(అస్సలు నా స్మృతిపదంలో మెదులుతున్న తేటతెలుగు అనుభవాలని మీతో పంచుకోవాలని ఉన్నా, నాకు మాత్రం ఇది రాసేలా ప్రోత్సాహాన్నిచ్చింది మాత్రం, భుజాన బండెడు పుస్తకాలు మోస్తూ, వాటిని మొయ్యటం కోసం బూస్టు, హార్లిక్సు తాగి, స్కూల్ కి బస్సులో వెడుతూ, ఏదో బందిఖానాలోకి వెళుతున్నట్టూ, దారిన పోయేవారిని అమాయకంగా చూసే పసిపిల్లలు. వారిని చూస్తే నిజంగా జాలి వేస్తుంది. తల్లిదండ్రులు వారి వారి కలలని తమ ఉహాలోకంలోకి బలవంతంగా చొప్పిస్తే వాటిని తీర్చడంకోసం తమ బాల్యాన్ని పణంగా పెడుతున్న వారిని చూస్తే జాలికాక మరేం వస్తుంది? నిజంగా ఎంత ఆనందమైన బాల్యాన్ని వారు కోల్పోతున్నారో అని ఓ నిట్టూర్పు విడిచి నేను మళ్ళీ నా పనుల్లో పడిపోయినా అప్పుడప్పుడు ఆ బాధ మనస్సులో తొలుస్తూనే ఉంటుంది అందుకే ఇది తెలుగుదనం మీద రాసినా కాని అంతర్లీనంగా నా బాల్యం కనిపిస్తుంది. ఇక చదవండి మరి.)
=====================================================================================
తెలుగుదనం,
అస్సలు ఈ పదం, కాదు కాదు, తెలుగు అన్న పదం వినిపిస్తేనే కనులలో ఎంత వెలుగొస్తుందో? మదిలో ఎంత జిలుగు వస్తుందో? ఉహల్లో ఎన్ని ఉసులోస్తాయో? మీకెవ్వరికన్నా ఇలానే అనిపిస్తుందా? అలా అనిపిస్తే ఆ గొప్పదనం మనది కాదు, ఈ పదానిది. తనలో పట్టుపరికిణి అంత అందాన్ని, పల్లె మనస్సులంత అమాయకత్వాన్ని, వాలుకనుల సోయగాత్వాన్ని దాచుకున్న ఈ పదం గొప్పదనమే అంత. దీని గురించి చెప్పడం, రాయడంతో బాటు వర్ణించడం అంటే అరిటాకులో, వేడి వేడి అన్నం, కొద్దిగా నెయ్యి కాసింత ఆవకాయ వేసుకొని ఎక్కడన్నా పచ్చని పైరులో, జలపాతంలా నీటిని వదిలే మోటరు పంపుసెట్ల మధ్యన వనభోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న మాట.
నా చిన్నప్పుడు మా కుటుంబం అంతా మా అమ్మమ్మ గారి ఉరిలో ఉండేది. అక్కడ మాదంతా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. ఎంత పెద్దది అంటే కృష్ణవంశీ సినిమాల్లో ఉంటుందే అంత పెద్ద కుటుంబం అన్న మాట. పెదనాన్న వాళ్ళ కుటుంబం, బాబాయి వాళ్ళ కుటుంబాలు, మామయ్యలు-అత్తమ్మలు, అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతయ్య ఇలా అందరం కలిసి ఒకే లోగిలిలో ఉండేవాళ్ళం. అందరితోపాటు వాళ్ళ పిల్లలు కూడా కలిసి మెలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న "కలిసి ఉంటే కలదు సుఖం" అన్న మాటకి అర్ధం అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు ఆరోజుల్ని తలుచుకొంటే అర్ధమవుతుంది.
