Tuesday, September 30, 2008

ప్రేమ వేరు - పెళ్ళి వేరా?


నేనీమధ్య నా సహాధ్యాయిని అతని భార్యని (తను కూడా నా సహాధ్యాయే) కలవడం జరిగింది. వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి. కులం పేరుతో దూరం చెయ్యబోయిన పెద్దలనెదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు. అమ్మాయిది చాలా మెతక వైఖరి, అతనేమో విజ్ఞానఖని, ఆపదలో ఉన్నవారిని ఎంతకైనా తెగించి ఆదుకొంటాడు, ఎవరన్నా సహాయం అడిగితే లేదు అనకుండా ఇద్దరూ కలిసే చేస్తారు. అందుకే ఆ జంట get-to-gather ఏర్పాటు చేస్తే మా కాలేజి స్నేహితులంతా మిస్ కాకుండా హాజరు వేయించుకొంటాము. అతనితో ఎప్పుడూ వాదన జరపడం నాకొక సరదా. అలాంటి వాళ్ళతో వాదన జరపడం వల్ల నాకు ఎంతో కొంత జ్ఞానం పెరుగుతుందనే స్వార్ధంతో అతనితో వాదన జరుపుతాను.

అందరం భోజనాలు కావించి కబుర్లలో మునిగితేలుతున్నాం. ఇంతలో నాకొక డౌటు వచ్చింది (అదేమిటో బుర్రలో ఎప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి), అదే అతని ముందు వుంచాను, "ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" అని. అందరు తడుముకోకుండా రెండూ దాదాపు ఒకటే, ఒకటి ఇంకో దానిలో అంతర్భాగం (మాకెవ్వరికి అంత జ్ఞాన సంపద లేదులెండి) అన్నారు. ఇంచుమించు నా ఆలోచనా తీరు కూడా ఇదే. కాని అతను మాత్రం "రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు, వివరంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక స్థితి, అలానే పెళ్ళి కూడా ఇంకొక స్థితి. మనిషి ఒక స్టేజి లోంచి ఇంకో స్టేజి లోనికి వెళుతాడు. కాకపొతే ప్రేమ ముందా? పెళ్ళి ముందా? అనేది అతని/ఆమె ఆలోచనలని బట్టి ఉంటుంది" అని అన్నాడు.

నేను ఊరుకుంటానా? "లేదు, రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు అని అంటున్నావు. కాని ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఉంచేది ప్రేమా? లేక పెళ్ళా?" అని (అతి)తెలివిగా ప్రశ్నించాను. దానికి సమాధానం అతను చెప్పేలోపలే, అతని భార్య అందుకొని "కొంచెం నమ్మకం, ఇంకొంచెం ప్రేమ, మరికొంచెం పెళ్ళి, ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఆకర్షణ" అని చెప్పింది (మా పిల్ల కొంచెం మెతకలా కనిపిస్తుంది కానీ తెలివైనదే) ఆ సమాధానం విన్న మా అందరికి ఏమీ అర్ధం కాలేదు. "ఆకర్షణా" అంటూ కళ్ళు పైకి తేలవేశాం. "అవును, ముమ్మాటికీ ఆకర్షణే", అంటూ అతను కొనసాగించాడు. "ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతో మొదలవుతుందన్నట్లు, ఎంత చిన్న/పెద్ద బంధమైనా ఆకర్షణతోనే మొదలవుతుంది. నిజం చెప్పండి రేపు మీతో జీవితాన్ని పంచుకోబోయే వాళ్ళ మీద మీకు ఆకర్షణ లేదా (మాలో అప్పటికో కొంతమందికి ఎంగేజుమెంట్లు జరిగిఉన్నాయి)?".

ఇంతలో మాలో ఇంకొకరు అందుకొన్నారు, "నువ్వు చెప్పేది నిజమే కావొచ్చు, కానీ ఆకర్షణ పునాదిగా జరిగే ఈ ప్రేమ/పెళ్ళి నిలబడుతాయా?" అని అడిగారు. దానికి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఫక్కున నవ్వి, "నేను ఆకర్షణతో మొదలవుతాయి అని అన్నానే గాని చివరి వరకు అదే ఆకర్షణ ఉంటుందని చెప్పలేదుగా. పోను పోను ఈ ఆకర్షణ తగ్గి చివరకి వాళ్ళ మధ్య కొంచెం/పూర్తి గానో మానసికమైన అనుభంధం ఏర్పడుతుంది. ఈ అనుభంధం స్థిరంగా ఉన్నవాళ్ళు తమ మిగతా సగం కోసమే జీవిస్తారు, అది లేని వాళ్ళు మిగతా వాళ్ల సగం కోసం వెంపర్లాడుతారు" అని ముక్తాయింపు ఇచ్చాడు.

