Tuesday, August 5, 2008

అమ్మో అల్లరా?

అమ్మో అల్లరా..
ఈ మాట వింటే మా అమ్మ చీపురు తిరగేస్తుంది. అయినా నేను, మా అక్కా, మా స్నేహితులు తెగ అల్లరి చేసే వాళ్ళం. గోడలెక్కడం, తోటల్లోకి దూరడం, సైకిల్లెక్కి ఉరంతా బలాదూరు తిరగడం అబ్బో చెప్పలేనన్ని అల్లరి పనులు, చెప్పలేనంత అల్లరి. ఈ మా అల్లరి దెబ్బకి "అల్లరి" మా ఇంటిపేరు, బాచ్ పేరు అయిపొయింది. కానీ నే చేసిన అల్లరి గురించి చెప్పాలంటే నేను పదోతరగతి చదువుతున్న రోజుల్లోకి వెళ్ళాలి మరి, వస్తారా రండి సరదాగా అలా నేను పదోతరగతి చదువుతున్న రోజుల్లోకి వెళ్దాం. మీ మొహం ముందర చూపుడు వేలు పెట్టుకొని రయ్యి, రయ్యి మని సవ్యదిశలో (అదే నండి clock-wise లో) ఓ 10 సార్లు, అపసవ్యదిశలో (anticlock-wise లో) ఓ 20 సార్లు తిప్పుకోండేం.

పదోతరగతి, మాకది అల్లరి గది, మా అల్లరి దెబ్బకి మా మాష్టార్ల బతుకు అధోగతి, ఇప్పటివరకు మాదెబ్బకి వారి జీవితంలో లేదు పెద్ద పురోగతి. ఇది మా అల్లరి కథ సంక్షిప్తంగా చెప్పాల్సి వస్తే. మా బాచ్లో మొత్తం ఏడుగురు ఉండేవాళ్ళం. రామాయణంలో హనుమంతుడొక్కడే కిష్కింధకాండ జరిపితే అశోకవనం అంత నాశనం అయితే, ఈ కలియుగంలో మొత్తం ఏడుగురు ఆడహనుమతులం కిష్కింధకాండ జరిపితే, మా బడి అనే అశోకవనం ఇంకెంత నాశనం అయ్యుంటుందో మీరూహించగలరా?

మా బాచ్లో కల్పన అనే అమ్మాయుండేది, బాగా చదివేది, అలానే బావుండేది కూడా (ఇది నిజం). తనవెంట ఒకబ్బాయి పడేవాడు. ఓ రోజు స్కూలు వదిలిన తర్వాత అందరం కలిసి ఇంటికి బయలు దేరాం, అప్పుడే కొత్త మోడల్స్ BSA సైకిళ్ళు రిలీజు అయ్యాయి. ఆ అబ్బాయేమో తన కొత్త సైకిలు పట్టుకొని మా దృష్టిని ఆకర్షించేదానికి మా ముందర అటు ఒక రౌండు, ఇటొక రౌండు తెగ కొడుతున్నాడు. చూసి చూసి ఇక భరించలేక మా కల్పన, "ఇక చాలురా, పడతావ్" అంది. అంటే వెంటనే ప్రపంచ శాంతి దినోత్సవం రోజు సీమ బాంబు పేలితే ఎంత ఎఫ్ఫెక్టు వస్తుందో అంత సౌండు. ఏమయిందా అని అందరం అటు వెళ్లి చూసాం. అక్కడ కొత్త సైకిలేమో ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయేమో బురదగుంటలో. ఒక్క క్షణం అర్ధం కాలేదు, అర్ధం అయ్యాక అందరం ఒకటే నవ్వు. అంతే ఆ అబ్బాయి మళ్లీ మా కల్పన వెనుక కనిపించలేదు. అలా కనిపించని దానికి ఇప్పటికీ బాధపడుతుంటాం, ఒక మంచి బాడిగార్డుని మిస్ అయ్యామేమో అని. ఇలా చిన్ని చిన్ని అల్లర్ల మధ్య (చాలానే ఉన్నాయి కాని, స్థలాభావం వల్ల రాయలేక పోతున్నా) మా పదోతరగతి హాయిగా గడిచిపోయింది.