మా ఇంటిముందర ఎదురుగా ఒక కొండ, దాని మీద మా ముత్తాతల, ముత్తాతల, ముత్తాతల, (and so on, నిజంగా ఎప్పటిదో నాకు తెలీదు) ముత్తాతలు నిర్మించిన రామాలయం ఒకటి ఉంది. దానికి దాదాపు నూరేళ్ళ చరిత్ర ఉండేది. రావణసంహారం అనంతరం రాముడి ఆగమన వార్తను మోసుకెళ్ళిన హనుమంతుడు, దారిలో ఎక్కడో కొంతమంది సన్యాసులు రామభజన చేస్తుంటే విని అక్కడ ఆగి కాస్సేపు వారితో జేరి రామభజన చేసి తర్వాత అయోధ్యకు బయలు దేరి వెళ్ళిపోయాడంట. ఆంజనేయుడు దిగిన స్థలంలోనే ప్రస్తుతం నేను చెప్పిన రామాలయం వెలిసిఉంది. ఆలయం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే అది ఆలయం అవుతుందో ఈ ఆలయాన్ని చూసి తెలుసుకోవలసిందే. చుట్టూ ప్రహరీ, మధ్యలో కోనేరు, నేను రాముడి దాసుణ్ణి అని సగర్వంగా తల ఎత్తి నిలబడి ఉన్నట్లుందే ఎత్తైన ధ్వజ స్తంభం, 108 మెట్ల కాలిబాట ఇలా ఆ ఆలయం శోభిల్లుతూ ఉండేది. కోనేటిలోని నీరు మా (పసిపిల్లల) నవ్వులంత స్వచ్ఛంగా, తియ్యగా వుండేవి.
ఉదయాన్నే మేడ మీది గదిలో నిదురించే మా మొహాలపై పడే నీరెండ చురుక్కుతో, అప్పుడే వినిపిస్తున్న పక్షుల కిలకిలరావాలతో, అలా గాలిలో తేలుతూ, M.S. సుబ్బలక్ష్మి గారి శ్రావ్యమైన కంఠం నుంచి జాలువారిన "కౌసల్యా సుప్రజా రామా.." సుప్రభాతపు మహత్తుతో ఆవులించుకొంటూ లేచే నాకు, ఆలయం పక్కనుంచి అప్పుడే ఉదయిస్తున్న భానున్ని చూడటం ఎంతో హాయిగా ఉండేది. అప్పుడే పూజ అయిపోతుందేమో వెనువెంటనే గుడిగంటల ధ్వని నా చెవుల చేరేది. వెనువెంటనే మేడ పైనుంచి దిగే నాకు మా లోగిళ్ళలో పరచిన అందమైన రంగవల్లులు, వాటి మధ్యలో కొలువు దీరిన గొబ్బెమ్మలు కనిపించేవి. అప్పటికే లేచి, తల స్నానాలు చేసేసి, కొప్పున తువాళ్ళు చుట్టుకొని, నొసటున కుంకుమ ధరించి, నుదుటి మీద పడే ముంగురులను మణికట్టుతో పైకి దోసుకుంటూ, పాదాలపై కూర్చొని ముగ్గులు తీర్చే అందరూ కనిపించేవారు. అలానే మెట్ల మీద కూర్చొని నాగార్జునసాగర్ వద్ద వొంపులు తిరిగిన కృష్ణవేణమ్మలా అలా అలా చేతిని మెలికలు తిప్పుతూ, అక్కడక్కడ విను వీధిలో మెరిసిన తారకల్లా కనిపించే చుక్కలని కలుపుతూ వారు గీసే ముగ్గులని చూడటం ఎంతో బావుండేది. "ఏంటే అమ్మాయ్? అలా కూర్చొని ఉండటమేనా? ఈ సంవత్సరమన్నా ముగ్గులు గీయడం నేర్చుకుంటావా? లేక మళ్ళీ నాకు రాదు అని చెతులెత్తేస్తావా?" అంటూ ఆట పట్టించే మామయ్య గొంతుతో ఈ లోకంలోకి వచ్చే నాకు, అక్కడి అందరి నవ్వులు బాగా ఉక్రోషం తెప్పించేవి. నా ఉక్రోషం చూసి అందరూ నవ్వుకోనేవారు. ఆ నవ్వులకి మనం ఇంకా బాగా ఉడుక్కొనేవాళ్ళం.