చర్చ దారి తప్పుతుందేమోననిపించి, "సరే ప్రేమ, పెళ్ళి రెండూ వేరు వేరు అయినప్పుడు మరీ మీ పెళ్ళి ప్రేమపెళ్ళి కదా? మరి ఇదేమిటి? (భలే తెలివి ఉంది కదా నాకు? :-) )" అని ప్రశ్నించాను. దానికి అతను "ప్రేమ ముదిరితే మా పెళ్ళి జరిగింది కాబట్టి దాన్ని ప్రేమ పెళ్ళి అంటున్నాం, నిజానికి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది, కాకపొతే వాళ్ళ మధ్య ఆ మానసిక అనుభంధం చాలా తొందరగా ఏర్పడుతుంది. ఎందుకు అనేది కొంచెం అనలైజ్ చేస్తే మీకే తెలుస్తుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నా సరే వాళ్ల మధ్య సరైన మానసిక అనుభంధం ఏర్పడక పోవచ్చు, ఎందుకంటే వాళ్లు ప్రేమించుకొంటున్నాం అనే భావనని ప్రేమిస్తుంటారు. అందుకే చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్ళవు." అన్నాడు.

కానీ మేమందరం మా వాదనకే కట్టుబడి ఉన్నాం, ఎవ్వరమూ అతని వాదనని అంగీకరించలేదు. ఇదే అతనితో అన్నాం, "సరే మీరెవ్వరూ నాతో అంగీకరించం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని రెండు ప్రశ్నలు వెయ్యోచ్చా?" అని అడిగాడు. "సరే" అని అన్నాం. "మొదటి ప్రశ్న, ప్రేమ, పెళ్ళి రెండూ ఒకటే అని మీరందరి అభిప్రాయం, కదా? మరి ప్రేమించుకొన్న వారందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం లేదు? వాళ్లు ప్రేమించుకొంటున్నాం అన్న భావనని ప్రేమించారు అని ఇందాక నే చెప్పిన సమాధానం చెప్పొద్దు. అలా అయితే, చరిత్రలో గొప్ప ప్రేమలుగా నిలిచిపోయిన వారి పెళ్ళిళ్ళు ఎందుకు జరగలేదు?
రెండో ప్రశ్న, మన సమాజంలో ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్తున్నాయి? ప్రేమ పెళ్ళి రెండు కలిసి ఉంటే మరి వారెందుకు విడిపోవాలని నిర్ణయించుకొంటున్నారు?" ఈ రెండు ప్రశ్నలు విన్న తర్వాత మాలో అంతర్మధనం మొదలయింది. ప్రేమ పెళ్ళి రెండూ వేర్వేరా?

30 comments:

సుజాత said...

బాగుంది కలా నీ టపా!

నిస్సందేహంగా ప్రేమ ఆకర్షణతోనే మొదలవుతుంది అనేది ఒప్పుకుని తీరాల్సిందే. కాకపొతే అది తప్పనిసరిగా శారీరకమైన అందం వల్ల ఏర్పడే(అమ్మాయి తెల్లని రంగో,అబ్బాయి తెలివైన కళ్ళో చూసి ఏర్పడే) ఆకర్షణ కానక్కర్లేదు. అభిరుచులు కలిసినా అది ఆకర్షణకే దారి తీస్తుంది.

పెళ్ళి నిలబడటం అన్నది వారి మధ్య ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రేమించగానే ఆవేశపడి పెళ్ళాడెయ్యకుండా కొన్నాళ్ళు ఆలోచించుకోవడానికి టైం తీసుకోవాలి.ఎందుకంటే ఒక సారి పెళ్ళి జరిగాక అది పర్సనల్ మాత్రమే కాక సాంఘికం కూడా అవుతుంది కాబట్టి. దాని వైఫల్యం ప్రభావం ముందు జీవితం మీద ఉంటుంది కాబట్టి!

