తను మోసుకెళ్ళిన హనుమంతుడు, దారిలో ఎక్కడో కొంతమంది సన్యాసులు రామభజన చేస్తుంటే విని అక్కడ ఆగి కాస్సేపు వారితో జేరి రామభజన చేసి తర్వాత అయోధ్యకు బయలు దేరి వెళ్ళిపోయాడంట. ఆంజనేయుడు దిగిన స్థలంలోనే ప్రస్తుతం నేను చెప్పిన రామాలయం వెలిసిఉంది. ఆలయం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే అది ఆలయం అవుతుందో ఈ ఆలయాన్ని చూసి తెలుసుకోవలసిందే. చుట్టూ ప్రహరీ, మధ్యలో కోనేరు, నేను రాముడి దాసుణ్ణి అని సగర్వంగా తల ఎత్తి నిలబడి ఉన్నట్లుందే ఎత్తైన ధ్వజ స్తంభం, 108 మెట్ల కాలిబాట ఇలా ఆ ఆలయం శోభిల్లుతూ ఉండేది. కోనేటిలోని నీరు మా (పసిపిల్లల) నవ్వులంత స్వచ్ఛంగా, తియ్యగా వుండేవి.

ఉదయాన్నే మేడ మీది గదిలో నిదురించే మా మొహాలపై పడే నీరెండ చురుక్కుతో, అప్పుడే వినిపిస్తున్న పక్షుల కిలకిలరావాలతో, అలా గాలిలో తేలుతూ, M.S. సుబ్బలక్ష్మి గారి శ్రావ్యమైన కంఠం నుంచి జాలువారిన "కౌసల్యా సుప్రజా రామా.." సుప్రభాతపు మహత్తుతో ఆవులించుకొంటూ లేచే నాకు, ఆలయం పక్కనుంచి అప్పుడే ఉదయిస్తున్న భానున్ని చూడటం ఎంతో హాయిగా ఉండేది. అప్పుడే పూజ అయిపోతుందేమో వెనువెంటనే గుడిగంటల ధ్వని నా చెవుల చేరేది. వెనువెంటనే మేడ పైనుంచి దిగే నాకు మా లోగిళ్ళలో పరచిన అందమైన రంగవల్లులు, వాటి మధ్యలో కొలువు దీరిన గొబ్బెమ్మలు కనిపించేవి. అప్పటికే లేచి, తల స్నానాలు చేసేసి, కొప్పున తువాళ్ళు చుట్టుకొని, నొసటున కుంకుమ ధరించి, నుదుటి మీద పడే ముంగురులను మణికట్టుతో పైకి దోసుకుంటూ, పాదాలపై కూర్చొని ముగ్గులు తీర్చే అందరూ కనిపించేవారు. అలానే మెట్ల మీద కూర్చొని నాగార్జునసాగర్ వద్ద వొంపులు తిరిగిన కృష్ణవేణమ్మలా అలా అలా చేతిని మెలికలు తిప్పుతూ, అక్కడక్కడ విను వీధిలో మెరిసిన తారకల్లా కనిపించే చుక్కలని కలుపుతూ వారు గీసే ముగ్గులని చూడటం ఎంతో బావుండేది. "ఏంటే అమ్మాయ్? అలా కూర్చొని ఉండటమేనా? ఈ సంవత్సరమన్నా ముగ్గులు గీయడం నేర్చుకుంటావా? లేక మళ్ళీ నాకు రాదు అని చెతులెత్తేస్తావా?" అంటూ ఆట పట్టించే మామయ్య గొంతుతో ఈ లోకంలోకి వచ్చే నాకు, అక్కడి అందరి నవ్వులు బాగా ఉక్రోషం తెప్పించేవి. నా ఉక్రోషం చూసి అందరూ నవ్వుకోనేవారు. ఆ నవ్వులకి మనం ఇంకా బాగా ఉడుక్కొనేవాళ్ళం.

