
అవునండి నాకు చిన్నప్పుడో కల ఉండేది, ఎలాగైనా అయ్యేయస్సో, ఐపియస్సో అయి అలా ఠీవిగా నడుచుకొంటూ వచ్చి మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొన్నప్పుడు ఆయన కళ్ళలో కనిపించే మెరుపును చూడాలని మాత్రం కాదండి. ఆయినా ఆశీర్వాదం వంగి తీసుకొనేటప్పుడు కళ్ళలో మెరుపు ఎలా కనిపిస్తుందండీ నా ఖర్మ కాకపొతే. కల్పనా చావ్లా లానో, సునితా విలియమ్స్ లానో అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ పిల్లి నడకలో, బుల్లి నడకలో చెయ్యాలని కూడా కాదు. నా చిన్ని కల, చేపలు పట్టే దానవ్వాలని ఉండేది. అయ్యో అమ్మాయ్ అదేం కల అని బోలెడు ఆశ్చర్యపోకండి. దానికి చాలా కథ ఉంది లెండి.
నాకు చిన్నప్పటి నుంచి చేపలంటే ప్రాణం, తినడం కాదు, అవి అటుఇటు ఈదుతూ ఉంటే వాటిని చూడటం అన్న మాట. అల్లానే మా ఇంటి పక్కన ఒక పెద్ద కొలను ఉండేది, ఎంత పెద్దది అంటే దాంట్లో బోలెడు చేపలు కూడా వుండేవి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాంట్లో చేపలని చూడటం ఒక అలవాటుగా మారిపోయింది, ఎంత పెద్ద అలవాటు ఇందిరమ్మ భజన, దేవుడి పాలన లాగా. ఎలాగైనా సరే చేపల్ని పట్టుకొని ఇంట్లో పెంచుకోవాలనే కల మొదలయ్యింది నాకు. ఇక మనం కొద్దిగా పెద్ద అయి నడవడం మొదలు పెట్టిన తర్వాత నా ఈ ఉత్సాహాన్ని గమనించిన పెద్దలు అటు వెళ్ళకుండా బాగా కట్టడి చేసారు. కానీ మనం ఊరుకుంటామా? ఒక మంచిరోజు చూసుకొని పెద్దల కళ్లు కప్పి కొలనులోకి దూకేసాం, మంచి మంచి చేపలు పట్టుకొని వచ్చి మా అమ్మకి చూపించాలని. కానీ తర్వాత ఏమైందో గుర్తులేదు.
కళ్లు తెరిసే సరికి ఎవరో నా జబ్బ పట్టుకొని ఉన్నారు, ఎదురుగా ఉన్న మా అక్కని "ఈ అమ్మాయి మీ అమ్మాయేనా?" అని అడుగుతున్నారు. అదేమో పెద్ద ఆరిందాలాగా "అబ్బే ఈ పిల్ల ఎవరో బాగా నల్లగా ఉంది. మా పిల్ల భలే తెల్లగా ఉంటుంది" అని చెప్పింది. అసలే చిరాకులో ఉన్న నేను, "యేనే, యేనే" అని ఏడవడం మొదలు పెట్టాను. ఈ కంగారులో మా అమ్మ వచ్చి నన్ను పరీక్షగా చూసి "అవును ఇది మా పిల్లే" అని నన్ను తీసుకెళ్ళి స్నానం చేయించడం మొదలు పెట్టి మెల్లగా అస్సలు విషయం రాబట్టుకొని ఒకటే నవ్వడం మొదలు పెట్టింది. అలా నవ్వడమే కాదు అందరినీ పిలిచి మరి విషయం చెప్పి ఒకటే నవ్వులు. ప్రతిపక్షాలు కూడా ఇంత కుట్ర చేసి ఉండవు, నాకే కానీ నోరు కానీ ఉంటే నువ్వు అమ్మవా, "లెజెండ్రీ"వా అని తిట్టిఉండేదాన్ని. ఇంతకీ అస్సలు సంగతి ఏమిటంటే, నేను కొలను, కొలను అని చిన్నప్పటి నుంచి భ్రమ పడుతున్నది కొలను కాదు పెద్ద మురికిగుంట అని, దానిలో తిరిగేవి చేపపిల్లలు కాదు దోమపిల్లల,కప్పపిల్లల లార్వాలు అని, మా అక్క నలుపు నలుపు అనుకొన్నది నలుపు కాదు అదంతా బురద అని తర్వాత తెలిసింది.