పెళ్ళి విఫలమవడం పెద్దవాళ్ళు కుదిర్చినవైనా, ప్రేమ పెళ్ళిళ్ళయినా అవగాహన లేకపోవడమే కారణం! ప్రేమ పెళ్ళిళ్ళు కూలిపోతే దాన్ని భూతద్దంలో చూడ్డం(ఎందుకంటే సమాజం మొత్తం అనుమతి ప్రేమ వివాహాలకు సాధారణంగా ఉండదు కాబట్టి) మనకు అలవాటైపోయింది.

చలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్లకపోవడానికి మీ స్నేహితుడు చెప్పింది మాత్రమే కారణం కాదు. రెండు వేపులా కుటుంబాలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం, తమ మీద తమకు నమ్మకం లేకపోవడం..! సేఫ్ గేం ఆడటం లాంటిదన్నమాట.

ప్రతాప్ said...

@సుజాతగారు,
ప్రేమ విఫలం అవ్వడం అనే కారణాల్లో మాత్రం మొదటిది వాళ్ళిద్దరి మధ్య మానసిక అనుభంధం లేక పోవడం అన్న అతని పాయింటుని నేను ఒప్పుకొంటాను (అలానే మీవి కూడా). నా ఊహ ప్రకారం, ఇద్దరి మధ్య మానసిక అనుభంధం బాగా ఉంటే, ఇద్దరూ ఇంకెవ్వరిని లెక్కచేయకుండా పెళ్ళికి సిద్దమవుతారనే అభిప్రాయం(అంటే మీరు చెప్పిన
కారణాలన్నీ దీని కిందకే వస్తాయి కదా?) అతని ఈ పాయింటు వెనుక కనిపిస్తుంది. ఇది నిజమో కాదో కలే తేల్చాలి.

ప్రతాప్ said...

నిస్సందేహంగా ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ఆ రెండింటిని కలిపేది మాత్రం నీ స్నేహితుడు/సుజాతగారు చెప్పినట్టు ఆకర్షణే. ఇందులో ఎటువంటి సందేహము అక్కర్లేదు. నాకీ సందర్భంలో సంతోషం సినిమా లోని ఒక డైలాగు గుర్తుకు వస్తోంది, "ప్రేమ అనేది ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం, కానీ పెళ్ళి మాత్రం రెండు కుటుంబాలకు చెందిన విషయం" ఇది ముమ్మాటికీ నిజం. ప్రేమ విఫలం అవడం ఇద్దరి మానసిక పరిణితి మీద ఆధారపడిఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ(?) బలంగా ఉన్నట్లయితే అది పెళ్ళికి దారి తీస్తుంది. లేకపోయినా అది పెళ్ళికి దారి తీస్తుంది (ఇద్దరూ వేర్వేరు వారిని చేసుకుంటారు కదా?).

కత్తి మహేష్ కుమార్ said...

హమ్మో! నేనీచర్చలో దిగకపోవడమే మంచిది.

ప్రతాప్ said...

మహేష్ గారు, మీరే అలా అంటే ఎలా అండీ? మీలాంటి పరిశీలనా శక్తి ఉన్నవాళ్ళు విషయం ఉన్న ఇలాంటి చర్చల్లో పాల్గొనకపోతే మాలాంటివాళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవాలి? కాబట్టి మీరు తప్పనిసరిగా కామెంట్ ఎట్టాల్సిన పోస్టు ఇది.

నిషిగంధ said...

సుజాత గారి అభిప్రాయంతో 100% ఏకీభవిస్తాను.. ప్రేమకి తొలిమెట్టు ఆకర్షణ.. అది శారీరకంగా అయినా లేక అభిరుచుల వల్ల అయినా! ఆ ఆకర్షణ ప్రభావంతో కాక అవగాహనతో పెళ్ళికి దారితీస్తే మంచిది.

కత్తి మహేష్ కుమార్ said...

యవ్వనంలోని ప్రేమకు ఎప్పుడూ ఆకర్షణే కారణం. అది శారీరకంకావచ్చు, భావజాలం కావచ్చు (కేవలం వామపక్ష/దళిత భావజాలం కలిసినకారణంగా ప్రేమించుకున్న జంటలు నాకు తెలుసు),అభిప్రాయాలు కావచ్చు,ప్రాపంచికధృక్కోణం కావచ్చు.