ఇలా అందరం ఈ సందడిలో ఉండగా, వీధిలో హరిదాసు కీర్తన వినిపించేది. అంటే చటుక్కున వంటింట్లో దూరి, నా చిట్టి చేతుల్లో పట్టి నన్ని బియ్యం తీసుకొని వీధిలోకి వెళ్లి ఆయనకోసం ఎదురుచూసే దాన్ని. ఆయన రాగానే బియ్యం వేద్దామని మనం ఎంత ప్రయత్నించినా నాకేమో ఆయన తలమీద ఉన్న గిన్నె అందేది కాదు. నేను నాప్రయత్నంలో ఉండగానే, మా నాన్నగారు వచ్చి నన్ను ఎత్తుకొని ఆ బియ్యం వేసేలా సహకరించేవారు. ఇంతలొ మా నానమ్మ కూడా వచ్చి చేటలో తెచ్చిన బియ్యం హరిదాసు గారికి సమర్పించేది. ఆయనలా వీధి చివర కనుమరుగయ్యేంతవరకు చూసి ఇంట్లోకి వెళ్ళి దంతవధాన, స్నానాది కార్యక్రమాలను ముగించుకొని వచ్చేదాన్ని. స్నానం చేసి గదిలోకి రాగానే అమ్మ నాకోసం తీసి పెట్టిన పావడా,జాకెట్టు వేసుకొని తడికురులను ఆరబెట్టుకోవడం కోసం వసారాలోకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ వసారాలో మా తాతయ్య చదివే భాగవతంలోని "ఎవ్వనిచే జనించు.." వింటూ, సూర్యునికి ఎదురుగా నిలబడి కురులని ఆరబెట్టుకొంటుంటే ఏదో తెలియని హాయిగా ఉండేది. ఇంతలొ నేనున్నానంటూ కమ్మని గారెల వాసన నా నాసికకు తగిలేది, అంతే మనం రయ్యిన వంటింట్లోకి దూరి "తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలని" మా మాస్టారు చెప్పారు, కాబట్టి ముందర నాకు గారెలు పెట్టండి తర్వాత భారతం వింటాలే అని చెప్పి ప్లేట్ పట్టుకొని నిలబడే దాన్ని. అందరు ముసి ముసి నవ్వులు నవ్వుతూ నా ప్లేటులో గారెలు వడ్డించేవారు, మనం తినిపెట్టేవాళ్ళం.

ఈ కార్యక్రమం ముగియగానే, అందరితో కలిసి గెంతులు (ఔట్ డోర్ గేమ్స్) అదేనండి ఆడుకోవడానికి తుర్రుమనే వాళ్ళం. అక్కడ కోతి బాచ్ మా కోసం రెడీ గా ఉండేది. అందరం కలిసి తొక్కుడుబిళ్ళ, కోతి-కొమ్మచ్చి, అష్టాచెమ్మ, దొంగ-పోలీస్ ఇత్యాది ఆటలన్నీ ఆడుకోనేవాళ్ళం. మేమిలా ఆటల సందడిలో ఉండగా, "డు-డు బసవన్న, అయ్యగారికి దండం పెట్టు, అమ్మ గారికి దండం పెట్టు" అంటూ బసవన్న మేళం వినిపించేది. అంతే అందరం అటుపరిగెత్తి బసవన్న చేసే విన్యాసాలని అబ్బురంగా చూసే వాళ్ళం. బసవన్న అలా వెళ్ళగానే కొండదొరలు, సోది చెప్పేవాళ్ళు వచ్చేవారు. వారి చేత సోది చెప్పించుకోవడం ఒక మరపురాని అనుభూతి. నేనా అనుభూతిలో కనులు మూసుకొని ఉండగానే "బుస్స్ బుస్" మని ఏదో శబ్దం వినిపించేది. ఏమిటా అని చూద్దును కదా నాగుపాము. వళ్ళంతా కాస్సేపు జలదరించినా, అది తన పడగ విప్పి నాట్యంతో మమ్మలందరిని మైమరపించేది. మేమా మైమరుపులో ఉండగానే జంగం దేవరలు వచ్చేవాళ్ళు. వాళ్ళ కనికట్టుతో, మాటల గారడీలతో, హస్తలాఘవంతో మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేసేవాళ్ళు. ఇంతలో నకనకలాడుతూ ఆకలి మొదలయ్యేది. మొత్తం కుంటుంబంలోని మగవాళ్ళు, పిల్లా, జెల్లా, ముసలీముతకా అందరం ఒకేసారి భోజనానికి కూర్చొనే వాళ్ళం. నానమ్మ-అమ్మమ్మ ఆధ్వర్యంలో పెదమ్మ, అమ్మా, పిన్ని, అత్తయ్యలు అందరూ వడ్డిస్తుండగా అరటి ఆకుల్లో కొంచెం వేడి వేడి అన్నం, దానిలోకి మరగ కాచిన నెయ్యి, ముద్దపప్పు, కొద్దిగా ఆవకాయతో కడుపారా తిని బ్రేవ్ మని తెన్చేవాళ్ళం. ఆ భోజనం గుర్తొస్తే ఇప్పటికీ నోటిలో నీళ్ళూరుతాయి.