ఇలా అందరం ఈ సందడిలో ఉండగా, వీధిలో హరిదాసు కీర్తన వినిపించేది. అంటే చటుక్కున వంటింట్లో దూరి, నా చిట్టి చేతుల్లో పట్టి నన్ని బియ్యం తీసుకొని వీధిలోకి వెళ్లి ఆయనకోసం ఎదురుచూసే దాన్ని. ఆయన రాగానే బియ్యం వేద్దామని మనం ఎంత ప్రయత్నించినా నాకేమో ఆయన తలమీద ఉన్న గిన్నె అందేది కాదు. నేను నాప్రయత్నంలో ఉండగానే, మా నాన్నగారు వచ్చి నన్ను ఎత్తుకొని ఆ బియ్యం వేసేలా సహకరించేవారు. ఇంతలొ మా నానమ్మ కూడా వచ్చి చేటలో తెచ్చిన బియ్యం హరిదాసు గారికి సమర్పించేది. ఆయనలా వీధి చివర కనుమరుగయ్యేంతవరకు చూసి ఇంట్లోకి వెళ్ళి దంతవధాన, స్నానాది కార్యక్రమాలను ముగించుకొని వచ్చేదాన్ని. స్నానం చేసి గదిలోకి రాగానే అమ్మ నాకోసం తీసి పెట్టిన పావడా,జాకెట్టు వేసుకొని తడికురులను ఆరబెట్టుకోవడం కోసం వసారాలోకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ వసారాలో మా తాతయ్య చదివే భాగవతంలోని "ఎవ్వనిచే జనించు.." వింటూ, సూర్యునికి ఎదురుగా నిలబడి కురులని ఆరబెట్టుకొంటుంటే ఏదో తెలియని హాయిగా ఉండేది. ఇంతలొ నేనున్నానంటూ కమ్మని గారెల వాసన నా నాసికకు తగిలేది, అంతే మనం రయ్యిన వంటింట్లోకి దూరి "తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలని" మా మాస్టారు చెప్పారు, కాబట్టి ముందర నాకు గారెలు పెట్టండి తర్వాత భారతం వింటాలే అని చెప్పి ప్లేట్ పట్టుకొని నిలబడే దాన్ని. అందరు ముసి ముసి నవ్వులు నవ్వుతూ నా ప్లేటులో గారెలు వడ్డించేవారు, మనం తినిపెట్టేవాళ్ళం.
ఈ కార్యక్రమం ముగియగానే, అందరితో కలిసి గెంతులు (ఔట్ డోర్ గేమ్స్) అదేనండి ఆడుకోవడానికి తుర్రుమనే వాళ్ళం. అక్కడ కోతి బాచ్ మా కోసం రెడీ గా ఉండేది. అందరం కలిసి తొక్కుడుబిళ్ళ, కోతి-కొమ్మచ్చి, అష్టాచెమ్మ, దొంగ-పోలీస్ ఇత్యాది ఆటలన్నీ ఆడుకోనేవాళ్ళం. మేమిలా ఆటల సందడిలో ఉండగా, "డు-డు బసవన్న, అయ్యగారికి దండం పెట్టు, అమ్మ గారికి దండం పెట్టు" అంటూ బసవన్న మేళం వినిపించేది. అంతే అందరం అటుపరిగెత్తి బసవన్న చేసే విన్యాసాలని అబ్బురంగా చూసే వాళ్ళం. బసవన్న అలా వెళ్ళగానే కొండదొరలు, సోది చెప్పేవాళ్ళు వచ్చేవారు. వారి చేత సోది చెప్పించుకోవడం ఒక మరపురాని అనుభూతి. నేనా అనుభూతిలో కనులు మూసుకొని ఉండగానే "బుస్స్ బుస్" మని ఏదో శబ్దం వినిపించేది. ఏమిటా అని చూద్దును కదా నాగుపాము. వళ్ళంతా కాస్సేపు జలదరించినా, అది తన పడగ విప్పి నాట్యంతో మమ్మలందరిని మైమరపించేది. మేమా మైమరుపులో ఉండగానే జంగం దేవరలు వచ్చేవాళ్ళు. వాళ్ళ కనికట్టుతో, మాటల గారడీలతో, హస్తలాఘవంతో మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేసేవాళ్ళు. ఇంతలో నకనకలాడుతూ ఆకలి మొదలయ్యేది. మొత్తం కుంటుంబంలోని మగవాళ్ళు, పిల్లా, జెల్లా, ముసలీముతకా అందరం ఒకేసారి భోజనానికి కూర్చొనే వాళ్ళం. నానమ్మ-అమ్మమ్మ ఆధ్వర్యంలో పెదమ్మ, అమ్మా, పిన్ని, అత్తయ్యలు అందరూ వడ్డిస్తుండగా అరటి ఆకుల్లో కొంచెం వేడి వేడి అన్నం, దానిలోకి మరగ కాచిన నెయ్యి, ముద్దపప్పు, కొద్దిగా ఆవకాయతో కడుపారా తిని బ్రేవ్ మని తెన్చేవాళ్ళం. ఆ భోజనం గుర్తొస్తే ఇప్పటికీ నోటిలో నీళ్ళూరుతాయి.
