నేనీమధ్య నా సహాధ్యాయిని అతని భార్యని (తను కూడా నా సహాధ్యాయే) కలవడం జరిగింది. వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి. కులం పేరుతో దూరం చెయ్యబోయిన పెద్దలనెదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు. అమ్మాయిది చాలా మెతక వైఖరి, అతనేమో విజ్ఞానఖని, ఆపదలో ఉన్నవారిని ఎంతకైనా తెగించి ఆదుకొంటాడు, ఎవరన్నా సహాయం అడిగితే లేదు అనకుండా ఇద్దరూ కలిసే చేస్తారు. అందుకే ఆ జంట get-to-gather ఏర్పాటు చేస్తే మా కాలేజి స్నేహితులంతా మిస్ కాకుండా హాజరు వేయించుకొంటాము. అతనితో ఎప్పుడూ వాదన జరపడం నాకొక సరదా. అలాంటి వాళ్ళతో వాదన జరపడం వల్ల నాకు ఎంతో కొంత జ్ఞానం పెరుగుతుందనే స్వార్ధంతో అతనితో వాదన జరుపుతాను.
అందరం భోజనాలు కావించి కబుర్లలో మునిగితేలుతున్నాం. ఇంతలో నాకొక డౌటు వచ్చింది (అదేమిటో బుర్రలో ఎప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి), అదే అతని ముందు వుంచాను, "ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" అని. అందరు తడుముకోకుండా రెండూ దాదాపు ఒకటే, ఒకటి ఇంకో దానిలో అంతర్భాగం (మాకెవ్వరికి అంత జ్ఞాన సంపద లేదులెండి) అన్నారు. ఇంచుమించు నా ఆలోచనా తీరు కూడా ఇదే. కాని అతను మాత్రం "రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు, వివరంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక స్థితి, అలానే పెళ్ళి కూడా ఇంకొక స్థితి. మనిషి ఒక స్టేజి లోంచి ఇంకో స్టేజి లోనికి వెళుతాడు. కాకపొతే ప్రేమ ముందా? పెళ్ళి ముందా? అనేది అతని/ఆమె ఆలోచనలని బట్టి ఉంటుంది" అని అన్నాడు.
నేను ఊరుకుంటానా? "లేదు, రెండూ ఒకదానికొకటి సంభంధం లేని విషయాలు అని అంటున్నావు. కాని ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఉంచేది ప్రేమా? లేక పెళ్ళా?" అని (అతి)తెలివిగా ప్రశ్నించాను. దానికి సమాధానం అతను చెప్పేలోపలే, అతని భార్య అందుకొని "కొంచెం నమ్మకం, ఇంకొంచెం ప్రేమ, మరికొంచెం పెళ్ళి, ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఆకర్షణ" అని చెప్పింది (మా పిల్ల కొంచెం మెతకలా కనిపిస్తుంది కానీ తెలివైనదే) ఆ సమాధానం విన్న మా అందరికి ఏమీ అర్ధం కాలేదు. "ఆకర్షణా" అంటూ కళ్ళు పైకి తేలవేశాం. "అవును, ముమ్మాటికీ ఆకర్షణే", అంటూ అతను కొనసాగించాడు. "ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతో మొదలవుతుందన్నట్లు, ఎంత చిన్న/పెద్ద బంధమైనా ఆకర్షణతోనే మొదలవుతుంది. నిజం చెప్పండి రేపు మీతో జీవితాన్ని పంచుకోబోయే వాళ్ళ మీద మీకు ఆకర్షణ లేదా (మాలో అప్పటికో కొంతమందికి ఎంగేజుమెంట్లు జరిగిఉన్నాయి)?".
ఇంతలో మాలో ఇంకొకరు అందుకొన్నారు, "నువ్వు చెప్పేది నిజమే కావొచ్చు, కానీ ఆకర్షణ పునాదిగా జరిగే ఈ ప్రేమ/పెళ్ళి నిలబడుతాయా?" అని అడిగారు. దానికి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఫక్కున నవ్వి, "నేను ఆకర్షణతో మొదలవుతాయి అని అన్నానే గాని చివరి వరకు అదే ఆకర్షణ ఉంటుందని చెప్పలేదుగా. పోను పోను ఈ ఆకర్షణ తగ్గి చివరకి వాళ్ళ మధ్య కొంచెం/పూర్తి గానో మానసికమైన అనుభంధం ఏర్పడుతుంది. ఈ అనుభంధం స్థిరంగా ఉన్నవాళ్ళు తమ మిగతా సగం కోసమే జీవిస్తారు, అది లేని వాళ్ళు మిగతా వాళ్ల సగం కోసం వెంపర్లాడుతారు" అని ముక్తాయింపు ఇచ్చాడు.
చర్చ దారి తప్పుతుందేమోననిపించి, "సరే ప్రేమ, పెళ్ళి రెండూ వేరు వేరు అయినప్పుడు మరీ మీ పెళ్ళి ప్రేమపెళ్ళి కదా? మరి ఇదేమిటి? (భలే తెలివి ఉంది కదా నాకు? :-) )" అని ప్రశ్నించాను. దానికి అతను "ప్రేమ ముదిరితే మా పెళ్ళి జరిగింది కాబట్టి దాన్ని ప్రేమ పెళ్ళి అంటున్నాం, నిజానికి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది, కాకపొతే వాళ్ళ మధ్య ఆ మానసిక అనుభంధం చాలా తొందరగా ఏర్పడుతుంది. ఎందుకు అనేది కొంచెం అనలైజ్ చేస్తే మీకే తెలుస్తుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నా సరే వాళ్ల మధ్య సరైన మానసిక అనుభంధం ఏర్పడక పోవచ్చు, ఎందుకంటే వాళ్లు ప్రేమించుకొంటున్నాం అనే భావనని ప్రేమిస్తుంటారు. అందుకే చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్ళవు." అన్నాడు.
కానీ మేమందరం మా వాదనకే కట్టుబడి ఉన్నాం, ఎవ్వరమూ అతని వాదనని అంగీకరించలేదు. ఇదే అతనితో అన్నాం, "సరే మీరెవ్వరూ నాతో అంగీకరించం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని రెండు ప్రశ్నలు వెయ్యోచ్చా?" అని అడిగాడు. "సరే" అని అన్నాం. "మొదటి ప్రశ్న, ప్రేమ, పెళ్ళి రెండూ ఒకటే అని మీరందరి అభిప్రాయం, కదా? మరి ప్రేమించుకొన్న వారందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం లేదు? వాళ్లు ప్రేమించుకొంటున్నాం అన్న భావనని ప్రేమించారు అని ఇందాక నే చెప్పిన సమాధానం చెప్పొద్దు. అలా అయితే, చరిత్రలో గొప్ప ప్రేమలుగా నిలిచిపోయిన వారి పెళ్ళిళ్ళు ఎందుకు జరగలేదు?
రెండో ప్రశ్న, మన సమాజంలో ఎందుకు ఇన్ని పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్తున్నాయి? ప్రేమ పెళ్ళి రెండు కలిసి ఉంటే మరి వారెందుకు విడిపోవాలని నిర్ణయించుకొంటున్నారు?" ఈ రెండు ప్రశ్నలు విన్న తర్వాత మాలో అంతర్మధనం మొదలయింది. ప్రేమ పెళ్ళి రెండూ వేర్వేరా?