ఇలా భోజనం చెయ్యగానే వెనువెంటనే నిద్ర వచ్చేసేది. హాయిగా అమ్మమ్మ పక్కన పడుకొని కథలు చెప్పించుకొంటు నిద్రలోకి జారుకొనేదాన్ని. మెలుకువ వచ్చేసరికి సాయంత్రం అవుతూఉండేది. వెంటనే లేచి మళ్ళీ ఆటలు మొదలు పెట్టేవాళ్ళం. అలా ఆది ఆది అలసి సొలసి ఇంటికి చేరేవాళ్ళం. ఇంటికి చేరగానే మరలా స్నానం ముగించుకొని మొత్తం కుటుంబం అంతా ఒక దగ్గరికి చేరేవాళ్ళం. అందరూ పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకొంటూ ఉంటే, ఆడవారంతా ప్రమదావనంలో విహరిస్తూ ఉండగా, మేమంతా అదే చిన్న పిల్లలమండీ, అచ్చంగాయ, పులి-మేక వగైరా ఇండోర్ గేమ్స్ ఆడుకొనేవాళ్ళం. అటు తిరిగి ఇటు తిరిగి చూస్తే మరల భోజనాల వేళ అయ్యేది. భోజనం కానించి, మమ్మలందరిని ఒక చోట కూర్చోబెట్టి మా తాతయ్య ఆరోజు ఎందుకలా ఆనందంగా గడిపామో దాని గురించి వివరించేవారు. ఆరోజు గురించి మీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదనుకొంటాను. ఎందుకంటే అది మన తెలుగువారి అచ్ఛమైన, స్వచ్ఛమైన అచ్ఛతెనుగు పండగ, పెద్దపండగ అదేనండి మన సంక్రాంతి.

Tuesday, August 5, 2008

అమ్మో అల్లరా?

అమ్మో అల్లరా..
ఈ మాట వింటే మా అమ్మ చీపురు తిరగేస్తుంది. అయినా నేను, మా అక్కా, మా స్నేహితులు తెగ అల్లరి చేసే వాళ్ళం. గోడలెక్కడం, తోటల్లోకి దూరడం, సైకిల్లెక్కి ఉరంతా బలాదూరు తిరగడం అబ్బో చెప్పలేనన్ని అల్లరి పనులు, చెప్పలేనంత అల్లరి. ఈ మా అల్లరి దెబ్బకి "అల్లరి" మా ఇంటిపేరు, బాచ్ పేరు అయిపొయింది. కానీ నే చేసిన అల్లరి గురించి చెప్పాలంటే నేను పదోతరగతి చదువుతున్న రోజుల్లోకి వెళ్ళాలి మరి, వస్తారా రండి సరదాగా అలా నేను పదోతరగతి చదువుతున్న రోజుల్లోకి వెళ్దాం. మీ మొహం ముందర చూపుడు వేలు పెట్టుకొని రయ్యి, రయ్యి మని సవ్యదిశలో (అదే నండి clock-wise లో) ఓ 10 సార్లు, అపసవ్యదిశలో (anticlock-wise లో) ఓ 20 సార్లు తిప్పుకోండేం.