"శారీరకంతరువాత వచ్చినవన్నీ ఆదర్శాలుకదా ఆకర్షణము ఎలా?" అన్నసందేహం వచ్చుంటే దాంట్లో ఒక కిటుకుంది. యవ్వనస్తుల్లో చాలామంది తమ పూర్తి రూపాల్ని చూపించుకోరు.ఒకరికొకరు ఇష్టమనిపించే రూపాల్నే ఆ కలుసుకునే కొంతసేపు చూపించి ప్రేమకు పునాది వేస్తారు. అందుకే ఇవన్నీ ఆకర్షణలే అవుతాయి.

ఒకస్థాయి దాటిన తరువాత ఈ ఆకర్షణలోని ఆనందం జీవితాంతం ఉంటే బాగుండుననే కోరిక కలుగుతుంది. లేకపోతే కలిసుంటే బాగుంటుందనే ప్రాతిపదికపైనే ఆకర్షణని ప్రారంభించొచ్చుకూడా. ఆప్పుడు పెళ్ళిప్రస్తావన వస్తుంది.

ప్రేమ పెళ్ళి వేరు కావచ్చు కాకపోవచ్చు. అది వారి ఆకర్షణ తీవ్రత, కొనసాగింపుకోసం ఉదయించే కోరికా నిర్ణయిస్తాయి. విఫలమైన ప్రేమల్లో ఖర్మ ఏమిటంటే, ప్రేమికులుకాకుండా తల్లిదండ్రులో లేక ఏ ఇతర కోన్కిస్కా గొట్టంగాళ్ళో వీళ్ళ భవిష్యత్తుని నిర్ణయించడం.

చరిత్రలో గొప్పప్రేమలుగా నిల్చుండిపోయినవి ‘విఫలప్రేమలు’కాదు. ఒకస్థాయిలో చేతగాని ప్రేమలు మరోస్థాయిలో ఈ సమాజం కర్కశంగా తమ ఇష్టారాజ్యాన్ని నెరపిన ప్రేమలు.అవి ఎప్పటికీ ఆదర్శంకావు. సమాజపు శాడిజానికి ఆ కథలు ప్రతీకలు అంతే!

ప్రేమ static కాదు. అదిచాలా dynamic. అకారణంగా పుట్టేప్రేమ కారణం లేకుండా మాయమైపోతుంది.ఒకస్థాయిలో కలవకుంటే బ్రతకలేమనుకునే మనుషులు ఒకర్నొకరు చంపుకునేస్థితికి రావచ్చు. అది "ప్రేమ" సమస్యకాదు. మనుషుల మానసికపరిణితి సమస్య. ఏపెళ్ళైనా పెటాకులౌతుంది. ప్రేమపెళ్ళైతే నిర్ణయాధికారం వాళ్ళదేగాబట్టి కొంచెం ఎక్కువ. అదీ స్వాతంత్ర్యమంటే, ఇష్టపడితే కలిసి బతకాలి లేకుంటే విడిపడాలి. అందులో value judgment ఎందుకు?

Purnima said...

hmm.. interesting post!

నాకు మీ ప్రశ్నే తలకెక్కలేదు, ప్రేమ, పెళ్ళి ఒకటిగా చూడడం నా వల్ల కావటం లేదు.

ప్రేమకి గ్రాఫికల్ రిప్రసెంటేషన్ ఉంటే అది పడిలేసే కెరటంలా ఉంటుందని నా అభిప్రాయం. ఎప్పుడూ ఒకే స్థాయిలో, ఒకే ఇంటెన్సిటీతో ఉండదు. "నువ్వులేకపోతే బతకలేను" అన్నది ఒక స్థాయి అయితే, "నిన్ను చంపేసేంత పిచ్చి నాకు" అనేది కూడా ఒక స్థాయి. సన్నగా గిల్లి పులకరింపచేసే ప్రేమ ఉంటుంది, భీకరమైన ప్రకంపనాలు సృష్టించే ప్రేమా ఉంటుంది.