ఇలా భోజనం చెయ్యగానే వెనువెంటనే నిద్ర వచ్చేసేది. హాయిగా అమ్మమ్మ పక్కన పడుకొని కథలు చెప్పించుకొంటు నిద్రలోకి జారుకొనేదాన్ని. మెలుకువ వచ్చేసరికి సాయంత్రం అవుతూఉండేది. వెంటనే లేచి మళ్ళీ ఆటలు మొదలు పెట్టేవాళ్ళం. అలా ఆది ఆది అలసి సొలసి ఇంటికి చేరేవాళ్ళం. ఇంటికి చేరగానే మరలా స్నానం ముగించుకొని మొత్తం కుటుంబం అంతా ఒక దగ్గరికి చేరేవాళ్ళం. అందరూ పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకొంటూ ఉంటే, ఆడవారంతా ప్రమదావనంలో విహరిస్తూ ఉండగా, మేమంతా అదే చిన్న పిల్లలమండీ, అచ్చంగాయ, పులి-మేక వగైరా ఇండోర్ గేమ్స్ ఆడుకొనేవాళ్ళం. అటు తిరిగి ఇటు తిరిగి చూస్తే మరల భోజనాల వేళ అయ్యేది. భోజనం కానించి, మమ్మలందరిని ఒక చోట కూర్చోబెట్టి మా తాతయ్య ఆరోజు ఎందుకలా ఆనందంగా గడిపామో దాని గురించి వివరించేవారు. ఆరోజు గురించి మీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదనుకొంటాను. ఎందుకంటే అది మన తెలుగువారి అచ్ఛమైన, స్వచ్ఛమైన అచ్ఛతెనుగు పండగ, పెద్దపండగ అదేనండి మన సంక్రాంతి.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నిజమే, తెలుగు పేరు వింటేనే చాలు మది పులకరిస్తుంది. ఎదన తొలకరి కురుస్తుంది.
నువ్వు చిన్నప్పుడు తెలుగుదనాన్ని బానే ఎంజాయ్ చేసవన్న మాట. నేనుకూడా బానే చేశాను కాని, మరీ ఇంతలా మాత్రం కాదు.
అవును పసిపిల్లల విషయంలో నేను కూడా నీతొ ఏకీభవిస్తున్నాను. పాపం వాళ్ళని చూస్తే చాలు పసిపిల్లలు అనిపించడం లేదు పనిపిల్లలు అని పిస్తున్నారు. ఇక మహానగరాల్లోని స్కూళ్ళలో అయితే ఇక చెప్పనక్కర లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకొందన్నట్లు ఇవ్వాళ బస్సు సౌకర్యం లేని చిన్న చిన్న పల్లెటూర్లలో సైతం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వెలుస్తున్నాయి. మార్పుని స్వాగతించాలో, లేదా ఆ మార్పు చాటున మనం కొదికొద్దిగా కోల్పోతున్న మన తెలుగుదనాన్ని చూసి ఏడవాలో తెలియని పరిస్థితి.
Post a Comment