పదోతరగతి, మాకది అల్లరి గది, మా అల్లరి దెబ్బకి మా మాష్టార్ల బతుకు అధోగతి, ఇప్పటివరకు మాదెబ్బకి వారి జీవితంలో లేదు పెద్ద పురోగతి. ఇది మా అల్లరి కథ సంక్షిప్తంగా చెప్పాల్సి వస్తే. మా బాచ్లో మొత్తం ఏడుగురు ఉండేవాళ్ళం. రామాయణంలో హనుమంతుడొక్కడే కిష్కింధకాండ జరిపితే అశోకవనం అంత నాశనం అయితే, ఈ కలియుగంలో మొత్తం ఏడుగురు ఆడహనుమతులం కిష్కింధకాండ జరిపితే, మా బడి అనే అశోకవనం ఇంకెంత నాశనం అయ్యుంటుందో మీరూహించగలరా?

మా బాచ్లో కల్పన అనే అమ్మాయుండేది, బాగా చదివేది, అలానే బావుండేది కూడా (ఇది నిజం). తనవెంట ఒకబ్బాయి పడేవాడు. ఓ రోజు స్కూలు వదిలిన తర్వాత అందరం కలిసి ఇంటికి బయలు దేరాం, అప్పుడే కొత్త మోడల్స్ BSA సైకిళ్ళు రిలీజు అయ్యాయి. ఆ అబ్బాయేమో తన కొత్త సైకిలు పట్టుకొని మా దృష్టిని ఆకర్షించేదానికి మా ముందర అటు ఒక రౌండు, ఇటొక రౌండు తెగ కొడుతున్నాడు. చూసి చూసి ఇక భరించలేక మా కల్పన, "ఇక చాలురా, పడతావ్" అంది. అంటే వెంటనే ప్రపంచ శాంతి దినోత్సవం రోజు సీమ బాంబు పేలితే ఎంత ఎఫ్ఫెక్టు వస్తుందో అంత సౌండు. ఏమయిందా అని అందరం అటు వెళ్లి చూసాం. అక్కడ కొత్త సైకిలేమో ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయేమో బురదగుంటలో. ఒక్క క్షణం అర్ధం కాలేదు, అర్ధం అయ్యాక అందరం ఒకటే నవ్వు. అంతే ఆ అబ్బాయి మళ్లీ మా కల్పన వెనుక కనిపించలేదు. అలా కనిపించని దానికి ఇప్పటికీ బాధపడుతుంటాం, ఒక మంచి బాడిగార్డుని మిస్ అయ్యామేమో అని. ఇలా చిన్ని చిన్ని అల్లర్ల మధ్య (చాలానే ఉన్నాయి కాని, స్థలాభావం వల్ల రాయలేక పోతున్నా) మా పదోతరగతి హాయిగా గడిచిపోయింది.

తర్వాత మేమంతా ఇంటర్మీడియట్ ఒకే కాలేజీలో చేరాం, ఇంటర్మీడియట్ కాస్త గర్ల్స్ కాలేజి అవడం వల్ల మా అల్లరి, ఆ రెండేళ్ళ మాజీవితం ఉప్పులేని పప్పులా చాలా సప్పగా సాగిపోయింది. ఇంటర్వెల్ లో రేగిపండ్లు తిని మిగిలిన గింజలు (మా కాలేజి కాస్త మెయిన్ రోడ్డు మీద ఉండేది లెండి) దారిన వెళ్ళే అబ్బాయిల మీద వెయ్యడం, వాళ్ళకి ఎవరు వేసారో అర్ధం కాక అమోమయం గా చూసుకొంటూ ఉంటే నవ్వుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళం. అయితే ఒకసారి ఎవరో వచ్చి మా ప్రిన్సిపాల్ కి ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చారు. అంతే ఆవిడకి ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్ధం అయ్యి వెంటనే మా బాచ్ ని పిలిచి క్లాసు తీసుకొన్నారు. మేము రెండురోజులు ఏమీ అల్లరి చెయ్యకుండా కామ్ గా ఉండిపోయాం, కానీ కుక్కతోక వంకర కదా? ఇలాంటి అల్లరి మధ్య మా జీవితాన్ని నిర్దేశించే పరీక్షలు వచ్చాయి. అబ్బో అందరం మా ఇంట్లోనో, వేరే వాళ్ళ ఇంట్లోనో కూర్చొని combined study మొదలు పెట్టాం. మమ్మల్ని అలా చుసిన మా అందరి parents, కళ్లు తిరిగి, బిపి తెచ్చుకొని హాస్పిటల్ లో జాయిన్ అయిపోయారు. కానీ మేము మాత్రం, హార్లిక్స్, బూస్టో, కాఫీయో, టీయో తాగి తెగ కబుర్లు చెప్పుకొని, వాగి వాగి అలిసిపోయి, నోరునెప్పి పుట్టి పడుకొనే వాళ్ళం. ఇన్ని combined studies మధ్య మా పరీక్షలు రాసేసాం, అందరం పాస్ అయిపోయాం (ఎలానో మీకు తెలుసు కదా? అదేలెండి తెగ కాపీలు కొట్టి).