ఇంత వైబ్రెంట్ గా ఉండే ప్రేమనే ఆధారంగా చేసుకుంటే "పెళ్ళి" నిలబడడం కష్టం. పెళ్ళిలో అవతలి వ్యక్తిపై ప్రేమ ఒక ఎలిమెంట్ మాత్రమే. నమ్మకం, పరస్పర గౌరవం, మానసిక పరిణితి, అర్థం చేసుకోగలగడం.. ఇవ్వన్నీ కావాలి. ఎంత తలమునుకలై ప్రేమించుకున్న వారైనా పెళ్ళయ్యాక ప్రేమ కానీ కొంత అందాలని, అర్థాలని సంతరించుకుంటారు అని నా అభిప్రాయం. అదే, అరేంజ్డ్ మారేజస్ లో మెల్లి మెల్లిగా వీటన్నింటితో పాటు ప్రేమ కూడా పుట్టుకొస్తుంది.

మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టం కావున, ప్రేమించుకుంటే పెళ్ళి చేసేసుకోవాలి అని మన నమ్మకం. ప్రేమిస్తున్నా, కలిసి "మనం"గా మనలేమన్న భయం/ నమ్మకం కొందరిని ఆపడం నేను చూసిన జీవితం.

రాస్తూ పోతే, ఎదో ఒక చోట, మీ ప్రశ్నకి సమాధానం వస్తుందేమో అనుకున్నాను. అయినా ఆ ప్రశ్న నా తలకెక్కడం లేదు. మంచి చర్చ లేవదీసినందుకు ధన్యవాదాలు.

(ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ వ్యతిరేకించడానికి కావు. My observations are as limited as my ken, I've no regrets if I'm wrong)

రాధిక said...

మంచి చర్చ.ప్రేమ పెళ్ళి ఒక్కటి మాత్రం కాదు అని చెప్పగలను.వివరణ ఇవ్వదలచుకోలేదు.తరువాత వచ్చే ప్రశ్నలకి నేను వివరణ ఇవ్వలేను ఎందుకంటే అవి నా అభిప్రాయాలు.ఆ అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే నేనేమీ చెప్పలేక ఇలా సరిపెడుతున్నాను.

ప్రతాప్ said...

మహేష్ గారు,
యవ్వనంలోనే కాదు, ఎప్పుడూ కూడా ప్రేమకి తొలిమెట్టు మాత్రం ఖచ్ఛితంగా ఆకర్షణే, కాకపొతే అది ఎటువంటి ఆకర్షణో వాళ్ళ వాళ్ళ పరిణితిని బట్టి ఉంటుంది.

"శారీరకంతరువాత వచ్చినవన్నీ ఆదర్శాలుకదా ఆకర్షణము ఎలా?" నాకు ఈ ప్రశ్న అర్ధం కాలేదు.

ఈ కోన్కిస్కా గొట్టం గాళ్ళ సంగతి వదిలెయ్యండి. తల్లిదండ్రుల గురించి వాళ్ళిద్దరూ పట్టించుకోకపోతే వాళ్ళ మంచిచెడు గురించి ఎవరు పట్టించుకొంటారు? ఇద్దరు ఉద్యోగస్తులయితే రేపు పుట్టే బిడ్డని జాగ్రత్తగా ఎవరు చూసుకొంటారు? (మా ఆఫీసులో ఒక జంట ఉన్నారు. అబ్బాయి కేరళ, అమ్మాయి మహారాష్ట్ర. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకొన్నారు. వాళ్ళకి ఈ మధ్యే ముద్దులు మూటగట్టే పాప. ఆ పాపని ప్రస్తుతం ఇంటి వద్ద వదిలి ఇద్దరు ఆఫీసుకి వస్తారు. "మీకు కష్టమెయ్యడంలేదా?" అని అడిగితే తప్పడంలేదు. "మేము మా తల్లిదండ్రులని అర్ధం చేసుకోలేదో, లేక వారు మమ్మల్ని అర్ధం చేసుకోలేదో మొత్తానికి అందరం కష్టపడుతున్నాం" అన్న సమాధానం వారిదగ్గర నుంచి వచ్చింది.). వాళ్ళిద్దరిలో ఎవరోఒకరు జాబ్ ని వదిలేయ్యల్సిన పరిస్థితుల్లో లేకపోతే?