తర్వాత మళ్ళీ కల మారిపోయింది. మనం తీరికగా మొదటిసారి బడిలోకి అడుగెడినప్పుడు మా టీచరమ్మ అలా కుర్చీలో కూర్చొని మన పేరు, ఊరు అన్నీ రాసుకొంటూ ఉంటే మా నాన్న వినయంగా నిలబడి సమాధానం చెబుతుంటే అబ్బో చెప్పొద్దూ నాకు బోలెడు ఆశ్చర్యమేసింది. అంతే వెంటనే డిసైడు అయిపోయాను ఎలాగైనా రేప్పొద్దునే ఆ కుర్చీలో కూర్చోవాలని. అంటే మర్నాడు ఎగాదిగా లగెత్తుకొంటూ వచ్చి ఆ కుర్చీలో కూర్చొన్నా, కాస్సేపటికి మా టీచరు వచ్చి "ఏమే, ఇంత లేవు అప్పుడే నా కుర్చీ కావలసివచ్చిందా నీకు?" అని లాగి పెట్టి ఫటేలుమని ఒక్కటి పీకింది, అంతే ఆ దెబ్బతో మన కళ్లు తెరుచుకొన్నాయి, ఆ కుర్చీలో కుర్చోవాలంటే మనం తొందరగా పెద్దవాళ్ళం అయిపోవాలనీనూ, కళ్ళజోడు పెట్టుకోవాలనీనూ, చేతిలో బెత్తం ఉండాలనీనూ, ఆ బెత్తంతో అందరినీ కొట్టాలనీనూ. ఇంతలో ఏదో పని ఉందని మా టీచరు పక్కకు వెళ్లారు, సరిగ్గా అప్పుడే మన చూపు పక్కన ఉన్నవాడి మీద పడింది. వాడేమో యమా సీరియస్ గా పలక మీద అ, ఆ లు, జలుబు చేసిన ముక్కును తుడుచుకొన్న చేతిని ఎలా గౌను కి రుద్దుకొంటామో అలా అరిగిపోయిన బలపంతో తెగ రుద్దేస్తున్నాడు. అంతే ఫటీల్మని ఒక్కటి పీకాను బెత్తంతో, వెధవ ఒక్క దెబ్బ కూడా ఓర్చుకోలేక ఏడుపు లంకించుకొన్నాడు. ఆ ఏడుపు సునామీ దెబ్బకి అందరు కొట్టుకొచ్చి మా క్లాస్ రూమ్ లో పడ్డారు. ఏమయిందని అడిగితే వాడు నా మీద కంప్లైంట్ చేసాడు. నేనేమో బుద్దిగా, "టీచరు మలేమో, మలేమో వాడు లుద్దటం ఆపేస్తాడేమోనని కొట్టా." అని చెప్పాను, తన్నులు తిన్నాను. ఎలా కొట్టారంటే చిన్న పిల్లనని చూడకుండా అలా కొట్టారు. అప్పుడు మళ్ళా డిసైడు అయిపోయా, ఎలాగైనా తొందరగా పెద్ద టీచరునై మా టీచరుని బాగా బెత్తంతో కొట్టాలని.
కానీ అనుకొన్నవన్నీ జరగవు కదండీ? మళ్ళీ ఇంకో కల మొదలయింది నాకు. ఒక రోజు సాయంకాలం ప్రోద్దుగూంకే వేళ మనం వసారాలో కూర్చొని అరిగిపోయిన బలపాలు తింటూ మధ్య మధ్యలో కొద్దిగా మట్టిని నంజుకొంటూ హాయిగా విశ్రాంతి తీసుకొంటున్నాం. ఇంతలో నా కళ్ళ ముందు ఒక మహోత్తర, మహోన్నత, రసరమ్య సిద్ధిని కలిగించే దృశ్యం ఆవిష్కృతమయింది. మా బామ్మ గేదెను కట్టివేసి, ఆ దాని పోడుగులోంచి పాలు పితుకుతున్న దృశ్యం నాకు కనిపించి నోట మాట రాలేదు. అంత నల్లని గేదే దగ్గరనుంచి అంత తెల్లని పాలు ఎలా వస్తాయో అర్ధం కాక కాలం స్తంభించి పోయింది. అంతే మనం వెంటనే రంగం లోకి దిగాం, "బామ్మ, బామ్మా నేను కూడా పాలు తీస్తాను." అని చిన్నపిల్ల ముద్దుగా అడిగితే ఎవరు మాత్రం కాదంటారు? కాని మా బామ్మ మాత్రం కాదనింది. అంతే ఎలాగైనా నేను పాలు పితకాలని డిసైడు అయిపోయా.

అలా మెల్లగా ఒక రోజు మా బామ్మ పాలు పితికి అలా పక్కకి వెళ్ళగానే, చంద్రబాబు అధికారం కోసం వెయిట్ చేస్తున్నట్లు, ఇందిరమ్మ పటం కోసం రాజశేఖరుడు వెయిట్ చేస్తున్నట్లు, మా బామ్మ పక్కకు ఎప్పుడూ వెళుతుందా అని వెయిట్ చేస్తున్న నేను చటుక్కున ఒక చిన్న గ్లాసు పట్టుకొని ముందుకు ఉరికాను. ఆదరాబాదరాగా దాని పొడుగు మీద చెయ్యి వేసాను. అంతే ఏం జరిగిందో గుర్తులేదు, కళ్ళ ముందు పంచరంగుల నక్షత్రాలు. తెలివి వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉన్నా. చుట్టూరా అందరు, పాపం ఏమైందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చటుక్కున లేచి కూర్చున్నా, అబ్బ నెప్పిగా ఉంది అని చెబుదామనుకొన్నా, కానీ ఎయిర్ పిల్లో లోంచి గాలి పోయినట్లు మాట తుస్సుమని పోయింది. లగెత్తుకొని వెళ్లి అద్దంలో చూసుకొంటే నాగార్జున సాగర్ గేట్లు నీల్లేనప్పుడు ఎత్తేస్తే ఎలా వుంటుందో అలా ఉంది నా మొహం, ముందర రెండుపళ్ళు ఢాం. అంతే మళ్ళీ జన్మలో గేదెపాల జోలికి వెళితే ఒట్టు.
ఇంకా బోలెడు కలలు మిగిలి పోయాయి, తర్వాత తీరికగా ఉన్నప్పుడు రాసి పెడుతాలెండి. అందాకా మీకేవన్నా చిన్నప్పటి కలలు మిగిలి ఉంటే అవి ఇక్కడ పంచుకోండి.