ఇలా పాస్ కావడమే మా జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిస్తే అస్సలు పాస్ అయ్యేవాళ్ళమే కాదు. మా సంగతి తెలిసిన మా parents అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన మా అంకుల్ వాళ్ల కాలేజీలో పడేసారు. అక్కడి నుంచి మొదలయ్యాయి మా జీవితానికి ఫులుస్టాప్ లేని కండిషన్లు, కష్టాలు. management కి తెలిసిన వాళ్ళమని లెక్చరర్లందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా గమనించే వాళ్లు. ఏ చిన్న అల్లరి పని చేసినా ఇంటికి వెంటనే తెలిసిపోయేది. అంతే ఇంట్లో పెద్ద సీనే జరిగేది. మా అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకొని, (అదేమిటో background లో "టుటు తుయ్య్ తుయ్యమ్" అంటూ మ్యూజిక్ automatic గా వినిపించేది నాకు) "నీ చదువు కోసం నాన్న గారు ఎంత కష్టపడుతున్నారో చూడు, నువ్విలా అల్లరి పనులు చేసి ఆయన పరువు తీస్తే ఎలా చెప్పు?" అని కొద్దిగా కరుణరసాన్ని పలికించేది. అంతే మనం ఢామ్మని పడిపోయే వాళ్ళం, "ఇక అల్లరి చేయనమ్మా, బాగా చడువుకొంటా" అని చెప్పి చదవాలని వెంటనే పుస్తకాలు తీసేదాన్ని. కానీ ఆ పుస్తకాల మీదున్న బూజుదుమ్ముల దెబ్బకి మనకు ఆగకుండా తుమ్ములు మొదలయ్యేవి. వెంటనే మా నానమ్మ, మా అమ్మని పట్టుకొని "ఎందుకే అమ్మాయ్, చిన్న పిల్లని అలా కష్టపెడుతావ్" అని నాకు సపోర్ట్ వచ్చేది. అంతే మనకు జ్ఞానోదయం అయ్యి మళ్లీ ఏ కోతిపని చెయ్యాలా అని ఆలోచించడం మొదలు పెట్టేదాన్ని. ఆలోచన రావడం ఆలస్యం మా గుంపులో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చించి అమలుజేసేసేవాళ్ళం.