"అమ్మా, నాన్నా, నేనీ అమ్మాయిని ప్రేమించాను" అంటే ముందర వచ్చే ప్రశ్న "ఏ కులం?". ఈ కులం సమస్య రూపుమాసి పోనంతవరకు (పోవాలని కూడా చాలామంది కోరుకోవడం లేదు, మనలో మెజారిటీ ఆ సంఘానికి ప్రతినిధులే కదా?) ప్రేమ పెళ్ళికి ఈ సమ సమాజం(?) అనుమతి దొరకదు.

చరిత్రలో నిలిచిన ప్రేమలు ముమ్మాటికీ మనకు ఆదర్శమే, నా ఉద్దేశ్యం వాటిలోని ప్రేమ మనకు ఆదర్శమే, కాకపొతే ముగింపు మాత్రం ఆదర్శం కాదు. నిజమే వాటి ముగింపు మాత్రం సమాజపు శాడిజమే.

చివరి పారాగ్రాఫుతో నేను ఏకీభవిస్తాను. కాకపోతే ఇందులో value judgement ఏమీ లేదు. ప్రేమని, పెళ్ళిని కలిపిచూడటం ఎంతవరకు కరెక్టు అన్నదే అసలు సిసలు ప్రశ్న.

ప్రతాప్ said...

పూర్ణిమా,
ప్రేమ గురించి మీరు చెప్పింది అక్షర సత్యం అని నేను అనలేను. ప్రేమని ఆకర్షణని కలపడం ద్వారా మీరు కొద్దిగా గందరగోళానికి గురయ్యారేమో అని నాకనిపిస్తోంది. ప్రేమలో ఉత్దానపత్దానాలు ఉండవు. అదొక అనిర్వచనీయమైన అనుభూతి మాత్రమే. ప్రేమ స్థిరమైన sinX (0<=X<=90) గ్రాఫులా ఉండాలి అంతే కానీ ఇవాళ ఉన్న ప్రేమ తీవ్రత రేపు తగ్గిందంటే ఇది ముమ్మాటికీ ప్రేమ కానేకాదు.

"నువ్వులేకపోతే బతకలేను", "నిన్ను చంపేసేంత పిచ్చి నాకు" లాంటి ప్రేమలు, అవి ఎన్ని విపరీత పరిణామాలకి దారి తీసాయో, తీస్తున్నాయో ఇవ్వాళ మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి విపరీత ప్రేమల(?) గురించి మనం చర్చించడం అనవసరమేమో అనేది నా అభిప్రాయం.

మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టమే, కానీ పెద్దల అనుమతితో జరగని వివాహాల సంగతి కొద్దిగా ఆలోచించవలసిందే.

Purnima said...

Pratap: It was subjective and it remains so. I've nothing further to explain, as that would also be as subjective as it can get.

భావకుడన్ said...

కలగారు,

ఇది చాలా నచ్చిన టాపిక్ నాకు. దీని మీద డిసెంబర్ 2007 లో రాసుకుని స్కాన్ చేసిపెట్టుకున్న నేను మీ టపా పుణ్యమా అని ఇవాళ దాన్ని బ్లాగీకరించాను. ధన్యవాదాలు.

http://drbr1976.blogspot.com/2008/10/selection.html చూడండి.

భావకుడన్ said...

నా మటుకు నాకు మాత్రం పూర్ణిమ గారు తన బ్లాగులో ఒకప్పుడు రాసుకున్న ఈ పద్యం అక్షర సత్యం అనిపిస్తుంది ఈ "నిజమైన ప్రేమ-ఆకర్షణ" విషయంలో. ఒకసారి ఇది చూడండి.
http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_7515.html

కొత్త పాళీ said...

Interesting post (one of the better ones from you).
However, everyone whose views are expressed here (your friends, you and the commentators) are all wrong on some point or other.

ప్రతాప్ said...

కొత్తపాళీ గారు,
మీరు దార్శనికులు, ఇలా తప్పు ఉంది అని చెప్పి అది ఎక్కడో చెప్పకపోవడం కాస్త విడ్డూరంగా వుంది. మిగతావారు/నేను (అంటే కామెంట్ ఎట్టాం కదా సారూ) చెప్పిన పాయింట్లలో తప్పు ఎక్కడ ఉందో చెబితే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారేమో/ను.

కొత్త పాళీ said...