తర్వాత మేమంతా ఇంటర్మీడియట్ ఒకే కాలేజీలో చేరాం, ఇంటర్మీడియట్ కాస్త గర్ల్స్ కాలేజి అవడం వల్ల మా అల్లరి, ఆ రెండేళ్ళ మాజీవితం ఉప్పులేని పప్పులా చాలా సప్పగా సాగిపోయింది. ఇంటర్వెల్ లో రేగిపండ్లు తిని మిగిలిన గింజలు (మా కాలేజి కాస్త మెయిన్ రోడ్డు మీద ఉండేది లెండి) దారిన వెళ్ళే అబ్బాయిల మీద వెయ్యడం, వాళ్ళకి ఎవరు వేసారో అర్ధం కాక అమోమయం గా చూసుకొంటూ ఉంటే నవ్వుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళం. అయితే ఒకసారి ఎవరో వచ్చి మా ప్రిన్సిపాల్ కి ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చారు. అంతే ఆవిడకి ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్ధం అయ్యి వెంటనే మా బాచ్ ని పిలిచి క్లాసు తీసుకొన్నారు. మేము రెండురోజులు ఏమీ అల్లరి చెయ్యకుండా కామ్ గా ఉండిపోయాం, కానీ కుక్కతోక వంకర కదా? ఇలాంటి అల్లరి మధ్య మా జీవితాన్ని నిర్దేశించే పరీక్షలు వచ్చాయి. అబ్బో అందరం మా ఇంట్లోనో, వేరే వాళ్ళ ఇంట్లోనో కూర్చొని combined study మొదలు పెట్టాం. మమ్మల్ని అలా చుసిన మా అందరి parents, కళ్లు తిరిగి, బిపి తెచ్చుకొని హాస్పిటల్ లో జాయిన్ అయిపోయారు. కానీ మేము మాత్రం, హార్లిక్స్, బూస్టో, కాఫీయో, టీయో తాగి తెగ కబుర్లు చెప్పుకొని, వాగి వాగి అలిసిపోయి, నోరునెప్పి పుట్టి పడుకొనే వాళ్ళం. ఇన్ని combined studies మధ్య మా పరీక్షలు రాసేసాం, అందరం పాస్ అయిపోయాం (ఎలానో మీకు తెలుసు కదా? అదేలెండి తెగ కాపీలు కొట్టి).

ఇలా పాస్ కావడమే మా జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిస్తే అస్సలు పాస్ అయ్యేవాళ్ళమే కాదు. మా సంగతి తెలిసిన మా parents అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన మా అంకుల్ వాళ్ల కాలేజీలో పడేసారు. అక్కడి నుంచి మొదలయ్యాయి మా జీవితానికి ఫులుస్టాప్ లేని కండిషన్లు, కష్టాలు. management కి తెలిసిన వాళ్ళమని లెక్చరర్లందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా గమనించే వాళ్లు. ఏ చిన్న అల్లరి పని చేసినా ఇంటికి వెంటనే తెలిసిపోయేది. అంతే ఇంట్లో పెద్ద సీనే జరిగేది. మా అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకొని, (అదేమిటో background లో "టుటు తుయ్య్ తుయ్యమ్" అంటూ మ్యూజిక్ automatic గా వినిపించేది నాకు) "నీ చదువు కోసం నాన్న గారు ఎంత కష్టపడుతున్నారో చూడు, నువ్విలా అల్లరి పనులు చేసి ఆయన పరువు తీస్తే ఎలా చెప్పు?" అని కొద్దిగా కరుణరసాన్ని పలికించేది. అంతే మనం ఢామ్మని పడిపోయే వాళ్ళం, "ఇక అల్లరి చేయనమ్మా, బాగా చడువుకొంటా" అని చెప్పి చదవాలని వెంటనే పుస్తకాలు తీసేదాన్ని. కానీ ఆ పుస్తకాల మీదున్న బూజుదుమ్ముల దెబ్బకి మనకు ఆగకుండా తుమ్ములు మొదలయ్యేవి. వెంటనే మా నానమ్మ, మా అమ్మని పట్టుకొని "ఎందుకే అమ్మాయ్, చిన్న పిల్లని అలా కష్టపెడుతావ్" అని నాకు సపోర్ట్ వచ్చేది. అంతే మనకు జ్ఞానోదయం అయ్యి మళ్లీ ఏ కోతిపని చెయ్యాలా అని ఆలోచించడం మొదలు పెట్టేదాన్ని. ఆలోచన రావడం ఆలస్యం మా గుంపులో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చించి అమలుజేసేసేవాళ్ళం.