ఇలా జీవితం మూడు అల్లరి ఆలోచనలు, ఆరు కోతిపనులతో హాపీగా గడిచిపోతూ ఉండగా, ఒకరోజు, మాకు maths slip test పెట్టారు. అమ్మో అవి లెక్కలా? కానే కావు, నా జీవితంలో చిక్కులు, నా బ్రతుకులో తొక్కలు, నా కర్ధంకాని ముక్కలు, నా బుర్రలో మొలవని మొక్కలు అని నా మనస్సు ఘోషిస్తుంటే, మా సారు మాత్రం అవును అవే నీ జీవితానికి దిక్కులు అన్నట్టుగా మా వైపు చూస్తూవున్నారు. ఎలాగోలా అందరం కలిసి కాపీ కొట్టిరాసాం (మనలో మనమాట, అందరూ నా పేపర్లోనే చూసి రాశారు, మీ మీద ఒట్టు, ఇది నిజం). తరువాతి రోజు మాసారు వచ్చి అందరినీ దగ్గరికి పిలిచి correction చేసిన పేపర్లు ఇస్తున్నారు. మా బాచ్లో వాళ్ళందరికీ మంచి మార్క్స్ వస్తున్నాయి. అది చూసి మనం అహో భళా బాలా, లెక్కలంటే లేదు నీకు చిక్కు. ఇక అందరికి నీవే దిక్కు అని మనస్సు ఆనందంతో నాట్యం చేస్తుండగా నా పేరుని పిలిచారు. అయ్ అని ఎగురుకొంటూ వెళ్ళాను కదా, నాకేమో 40% కూడా రాలేదు, ఇలా కాదు అమ్మాయ్, నువ్వు ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి, ఇదిగో ఇక్కడ ఈ equation లో తప్పు చేసావ్, అని నే చేసిన తప్పులు చెబుతూ ఉంటే, నాకు కోపం వచ్చేసి "ఏంటి సార్ మీరు, నా దాంట్లో కాపీ కొట్టిన వాళ్ళకి మంచి మార్క్స్ వేస్తారు, నాకు మాత్రం వెయ్యరు. పైగా ఇదిగో ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పుంది అని చెబుతారా?" అని ఒసేయ్ రాములమ్మ టైపులో రెచ్చిపోయి ఇక "సార్ల దుర్మార్గాలు నశించాలి. మా పేపర్లు మేమే రుద్దుకొనే హక్కును మాకు కల్పించాలి. కాపీ కొట్టుకొనే హక్కును 33% రిజర్వేషన్ లో ప్రవేశపెట్టాలి. పుస్తకాలు చూసి రాసుకొనే హక్కును చట్టబద్దం చెయ్యాలి" అని డిమాండ్లనంతా వినిపించాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఆవేశంలో మా కాపీల బ్రహ్మ రహస్యాన్ని బయట పెట్టానన్న సంగతి మర్చిపోయాను. అంతే తర్వాత మా వాళ్ళందరి చేతిలో నాకు బడితపూజ జరిగిందనుకోండి అది వేరే విషయం.

ఇలా అల్లరి చేస్తూ, చేయిస్తూ హాయిగా ఉండగా, ఒకరోజు మా బాచ్ లో ఒకరికి love letter వచ్చింది. దాన్ని లవ్ లెటర్ అనవచ్చొని, లవ్ లెటర్ ని అలా కూడా రాస్తారని మాకెవ్వరికి తెలీదు. మొదలు ఎలా పెట్టాడంటే, "నేను పదో తరగతి రెండు సార్లు తప్పాను. ఎలాగోలా డిగ్రీకి వచ్చాను. నీకు, నాకు హైటులో తేడా ఒక అడుగు, నువ్వు నేను కుర్చోనే బెంచికి మధ్య తేడా ఒక అడుగు, నీకు నాకు మధ్య చదువులో తేడా ఒక అడుగు, మొదటి రోజు నిన్నుచూసినప్పుడు నీకు నాకు మధ్య దూరం ఒక అడుగు. నువ్వంటే నాకెంత ఇష్టమో నన్నడుగు." ఇలా అంతా అడుగులతో నింపేశాడు. దాన్ని అందరం కలిసి చదివి తెగ నవ్వుకొన్నాం. ఆ అమ్మాయిని తెగ ఏడిపించాం, లెటర్ రాసిన అతన్ని బెదిరించాం. కానీ అతను కొన్ని రోజులకే ఒక ట్రైన్ ఆక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటన గుర్తుకు వస్తే మనస్సు కొద్దిగా బాధతో నిండిపోతుంది. ఇలా జీవితంలో బోలెడన్ని హాపీడేస్ , జాలీడేస్ కొన్ని ఏడిపించిన డేస్.
(ఇవన్ని ఎవరికీ చెప్పకండేం. వీటిని ఇక్కడే చదివి, వీటిని ఇక్కడే వదిలి వెళ్ళిపొండి. పొరపాటున మా అమ్మకి కానీ, నాన్నకి కానీ తెలిసిందా నా బతుకు గోవిందా.)