ప్రతాప్ గారూ, ఎంత అమాయకులండీ. నేను దార్శనికుణ్ణో దారిన పోయేవాణ్ణో పక్కన పెట్టండి. ఇన్ని బ్లాఉల్లో ఇన్ని చర్చలు, వాదోపవాదాలు, నీ ఆలోచన తప్పంటే నీ ఆలోచనే తప్పు అని ఋజువులు తర్కాలు రెఠోర్క్కులతో ధూముధాంఉగా జరుగుతున్నాయి గాదా .. ఎక్కడన్నా ఒక్కటంటే ఒక్క చోట అవతల వాళ్ళు చెప్పింది విని, అరే ఇది సబబుగానే ఉందే అనుకుని, తమ అభిప్రాయం మార్చుకున్న వాళ్ళు కనిపించారా మీకు? కనిపిస్తే మటుకు నా చెవిన కూడా వెయ్యండి, చాలా సంతోషిస్తాను.

ప్రతాప్ said...

మాష్టారు,
మిగతా వాళ్ల సంగతి వదిలెయ్యండి. వాళ్లు మారడం, మారక పోవడం వాళ్ల ఇష్టం. నా వాదన నాకు సమంజసమైనప్పుడు నేనెవ్వరు చెప్పినా వినను అనే వాళ్ళే ఎక్కువ. అటువంటి సందర్భంలో "వినదగు నెవ్వరు చెప్పిన" అనే పద్యం గుర్తుకు వస్తుంది. తప్పుందీ అంటూనే ఆ తప్పు చెప్పకపోవడమే నాకేదో కాస్త కంగాళీ గా ఉంది.

Anonymous said...

హ హ హ కొత్తపాళీ గారు... మీరు నా మదిలో చాలా రోజుల్నించి ఉన్న పాయింటు ను చెప్పారు.

After so much of time that I spent in blogging world(not only telugu), and followed so many conversations(?) on different topics on different platforms, I realized that "everyone is talking, no one is listening".

I see 'monologues', not 'dialogues/conversations', at least most of the times. There are always exceptions ofcourse.

Thanks for your comment!

కల said...

ఇది చదివి కామెంట్ రాసి నా వాఖ్యల కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ ముందుగా క్షమాపణలు.
ఊరికి వెళ్ళడం వల్ల మీ కంమెంట్లకి వెంటనే రిప్లై ఇవ్వలేక పోయాను.

@సుజాతగారు,
ప్రేమ విషయంలో మీరు చెప్పింది అక్షరసత్యం. అదే ఈ ప్రేమ పెళ్ళికి ఎందుకు ఎదురు నిలబడలేక పోతుంది అన్న ఆవేదనే ఈ టపాకు మూలా కారణం. సామాజిక కట్టుబాట్లు (కులం), ఆస్తులు అంతస్తులు వీటన్నింటిని ఎదిరించలేక పోతోంది. పెళ్లి నిలబడాలంటే పెద్దలని ఎదిరించాలా? ఒప్పించాలా? ఒప్పించలేని పరిస్థితులలో ఏం చెయ్యాలి. నాకు తెలిసిన ఒక జంట ఇలా పెద్దల అనుమతి కోసం నాలుగు సుదీర్ఘమైన సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆ పెద్దమనస్సు గల పెద్దలు ఇంతవరకు ఒక మెట్టు కూడా కిందకు దిగలేదు. పైపెచ్చు మీరు మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొంటే సమాజంలో ఒంటరి వారు అయిపోతారన్న బెదిరింపు ఒకటి. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళేం చెయ్యాలి?

కల said...

ప్రతాప్,
పెళ్ళికి ఇద్దరి మధ్య మానసిక అనుభంధం పటిష్టంగా ఉంటేనే చాలదు. ప్రేమకు అడ్డురానివెన్నో పెళ్ళికి అడ్డు వస్తాయి. పై కామెంట్లో నే చెప్పిన జంట ఇన్ని రోజులు పెళ్ళికి దూరంగా ఉన్నారంటే కారణం వారిద్దరి మధ్య మానసిక అనుభంధం లేనట్లేనా? ఉంది కాబట్టే పెద్దల అనుమతికోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. చివరకి పెద్దల సంతోషం కోసం వాళ్ళిద్దరూ తమతమ జీవితాలనే పణంగా కూడా పెట్టొచ్చు. అంతమాత్రాన వారిద్దరి మధ్యా మానసిక అనుభంధం లేనట్లేనా?