ఇలా జీవితం మూడు అల్లరి ఆలోచనలు, ఆరు కోతిపనులతో హాపీగా గడిచిపోతూ ఉండగా, ఒకరోజు, మాకు maths slip test పెట్టారు. అమ్మో అవి లెక్కలా? కానే కావు, నా జీవితంలో చిక్కులు, నా బ్రతుకులో తొక్కలు, నా కర్ధంకాని ముక్కలు, నా బుర్రలో మొలవని మొక్కలు అని నా మనస్సు ఘోషిస్తుంటే, మా సారు మాత్రం అవును అవే నీ జీవితానికి దిక్కులు అన్నట్టుగా మా వైపు చూస్తూవున్నారు. ఎలాగోలా అందరం కలిసి కాపీ కొట్టిరాసాం (మనలో మనమాట, అందరూ నా పేపర్లోనే చూసి రాశారు, మీ మీద ఒట్టు, ఇది నిజం). తరువాతి రోజు మాసారు వచ్చి అందరినీ దగ్గరికి పిలిచి correction చేసిన పేపర్లు ఇస్తున్నారు. మా బాచ్లో వాళ్ళందరికీ మంచి మార్క్స్ వస్తున్నాయి. అది చూసి మనం అహో భళా బాలా, లెక్కలంటే లేదు నీకు చిక్కు. ఇక అందరికి నీవే దిక్కు అని మనస్సు ఆనందంతో నాట్యం చేస్తుండగా నా పేరుని పిలిచారు. అయ్ అని ఎగురుకొంటూ వెళ్ళాను కదా, నాకేమో 40% కూడా రాలేదు, ఇలా కాదు అమ్మాయ్, నువ్వు ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి, ఇదిగో ఇక్కడ ఈ equation లో తప్పు చేసావ్, అని నే చేసిన తప్పులు చెబుతూ ఉంటే, నాకు కోపం వచ్చేసి "ఏంటి సార్ మీరు, నా దాంట్లో కాపీ కొట్టిన వాళ్ళకి మంచి మార్క్స్ వేస్తారు, నాకు మాత్రం వెయ్యరు. పైగా ఇదిగో ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పుంది అని చెబుతారా?" అని ఒసేయ్ రాములమ్మ టైపులో రెచ్చిపోయి ఇక "సార్ల దుర్మార్గాలు నశించాలి. మా పేపర్లు మేమే రుద్దుకొనే హక్కును మాకు కల్పించాలి. కాపీ కొట్టుకొనే హక్కును 33% రిజర్వేషన్ లో ప్రవేశపెట్టాలి. పుస్తకాలు చూసి రాసుకొనే హక్కును చట్టబద్దం చెయ్యాలి" అని డిమాండ్లనంతా వినిపించాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఆవేశంలో మా కాపీల బ్రహ్మ రహస్యాన్ని బయట పెట్టానన్న సంగతి మర్చిపోయాను. అంతే తర్వాత మా వాళ్ళందరి చేతిలో నాకు బడితపూజ జరిగిందనుకోండి అది వేరే విషయం.

ఇలా అల్లరి చేస్తూ, చేయిస్తూ హాయిగా ఉండగా, ఒకరోజు మా బాచ్ లో ఒకరికి love letter వచ్చింది. దాన్ని లవ్ లెటర్ అనవచ్చొని, లవ్ లెటర్ ని అలా కూడా రాస్తారని మాకెవ్వరికి తెలీదు. మొదలు ఎలా పెట్టాడంటే, "నేను పదో తరగతి రెండు సార్లు తప్పాను. ఎలాగోలా డిగ్రీకి వచ్చాను. నీకు, నాకు హైటులో తేడా ఒక అడుగు, నువ్వు నేను కుర్చోనే బెంచికి మధ్య తేడా ఒక అడుగు, నీకు నాకు మధ్య చదువులో తేడా ఒక అడుగు, మొదటి రోజు నిన్నుచూసినప్పుడు నీకు నాకు మధ్య దూరం ఒక అడుగు. నువ్వంటే నాకెంత ఇష్టమో నన్నడుగు." ఇలా అంతా అడుగులతో నింపేశాడు. దాన్ని అందరం కలిసి చదివి తెగ నవ్వుకొన్నాం. ఆ అమ్మాయిని తెగ ఏడిపించాం, లెటర్ రాసిన అతన్ని బెదిరించాం. కానీ అతను కొన్ని రోజులకే ఒక ట్రైన్ ఆక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటన గుర్తుకు వస్తే మనస్సు కొద్దిగా బాధతో నిండిపోతుంది. ఇలా జీవితంలో బోలెడన్ని హాపీడేస్ , జాలీడేస్ కొన్ని ఏడిపించిన డేస్.
(ఇవన్ని ఎవరికీ చెప్పకండేం. వీటిని ఇక్కడే చదివి, వీటిని ఇక్కడే వదిలి వెళ్ళిపొండి. పొరపాటున మా అమ్మకి కానీ, నాన్నకి కానీ తెలిసిందా నా బతుకు గోవిందా.)

16 comments:

Srividya said...