కల said...

నిషిగంధ గారు,
మీఖాతాలో ఒక థాంక్స్ వేసుకోండి.

కల said...

@మహేష్ గారు,
మీ వాఖ్యలతో చివరి వరకు ఏకీభవిస్తాను. కానీ చరిత్రలో విఫలమైన ప్రేమలగురించి ప్రతాప్ చెప్పింది కూడా నిజమేనని నాకనిపిస్తోంది.

మీ కామెంటు నిజంగా ప్రేమలోని మరోకోణాన్ని/మరో కారణాన్ని చూపించింది.

కల said...

@పూర్ణిమా,
మీరు చెప్పింది నిజమే, పెళ్ళికి క్షణక్షణానికి మారే ప్రేమని అధారం చేసుకుంటే మాత్రం ఆ పెళ్లి నిలబడటం కష్టమే. కానీ ప్రేమ మొదలయిన తర్వాత ఇరువురి మధ్యా వచ్చే అవగాహనా, నమ్మకం వీటి బేస్ గా ఆ పెళ్లి జరిగితే అది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది.

అదే అరేంజ్డ్ మారేజస్ లో ప్రేమ కండిషనల్, అంటే ప్రేమ వ్యక్తితో మొదలవ్వదు, ఆ స్థానంతో మొదలవుతుంది. నాకు భర్త/భార్య గా ఎవరైతే ఆ స్థానంలోకి వస్తారో వారినే ప్రేమించాలి. ఇదే అక్కడ వచ్చిన చిక్కు. కానీ పెద్దలు కుదిర్చిన వివాహాల్లో విఫలమైన వివాహాల శాతం ప్రేమపెళ్ళి విఫలమైన శాతంతో పోలిస్తే తక్కువ. ఇది ఎందుకో అందరికి తెలిసిన సత్యమే అని నేను అనుకొంటున్నా.

కల said...

@రాధిక గారు, ఇంత చర్చ జరిగిన తర్వాత నా అభిప్రాయాలకి కొంచెం రూపు వచ్చింది. ప్రేమ వేరు, పెళ్లి వేరు. కానీ రెంటిని కలిపేది,నిలిపేది మాత్రం ఖచ్చితంగా ఆకర్షణే. నిజమే వీటి విషయంలో ఎవరి ఒపీనియన్స్ వారివి.

కల said...

భావకుడన్ గారు,
మీ టపా ప్రస్తుతానికి ఇంకా చదవలేదు. చదివి నా అభిప్రాయాన్ని తర్వాత చెబుతాను. నా టపా వలన ఒక మంచి కథ చదువరులకి దర్శనమయిందంటే అది నాకు కాస్త ఆనందంగా ఉంది.
మీ వల్ల ఒక మంచి కవితని చదవ గలిగాను. అందుకు కృతజ్ఞతలు.

కల said...

కొత్తపాళీ గారు,
మీక్కూడా కృతజ్ఞతలు. తప్పులేంటో చెబితే వాటిని ఒకసారి వెరిఫై చేసుకొనే దానికి బావుంటుందేమో!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇన్ని బ్లాఉల్లో ఇన్ని చర్చలు, వాదోపవాదాలు, నీ ఆలోచన తప్పంటే నీ ఆలోచనే తప్పు అని ఋజువులు తర్కాలు రెఠోర్క్కులతో ధూముధాంఉగా జరుగుతున్నాయి గాదా .. ఎక్కడన్నా ఒక్కటంటే ఒక్క చోట అవతల వాళ్ళు చెప్పింది విని, అరే ఇది సబబుగానే ఉందే అనుకుని, తమ అభిప్రాయం మార్చుకున్న వాళ్ళు కనిపించారా మీకు? కనిపిస్తే మటుకు నా చెవిన కూడా వెయ్యండి, చాలా సంతోషిస్తాను.----హహ్హ హ్హ నాక్కూడా,నా చెవినా వెయ్యండి :)

fruit said...

love and marriage topics py Ph.d chesaara?gud.

krishnababu said...

Refreshing Telugu blogs..

preama pelli okate ante.. india lo proper multiple marriages chattam undalemo.. (na rendu paisalu)

PS: naa browser telugu lo rayanu po anindi.. :D