మీ అడుగు కవిత, లెక్కల చిక్కులు బావున్నాయి.
బాగా రాసారు.

Purnima said...

hahaha.. good one!!

చిలమకూరు విజయమోహన్ said...

అమ్మాయిలు కూడా ఇంత అల్లరి చేస్తారని ఇప్పుడే తెలిసింది.బాల్యాన్ని ఇంత చక్కగా,సరదాగ గడిపినందుకు అభినందనలు.

Kranthi M said...

మనలో మనమాట, అందరూ నా పేపర్లోనే చూసి రాశారు, మీ మీద ఒట్టు, ఇది నిజం nijamga nijamena andi hahahaaaaaaaaaaa just kidding.nicepost

Niranjan Pulipati said...

అమ్మో ఇంత అల్లరా ?

ప్రతాప్ said...

నీ లెక్కల చిక్కులు, వాటితో నువ్వు పడ్డ తిప్పలు తలుచుకొంటేనే నవ్వు వస్తోంది.
అల్లరికి కేరాఫ్ అడ్రెస్ లాగున్నావే నువ్వు? ఉండు మీ మమ్మీ తో చెబుతా. :-)

సుజాత వేల్పూరి said...

విద్యార్థుల కోసం మీరు ప్రతిపాదించిన హక్కులన్నింటినీ నేను అర్జెంటుగా బలపరుస్తున్నాను!

మొత్తానికి అల్లరిలో అమ్మాయిలదే హవా అన్నమాట.

చైతన్య.ఎస్ said...

లెక్కల చిక్కులు బాగున్నాయి. కాపి కొట్టడంలో 33% , చూసి రాసే హక్కు ను చట్ట బద్దం చెయ్యడం బాగుంది. కాని అది ఒక 5 సంవత్సరాలు వెనుకే చెసి వుంటే మాలాంటి వాళ్ళు కుడా ఆనందించి వుండేవారు.

జ్యోతి said...

అదీ అల్లరంటే అలా ఉండాలి? ఈ టాలెంట్ అబ్బాయిలకు అస్సలు లేదు ...

రాధిక said...

నాకూ లెక్కల0టే చాలా భయ0.ఆ లెక్కల్ని స్కిప్ చేయడానికపెవ్వరూ ముట్టుకోని నాలుగేసి పేజీల ప్రశ్నలని చదివి రాసేదాన్ని.మీ అల్లరి మా అల్లరికి చాల దగ్గరగా వు0ది.నన్ను ఒక్కసారిగా తీసుకెళ్ళి నా క్లాసు రూములో పడేసారు.

కల said...

శ్రీవిద్యా, పూర్ణిమా మీ ఇద్దరికీ thanx.

కల said...

విజయమోహన్ గారు,
అస్సలు అమ్మాయిలే ఎక్కువ అల్లరి చేస్తారు. కావాలంటే చూడండి, జ్యోతక్క గారు కూడా చెప్పారు.
అయినా నాకస్సలే బద్ధకం ఎక్కువ, మీరిలాంటి పెద పెద్ద పేర్లు పెట్టుకొంటే టైపు చెయ్యడం కష్టం కదండీ?

కల said...

క్రాంతి గారు, నిజం - it's not a lie, కావాలంటే ఈసారి మీ మీద ఒట్టుపెడుతున్నా.

కల said...

నిరంజన్ గారు, దీనికే ఇంట ఆశ్చర్యపోతే ఎలాగండి, నేనింకా కొన్ని మాత్రమే రాశాను.
ప్రతాప్, ప్లీజ్ అంత పని మాత్రం చెయ్యొద్దు అని బ్రతిమాలుతానను కొన్నావా? చెప్పు నాకేం భయమా? మా అమ్మ సపోర్ట్ లేక పొతే ఆ మాత్రం అల్లరి చెయ్యడం కష్టమే కదా?

కల said...

సుజాత గారు,
మీరిలా సపోర్ట్ చేస్తే ఇక నే రెచ్చిపోనూ, మీరు, నేను కలిసి ఒక పేపర్ పెట్టి ఒక ఉద్యమాన్ని నడుపుదాం, ఎలాను శ్రీవిద్య గారు కూడా ఒక టీవీ చానెల్ పెడుతానంటున్నారు కదా? ఇక మీరు, నేను, మనం కలిస్తే ఇక అంతా ప్రభంజనమే మరి.

కల said...

@చైతన్య గారు ఇవి కూడా 5/6 years వెనుకవే లెండి. కాకపొతే ఈ కుళ్ళు రాజకీయ నాయకుల వల్ల అమల్లోకి రాలేదు.
@జ్యోతక్కా thanx.
@రాధిక గారు మీక్కూడా.